ఏది నిజం ?: సీబీఐ నుంచి రామోజీ ‘లై’వ్‌ రిపోర్టింగ్‌

Eenadu Ramoji Rao Fake News On CBI YS Vivekananda Reddy Issue - Sakshi

ఇద్దరు మాట్లాడుకున్నది ‘ఈనాడు’కెలా తెలుస్తోంది?

బాబు అనుకూల మీడియాకే లీకులెందుకు ఇస్తున్నారు?

ఇంట్లో కాఫీ,టీలిచ్చే వారిని ‘పీఏ’ అంటారా?.. ఇంట్లో వ్యక్తులు బిజీగా ఉన్నప్పుడు వారి పనివాళ్లకు సమాచారమివ్వరా?

అదే పెద్ద నేరమైనట్లుగా పదేపదే భారతమ్మ పేరు తెస్తున్నారెందుకు?

మరణించిన వివేకా... అవినాశ్‌ రెడ్డికి చిన్నాయనే కదా?

పీఏ కృష్ణారెడ్డి దగ్గర దొరికిన లేఖ నాన్న రాసిందే: వివేకా కుమార్తె

తామొచ్చే వరకూ ఆ లేఖను ఎవరికీ ఇవ్వొద్దని కూడా ఆమె చెప్పారు

ఈ విషయాన్ని ఆమె డీఐజీకి చెప్పినట్లు వెల్లడించిన ఎస్పీ

వివేకా మరణించారని తొలుత చెప్పింది ఆయన బావమరిది శివప్రకాశ్‌ రెడ్డి.. గుండెపోటుతో మరణించారని ఆయనే చెప్పారన్న ఆదినారాయణ రెడ్డి

తనకూ ఆయన చెబితేనే వచ్చానని వెల్లడించిన అవినాశ్‌ 

మరి కావాలని దుష్ప్రచారమేల?

అప్పుడు హోటల్లో పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు కూడా లేరు. కానీ... ‘‘ఇదిగో యాభై మంది వచ్చేశారు... అదిగో ఆ సంఖ్య 100కు పెరిగింది. ఇంకేముంది... అంతా ఇక్కడికే చేరారు... అందరూ చంద్రబాబుకే మద్దతు పలుకుతున్నారు’’ అంటూ 1995 ఆగస్టులో పచ్చి అబద్ధాలతో ‘లైవ్‌’ రిపోర్టింగ్‌ చేశారు రామోజీరావు గారు. ఫలితంగా ఎన్‌టీఆర్‌ ప్రభుత్వం కూలిపోయింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది జరిగి 26 ఏళ్లు గడిచిపోయినా ‘ఈనాడు’ మారలేదు. ఆ తరహా ‘లైవ్‌’ రిపోర్టింగ్‌ మానలేదు!!.  

‘ఈనాడు’ మారకపోయినా కాలం మారింది. మీడియా మారింది. రామోజీ చెప్పిందే నిజమనే భ్రమలు పోయి.. ఆయన అబద్ధాలు తప్ప ఏమీ చెప్పలేరనే నిజం బయటపడింది. వైఎస్‌ వివేకా హత్యకేసులో కొద్దిరోజులుగా సీబీఐ పేరు చెబుతూ ‘ఈనాడు’ వండి వారుస్తున్న కథనాల వెనక ఉద్దేశాలు సుస్పష్టం.

ఎన్ని అబద్ధాలు చెప్పయినా కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డిపై బురదజల్లాలి. అలా చేస్తే.. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌కు ఆయన బంధువు కనక సీఎం కుటుంబానికి కూడా కాస్త బురద అంటించొచ్చు. తద్వారా పూర్తిగా గ్రాఫ్‌ పడిపోయి... ఉత్త పుత్రుడిని, దత్తపుత్రుడిని కలిపి మరీ జనం మీదికి పంపిన తన చంద్రబాబుకు కాస్తయినా మేలు జరగొచ్చు. ఇదే రామోజీ ఏకసూత్ర అజెండా!!. తాజా కథనాలన్నీ ఈ అజెండాలో భాగమే. 

