
2021లో సెకీ ఒప్పందం.. 2023లో సెకీ సీఎండీగా గుప్తా నియామకం
ఇప్పుడు గుప్తా తొలగింపునకు ఆ ఒప్పందంతో ఏ లెక్కన లింకు!?
ఈనాడు ఎల్లో జర్నలిజంపై విస్తుపోతున్న విద్యుత్ రంగ నిపుణులు
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలని సెకీతో గత సర్కార్ ఒప్పందం
ఇదివరకెన్నడూ లేనంత తక్కువ ధరకు యూనిట్ రూ.2.49కే కొనుగోలు
2021 సెప్టెంబర్ 15న స్వయంగా ప్రతిపాదించిన సెకీ
సుదీర్ఘ అధ్యయనం తర్వాత 2021 డిసెంబర్ 1న నాటి ప్రభుత్వం ఒప్పందం
నాటి నుంచి నేటి వరకూ కొనసాగుతున్న దు్రష్పచారం
యూనిట్ రూ.4.60తో చంద్రబాబు యాక్సెస్ ఒప్పందంపై మాత్రం నోరు మెదపని వైనం.. ఎల్లో పత్రిక వైఖరిని ఎండగట్టిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండన్న చందంగా తయారైంది ఎల్లో మీడియా. ప్రజలు ఏమనుకుంటారన్న సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు కోసం ఎంతగా బరితెగించడానికైనా సై అంటోంది. వలువలూడదీసుకుని పచ్చి అబద్ధాలను అచ్చేస్తోంది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు హక్కుగా అందించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ–సెకీ)తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది.
ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) వరకు అన్ని విధాలుగా ఆమోదం లభించింది. అయినా గత ప్రభుత్వంపై బుదర జల్లాలి.. జగన్‌పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం గక్కాలి.. అనే అజెండాతో అర్థం లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ కరపత్రం ఈనాడు, ఎల్లో మీడియా అసత్య కథనాలను వండివారుస్తూనే ఉంది. తాజాగా సెకీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించడాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో ముడిపెట్టి ఈనాడు పచ్చి అబద్ధాలతో శనివారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది.
ఎప్పుడో 2021లో జరిగిన ఒప్పందానికి 2023లో సీఎండీగా చేరిన అధికారికి సంబంధం ఏమిటనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దిగజారుడు రాతలతో తన నైజాన్ని చాటుకుంది. ‘సెకీ’తో ఒప్పందం కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆరి్ధక భారం పడుతుందని, అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎఎస్‌టీఎస్)ల నుంచి మినహాయింపు లభించదని ఇప్పటికే అనేక సార్లు అసత్య కథనాలను రాసి భంగపడ్డ టీడీపీ కరపత్రం ఇప్పుడు అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చాలని చూస్తోంది. యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్‌ను అందించే సెకీ ఒప్పందంపై ఇంతగా విషం చిమ్ముతున్న ఈనాడు.. అంతకు దాదాపు రెట్టింపు ధర యూనిట్ రూ.4.60తో చంద్రబాబు ప్రభుత్వం యాక్సిస్ అనే ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం కళ్లున్న గుడ్డి వాడిలా నటిస్తోంది.
ముడుపులకు ఆస్కారం ఎక్కడ?
⇒ వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత చూసి, యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్‌ను అందిస్తామంటూ 2021 సెపె్టంబర్ 15న సెకీ లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాల (కమర్షియల్ ఆపరేషన్ డేట్)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్‌టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచి్చందని ఆ లేఖలో సెకీ స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాంటి చార్జీలు వర్తించవని లేఖలో వివరంగా చెప్పింది. రెండు నెలల సుదీర్ఘ చర్చలు, సమగ్ర అధ్యయనం తర్వాత సెకీతో గత ప్రభుత్వం, డిస్కంలు మధ్య త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. రాష్ట్ర మంత్రి మండలితో పాటు ఏపీఈఆర్‌సీ ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే ఈ ఒప్పందం జరిగింది.
⇒ సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. ఈ ధర అప్పటికి ఎనీ్టపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ప్రస్తుతం చంద్రబాబు కుదుర్చుకున్న రూ.4.60 కన్నా రూ.2.11 తక్కువ.
