Fact check: అసత్య రాతలు.. తప్పుడు వ్యాఖ్యలు

Eenadu Ramoji Rao Fake News on Jagananna Vidya Deevena and Jagananna Vasathi Deevena - Sakshi

ఏపీలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో చింతలేని ఉన్నత విద్య

ఏడాదికి సగటున రూ.4,044కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

టీడీపీ హయాంలో రూ.2,428 కోట్లు మాత్రమే

సీఎం జగన్‌ వచ్చిన తర్వాతే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ఇది చూసి ఓర్వలేకే ఎల్లో మీడియా దుష్ప్రచారం

వాటిని చదివి అవగాహనలేక కొన్ని ప్రతిపక్షాలు అర్థరహిత విమర్శలు

తిరిగి ప్రతిపక్షాల విమర్శలనే పెద్దపెద్ద హెడ్డింగ్‌లతో ముద్రిస్తున్న ఎల్లో మీడియా

ఐదేళ్లలో టీడీపీ రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం రూ.18,576 కోట్ల చెల్లింపు

16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1778 కోట్లు బకాయిపెట్టిన చంద్రబాబు

పాత బకాయిలను సైతం తీర్చిన సీఎం జగన్‌

ఒకప్పుడు రూ.35 వేలలోపు ఇస్తే.. ఇప్పుడు రూ.3 లక్షల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన’ పథకాలు చింతలేని ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ఐటీఐ  నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎందరో పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివే అవకాశం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇది ఎల్లో మీడియాకు ఏమాత్రం రుచించట్లేదు.

పేదింటి బిడ్డను ప్రభుత్వం ఉన్నత చదువులకు తీసుకెళ్తుంటే ఓర్వలేక దుష్ప్రచారానికి పాల్పుడుతోంది. దీనికి తోడు అసలు ప్రభుత్వ పథకం లక్ష్యం, అది ఎలా అమలవుతోంది కనీస పరిజ్ఞానం లేని కొన్ని ప్రతిపక్షాలు ఈ తప్పుడు వార్తల ఆధారంగా  అర్థరహిత విమర్శలు చేస్తున్నాయి. తిరిగి వాటినే మళ్లీ ఎల్లో మీడియా పెద్దపెద్ద హెడ్డింగ్‌లతో  ముద్రిస్తూ పైశాచిక ఆనందం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి సగటున రూ.2,428 కోట్లుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044కోట్లుగా ఉంది.  

అప్పట్లో అప్పులు చేసి ఫీజులు కట్టే దుస్థితి 
గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక అవస్థలు పడేవారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్‌టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులుచేసి మరీ తమ పిల్లలను చదివించాల్సిన దుస్థితి ఉండేది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడేది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఏడాదికి రూ.35 వేలలోపు ఇస్తే..  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.3లక్షలకు వరకు చెల్లిస్తూ పేదల విద్యను పట్టం కడుతోంది. జవాబుదారీ తనం పెంచేలా, పారదర్శకంగా తల్లి, విద్యార్థి జాయింట్‌ బ్యాంకు ఖాతాల్లో ప్రతి త్రైమాసికానికి విద్యాదీవెనను జమ చేస్తోంది.

టీడీపీ హయాంలో సగటు చెల్లింపు స్వల్పం..
గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌ కింద సగటున ఏడాదికి రూ.2066 కోట్లు, హాస్టల్‌ ఖర్చుల కింద రూ.362 కోట్లు మాత్రమే చెల్లించేది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.12,141 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వం 2017 నుంచి 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1778 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెడితే.. సీఎం జగన్‌ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా తీర్చింది.

ఈ ప్రభుత్వంలో పెరిగిన ఖర్చు..
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 27లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఏకంగా రూ.18,576 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలతో కలిపి) చెల్లించింది. ఏడాదికి సగటున విద్యాదీవెన కింద రూ.2835 కోట్లు, వసతి దీవెన కింది అత్యధికంగా రూ.1068.94 కోట్లు ఖర్చు చేస్తోంది. 

ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధి
గతంలో వసతి దీవెనలో రూ.4వేల నుంచి రూ.10వేల మధ్య స్లాబ్‌ పెట్టిమరీ ఇచ్చేవారు. కానీ  సీఎం జగన్‌   స్లాబ్‌ విధానాన్ని తొలగించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సమానంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చు కోసం ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ వీలైనంత మందిని అర్హులుగా చేర్పించేందుకు కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2లక్షలకు ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని వర్గాలు వారికీ కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. పీజీ విద్యలో ప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ వర్సిటీ విద్యను ప్రోత్సహించేలా అక్కడే పూర్తి రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top