ఇక్కడ ప్రధాన ప్రశ్న ఒక్కటే!. ఒక వ్యక్తిని సీబీఐ విచారించిందనుకుందాం. సీబీఐ ప్రశ్నలకు తను సమాధానాలు చెబుతాడు. అది వాళ్లిద్దరికే తెలుస్తుంది. మరి రామోజీరావుకు, ఆయన తోక పత్రికకు,  టీవీ5కు ఎలా తెలుస్తోంది? వాళ్లు మాత్రమే ‘లైవ్‌’ రిపోర్టింగ్‌ ఎందుకు చేస్తున్నారు? ఎలా చేయగలుగుతున్నారు? సీబీఐ ఎవరికి నోటీసులిచ్చిందో... ఎవరికి ఇవ్వబోతోందో వారికి మాత్రమే ఎలా తెలుస్తోంది? రామోజీకి అతీంద్రీయ శక్తులున్నాయా? లేక సీబీఐ ఆఫీసులో పొంచి వింటున్నారా? ఇదంతా కావాలనే చేస్తున్నారని... ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో ఇదంతా భాగమేనని తెలియటం లేదా?
వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని ఆయన బావమరిది శివప్రకాష్‌రెడ్డి విజయవాడలో ఉన్న తనకు ఫోన్‌ చేసి చెప్పాడని టీడీపీ నాయకుడు, ఆదినారాయణరెడ్డి సిట్‌ విచారణ సందర్భంగా చెబుతున్న దృశ్యం.. ఇందుకు సంబంధించిన వీడియో లింక్‌  https://www.youtube.com/watch?v=uGiQpc&ANqw   

అటెండరుకు, పీఏకు తేడా తెలీదా?
బురద జల్లటానికి, జనంలో అపోహలు సృష్టించడానికి ‘ఈనాడు’ తనకు ఏది అనుకూలంగా ఉంటే అది రాసేస్తుందన్నది పచ్చినిజం. ఇంటికి వచ్చిన వారికి కాఫీ–టీ అందిస్తూ అటెండరుగా ఉన్న వ్యక్తిని ‘పీఏ’గా ‘ఈనాడు’ రాస్తుండటం కూడా ఇలాంటిదే. ముఖ్యమంత్రి ఇంట్లో ఇలాంటి పనిచేసే నవీన్‌ను భారతమ్మ పీఏ అంటూ రామోజీ రాసిన రాతలు... దిగజారుడుకు పరాకాష్ట.  

చంద్రబాబు గ్రాఫ్‌ పెంచడానికి ‘ఈనాడు’ ఈ స్థాయికి పతనమైపోతుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. సహజంగా ఇంట్లోవాళ్లకు ఫోన్‌ చేసినపుడు వాళ్లు గనక అందుబాటులో లేకుంటే అక్కడ పనిచేసే వాచ్‌మెన్, తోటమాలి, డ్రైవర్‌... ఇలా తెలిసిన వారికి ఫోన్‌ చేస్తారు. అలా నవీన్‌ ఫోన్‌కు కాల్స్‌ వచ్చాయంటూ భారతమ్మను టార్గెట్‌ చేశారంటే వీళ్లు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారన్నది అర్థం కావటం లేదా?

మరణించిన వై.ఎస్‌.వివేకానందరెడ్డి ఎంపీ అవినాశ్‌ రెడ్డికి చిన్నాయన. అవినాశ్‌ రెడ్డి అప్పటికే సిటింగ్‌ ఎంపీ. ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా వెలువడటంతో మళ్లీ టికెట్‌ను ఆయనకే కన్‌ఫర్మ్‌ చేశారు. దీంతో అవినాశ్‌కు మద్దతుగా వైఎస్‌ వివేకా ప్రచారం కూడా మొదలెట్టారు. హత్య గురించి తనకు తెలియటంతో అది చెప్పటానికి ఆయన కొందరు బంధువులకు ఫోన్‌ చేసి ఉండొచ్చు.

అందులో తప్పేమయినా ఉందా? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సభలు... అక్కడ మాట్లాడాల్సిన ప్రసంగాలు... తదితరాలపై అంతా బిజీగా ఉన్న సమయంలో ఓఎస్‌డీకి ఫోన్‌ చేసి... ఆయన దొరక్కపోతే అటెండర్‌కో, డ్రైవర్‌కో ఫోన్‌ చేసి సమాచారాన్ని చెప్పమని కోరితే తప్పా? అదేమైనా ఘోరమా? దానికి చిలవలు పలవలు జోడించి ఇంత దుష్ప్రచారం చేయాలా? ఫిలిం సిటీ కోటలో రామోజీరావుకు ఇలాంటి అటెండర్లు లేరా? ఎందుకీ దిగజారుడు రాతలు? 

ఇవన్నీ వాస్తవాలు కాదా?
మొదటి నుంచీ స్థానిక పోలీసులు చెబుతున్నదాని ప్రకారం ఎంపీ అవినాశ్‌ రెడ్డి అక్కడకు చేరేసరికే జనం పోగై ఉన్నారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని, సిగరెట్లు ఎక్కువ తాగటం వల్లే ఇలా జరిగిందని తనతో వివేకా బావమరిది శివప్రకాశ్‌ రెడ్డి చెప్పినట్లు స్వయంగా నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి  ఆదినారాయణరెడ్డి వీడియో సహితంగా చెప్పారు.

అదే శివప్రకాశ్‌ రెడ్డి తనకూ చెప్పినట్లు అవినాశ్‌ రెడ్డి చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికని బయలుదేరిన తాను... వివేకా మృతి గురించి శివప్రకాశ్‌ రెడ్డి చెబితే తిరిగి వెనక్కి వచ్చానని చెప్పారాయన. మరి అందరికీ చెప్పింది శివప్రకాశ్‌ రెడ్డే అయినపుడు... అవినాశ్‌నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డికి ఉదయం 5 లేదా 5.30 గంటలకు అక్కడొక లేఖ దొరికింది.

ఆ లేఖ రాసింది వివేకానందరెడ్డేనని, అందులోని రాత ఆయనదేనని వివేకా కుమార్తె స్వయంగా డీఐజీ ఎదుట అంగీకరించారు. ఆ విషయాన్ని నాటి కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ వెల్లడించారు కూడా. ఆ లేఖనెవరు చూసినా... అది సహజ మరణం కాదని అర్థమయ్యేది. పోలీసులకో, అక్కడికి వచ్చిన వారికో వెంటనే ఆ లేఖను ఇచ్చి ఉంటే... అక్కడి వ్యవహారం మరోలా ఉండేది. కానీ పీఏకు ఆ లేఖను, వివేకా ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని తాము వచ్చేవరకూ అలాగే ఉంచుకోవాలని కృష్ణారెడ్డికి వివేకా కుమార్తె, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు.

ఈ విషయాన్ని కూడా కుమార్తె సునీత పోలీసుల దగ్గర అంగీకరించారు. అలా ఎందుకు చెప్పారని అడిగితే... డ్రైవర్‌ ప్రసాద్‌కు ప్రాణభయం ఉంటుందనే ఉద్దేశంతోనే అలా చెప్పామన్నారు. మరి ఆ దిశగా ఎందుకు దర్యాప్తు సాగలేదు? రామోజీరావుకు ఇది తెలీదా? ఎందుకీ దుర్మార్గపు రాతలు?
లేఖ గురించి వైఎస్‌వివేకా కుమార్తె సునీత చెప్పిన అంశాలను విలేకరులకు వెల్లడించిన డీఐజీ (నాటి ఈనాడు క్లిప్పింగ్‌)  

కుమార్తెకు–రెండో భార్యకు విభేదాలు లేవా?
వైఎస్‌ వివేకా కుమార్తెకు, ఆయన రెండో భార్యకు మధ్య విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యం. వాళ్లిద్దరి మధ్య సామాజిక మాధ్యమాల్లో నడిచిన దారుణమైన మెసేజీలే ఇందుకు సాక్ష్యం. వివేకా కుమార్తె, అల్లుడికి బీటెక్‌ రవితో ఇప్పటికీ మంచి సంబంధాలున్నాయి. బీటెక్‌ రవిని అప్పట్లో పోలీసులు విచారించినా కూడా ఆ వివరాలెందుకు వెల్లడించలేదు? రామోజీకి ఇవన్నీ తెలిసినా... ఒక బీటెక్‌ రవిని కాపాడటానికో, ఒక చంద్రబాబు గ్రాఫ్‌ పెంచటానికో మరీ ఇంత దారుణంగా పతనమైపోయి రాయటం న్యాయమేనా? సీబీఐ అంటే చంద్రబాబు బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ కాదు కదా? మరి రామోజీకి అన్ని విషయాలూ ఎలా తెలుస్తున్నాయి? హత్య జరిగిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. అప్పుడే ఆ లెటర్‌ కూడా దొరికింది. దాని ఆధారంగా అప్పటి నుంచీ ఇన్వెస్టిగేషన్‌ ఎందుకు సాగలేదు? రకరకాలుగా తిప్పి... ఇప్పుడు ముఖ్యమంత్రి సన్నిహిత కుటుంబీకులకు అంటగట్టడానికి ప్రయత్నిస్తుండటంలో కుట్ర స్పష్టంగా కనిపించటం లేదా? ఇంకెప్పుడు మారతారు రామోజీరావు గారూ? 

విచారించింది సాక్షిగానే అని తెలిసీ బురదజల్లడం...
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటివరకు 200మందికిపైగా సాక్షులను విచారించింది. అదే రీతిలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిని ఈ కేసులో సాక్షిగానే విచారించింది. అనంతరం  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్డీ  కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన నివాసంలో పని చేసే నవీన్‌లను సాక్షులుగానే విచారణకు పిలిచింది. బాధ్యతాయుతమైన పౌరులుగా సాక్షులుగానే సీబీఐ విచారణకు హాజరై సహకరించారు.

కానీ దీనికి రాజకీయ రంగు పులిమి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌ మోహన్‌రెడ్డి కుటుంబం పై బురదజల్లేందుకు ప్రయత్నించడం ఈనాడు మార్కు దిగజారుడు జర్నలిజం. ఈ కేసులో గతంలో వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ  ప్రకాశ్‌ రెడ్డిలను గతంలో సీబీఐ సాక్షులుగా విచారించింది. అప్పుడు మాత్రం ఈనాడు  కళ్లకు గంతలు కట్టుకుని కూర్చుందా.? అప్పుడులేని హడావుడి ఇప్పుడు ఎందుకంటే...కేవలం చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కల్పించడానికే అన్నది సుస్పష్టమవుతోంది. 

మరీ ఇంత దిగజారుడా రామోజీ...!
సాక్షిగా సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరైన అనంతరం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తనంతట తాను వెనుదిరిగారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి వచ్చి ఆయన్ని తన వాహనంలో ఎక్కించుకుని తీసుకువెళ్లారని ఈనాడు రాయడం కంటే అవాస్తవం మరొకటి ఉండదు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి రావడం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌సిటీలోని కొండపై అక్రమంగా  నిర్మించుకున్న రాజప్రాసాదం నుంచి శాటిలైట్‌ ద్వారా రామోజీరావు చూశారా..! అసలు ఆయన అక్కడకు రానే లేదు. కానీ కేఎస్‌ జవహర్‌రెడ్డి వచ్చి కృష్ణ్ణమోహన్‌రెడ్డిని తీసుకువెళ్లినట్టుగా రాయడం ఏ పాత్రికేయ నీతో రామోజీరావుకే తెలియాలి మరి. ప్రభుత్వంపై దుష్ప్రచారం కోసం మరీ ఇంత బరితెగించాలా రామోజీ...!

హంతకుడే అప్రూవరా..! కళ్లుమూసుకున్నావా రామోజీ
వైఎస్‌ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి హత్య చేశాను అని ఈ కేసులో  నిందితుడు దస్తగిరి అంగీకరించారు. అటువంటి అతన్ని సీబీఐ ఈ కేసులో అప్రూవర్‌గా పేర్కొనడం విస్మయపరుస్తోంది. పైగా దస్తగిరి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించకపోవడంపై న్యాయ నిపుణులే అవాక్కయ్యారు. హత్య చేసిన వ్యక్తి జైలులో ఉండాలి. కానీ అతను దర్జాగా బయట తిరుగుతున్నాడు.

ఇవేవీ ఈనాడు రామోజీ రావు కంటికి కనిపించడం లేదా... మరెందుకు ప్రశ్నించ లేదు...!? ఇక హంతకుడు అయిన దస్తగిరి చెప్పిన కల్పితాలను ఆధారంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తుండటం వెనుక ఉన్న మర్మమేమిటీ... ఎవరు ప్రభావితం చేశారన్నది నిపుణులు లేవనెత్తుతున్న సందేహం. దీనిపై కూడా ఈనాడు దృష్టిసారించలేదు. ఎందుకంటే చంద్రబాబు పలుకులు పలుకుతున్న చిలక దస్తగిరి. అందుకే దస్తగిరి చెబుతున్న కట్టుకథలకు వంత పాడుతున్నావా రామోజీ...!

ఎంపీ టికెట్‌ అవినాశ్‌రెడ్డికి అని నిర్ధారించాకా రాద్ధాంతం  ఏమిటో...
2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ పై సందిగ్దత ఉందనే అభూత కల్పనలతో ఈనాడు రామోజీరావు ప్రజలను పక్కదారి పట్టించేందుకు నానా పాట్లూ పడుతున్నారు. కానీ వాస్తవం ఏమిటన్నదీ అందరికీ తెలుసు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగానే ఖరారు చేశారు.  

కడప లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా వైఎస్‌ వివేకానందరెడ్డిని నియమించారు. అవినాశ్‌ రెడ్డి గెలుపు  కోసం వివేకానందరెడ్డి అప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. వివేకానందరెడ్డి హత్య తరువాత కూడా ఆయన కుమార్తె వైఎస్‌ సునీత అదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ చెప్పారు ఎంపీ టికెట్‌పై ఇంత స్పష్టత ఉన్న తరువాత కూడా అదేదో ఎంపీ టికెట్‌ కోసం వైఎస్‌ కుటుంబంలో పోటీ నెలకొందని అవాస్తవాలను ఈనాడు ప్రముఖంగా ప్రచురిస్తుండటం కేవలం ఎల్లో జర్నలిజమే. 

వైఎస్‌ వివేకాను కుట్ర పూరితంగా ఓడించింది చంద్రబాబే 
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు, రామోజీరావు కుయుక్తులు పన్నుతున్నారు. అందుకే వైఎస్‌ వివేకానందరెడ్డిపై ఎక్కడలేని ఆపేక్ష చూపిస్తున్నట్టు డ్రామాకు తెరతీశారు. కానీ కడప జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌వివేకానందరెడ్డిని కుట్రపూరితంగా ఓడించింది చంద్రబాబే కదా. వైఎస్సార్‌ మరణానంతరం భార్య, కుమార్తె ఒత్తిడితో వైఎస్‌వివేకానందరెడ్డి కాంగ్రెస్‌పార్టీలో ఉండిపోయారు.

వైఎస్‌విజయమ్మపై పులివెందులలో పోటీ చేశారు కూడా. అయినా సరే అనంతర పరిణామాల్లో పార్టీలోకి వస్తానంటే చిన్నాన్న మీద గౌరవ, అభిమానాలు ఉన్న వైఎస్‌ జగన్‌ ఆయన్ని సాదరంగా స్వాగతం పలికారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఎందుకంటే కడప జిల్లాలో స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకే మెజా­ర్టీ ఉంది. కానీ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుట్రపూరితంగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఓడించారు. అందుకు ఈనాడు, ఎల్లో మీడి­యా వత్తాసు పలికింది నిజం కాదా రామోజీ...!

అధికారంలో ఉంటే సీబీఐని నిషేధించింది బాబే కదా...
ప్రస్తుతం సీబీఐ దర్యాప్తును వక్రీకరిస్తూ కథనాలు రాస్తున్న ఈనాడు రామోజీరావు టీడీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం నిద్రపోయారనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో తమ అవినీతిని ఎక్కడ బయటపెడుతుందో అని చంద్రబాబు ఆనాడు రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశించకుండా నిషేధించారు. కేంద్ర దర్యాప్తు సంస్థపై నిషేధం విధిస్తే ఈనాడు కనీసం ప్రశ్నించలేదు. సరి కదా స్వాగతించింది.

అంటే అప్పట్లో సీబీఐ అంటే ఓ పనికిమాలిన సంస్థగా చంద్రబాబు, ఈనాడు రామోజీరావు భావించారు. అటువంటి వారిద్దరూ ప్రస్తుతం సీబీఐ ని ఆకాశానికెత్తుతుండటం గమనార్హం. టీడీపీ అధికారంలో ఉంటే ఓ రీతి... ప్రతిపక్షంలో ఉంటే మరో రీతా ...! చంద్రబాబు సీబీఐ పై విధించిన నిషేధాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎత్తివేశారు. సీబీఐ అంటే భయముంటే ఆ పని ఎందుకు చేస్తారు. కానీ ఈ విషయాన్ని మాత్రం ఈనాడు ప్రస్తావించదు. 

తులసమ్మ లేవనెత్తిన సందేహాలపై దర్యాప్తు ఏదీ...?
ఈ కేసులో అరెస్టు అయిన శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ సీబీఐ దర్యాప్తు తీరును తప్పుబడుతూ న్యాయస్థానంలో ఓ పిటిషన్‌ వేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఎవరు చేసి ఉంటారనే సహేతుక ఆధారాలతో ఆమే నివేదించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలు... రెండో భార్య కుమారునికి ఆస్తిలో వాటా ఇస్తానని ఆయన చెప్పడంతో విభేదించిన మొదటి భార్య, కుమార్తె సునీత.

అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్‌ రెడ్డిలు పాల్పడిన కుట్రలు...  పులివెందులలో రాజకీయ ఆధిపత్యంపై కన్నేసిన టీడీపీ నేత బీటెక్‌ రవి అందుకు అడ్డుగా ఉన్న వివేకానందరెడ్డిపై కక్ష పెంచుకోవడం... ఆర్థిక విభేదాలతో వైఎస్‌ వివేకానందరెడ్డిపై కక్ష పెంచుకున్న అనుచరుడు కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి... ఆయనతో రాజకీయంగా విభేదిస్తున్న తాడిపత్రి నేత రాజేశ్వరరెడ్డి, సహకరించిన నీరుగట్టు ప్రసాద్‌ ... ఇలా వీరందరి పాత్రపై దర్యాప్తు జరపాలని కోరుతూ తులసమ్మ ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది. ఇంతటి కీలక అంశాలు మాత్రం ఈనాడు కంటికి కనిపించలేదు.

ఆమె ఆవేదనను ప్రచురించాలని భావించనూ లేదు. కేసు దర్యాప్తు సక్రమంగా జరగాలని కోరుకోనూ లేదు. కేవలం చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తూ... వైఎస్‌ కుటుంబంపై దుష్ప్రచారం చేయడమే ఈనాడు రామోజీ రావు పనిగా పెట్టుకున్నారు...

కానీ చంద్రబాబు గానీ రామోజీరావుగానీ గుర్తించని నిజం ఏమిటంటే... ఇవి 1995నాటి రోజులు కావు...చంద్రబాబు చెప్పే అవాస్తవాలు... ఈనాడు వండి వార్చే అభూతకల్పనలను ప్రజలు నమ్మే రోజులు పోయాయి. వారి కుట్రలు, దుష్ప్రచారాన్ని తాము నమ్మడం లేదని 2019 ఎన్నికల్లో ప్రజలు ఘంటాపథంగా తేల్చి చెప్పారు. ఇప్పటికీ ప్రజల ఏకకంఠంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డినే బలపరుస్తున్నారన్నది సుస్పష్టం. ఆ నిజాన్ని గుర్తించి కూడా గుర్తించనట్టు వ్యవహరిస్తుండటం చంద్రబాబు, ఈనాడు అజ్ఞానం.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top