⇒ ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.5.10 ఖర్చు అవుతోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్లు సెకీ విద్యుత్ వల్ల ఆదా అవుతుంది. కానీ ఈ ఒప్పందంలో ముడుపుల వ్యవహారం వల్లే సెకీ సీఎండీని కేంద్రం తప్పించిందంటూ ఈనాడు వక్ర భాష్యం చెప్పింది. ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేటు సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా..? ఇంత చిన్న లాజిక్ కూడా ఈనాడుకు తెలియదా?
⇒ అదీకాక 2021లో ఒప్పందం జరిగినప్పుడు గుప్తా సెకీ సీఎండీనే కాదు. ఆయన ఆ పదవి చేపట్టిందే 2023 జూన్‌లో. ఈనెల 10న ఆయ న్ను పదవి నుంచి తొలగించారు. అంటే సెకీ ఒప్పందం జరిగినప్పుడు ఆయన పదవిలోనే లేరు. అలాంటిది ఆ ఒప్పందంతో ఆయనకు ఎలా ముడిపెడతారనే కనీస జ్ఞానం కూడా టీడీపీ కరపత్రానికి లేకుండా పోయిందని విద్యుత్ రంగ నిపుణులు విస్తుపోతున్నారు.
బురదజల్లడమే పని
⇒ ఈ ఒప్పందంలో రైతుల పట్ల జగన్‌కు నిబద్ధత తప్ప స్వప్రయోజనం అనేది మచ్చుకైనా కనిపించదు. అయితే ఈ ఒప్పందంలో ఏ మాత్రం ప్రమేయం లేని అదానీ నుంచి లంచాలందాయంటూ గత ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దానికి జగన్‌కు ముడిపెట్టి అత్యుత్సాహంతో విష ప్రచారం చేస్తూ.. పుంఖానుపుంఖాలుగా అసత్యాలు వండి వార్చింది టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు.
⇒ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని భయపడుతున్న ఈనాడు.. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తోంది. దానికి అనుబంధంగానే సెకీ చైర్మన్ తొలగింపునూ ఈ ఒప్పందానికి ముడి పెడుతూ కుట్రలు పన్నుతోంది. దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా చిత్రీకరిస్తోంది.
⇒ గతేడాది నవంబర్‌లో గౌతమ్ అదానీ, ఇతర కార్యనిర్వాహకులపై లంచం తీసుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగం మోపినప్పుడు, వాటికి ఎలాంటి ఆధారాలు లేనందున సెకీ ఆ ఆరోపణలపై ఎలాంటి విచారణ చేపట్టదని గుప్తా ప్రకటించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఖండించారు. గతేడాది నవంబర్ 6న, నకిలీ పత్రాలను సమరి్పంచారనే ఆరోపణలతో రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్‌యు బిఇఎస్‌ఎస్‌ను మూడు సంవత్సరాల పాటు టెండర్లలో పాల్గొనకుండా సెకీ నిషేధించింది.
⇒ కానీ ఢిల్లీ హైకోర్టు ఆదేశం తర్వాత ఆ నిషేధాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది మేలో, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్‌యు సన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (సీపీఏ)పై సెకీ సంతకం చేసింది. దీనికి తప్పుడు ధృవపత్రాలను సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతోనే కేంద్రం నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న గుప్తాను ఉన్నపళంగా తొలగించిందంటూ జాతీయ మీడియా ఇప్పటికే అనేక కథనాల్లో వెల్లడించింది. ఈ వాస్తవాన్ని ఈనాడు నిస్సిగ్గుగా దాస్తోంది.
అది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?
ఈనాడుపై వైఎస్సార్‌సీపీ మండిపాటు
‘వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్యాలను ఖండిస్తూ ‘ఎక్స్’లో ఆ పార్టీ ఈ మేరకు పోస్టు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2021 డిసెంబర్‌లో జరిగిందని, 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తాను నియమించారని తెలిపింది. అలాంటప్పుడు ఏపీ–సెకీ ఒప్పందానికి ఏం సంబంధం ఉంటుందని ఆ పార్టీ ప్రశ్నించింది.
‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాక ముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణల నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా ఐదారు రోజుల క్రితమే జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ నిస్సిగ్గుగా ఎల్లో పత్రిక ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది.
ఈనాడుకు ధైర్యం ఉంటే సెకీతో ఒప్పందాన్ని రద్దు చేయమని మీ గ్యాంగ్ లీడర్ చంద్రబాబుకు చెప్పు. ఈనాడులో రూ.1.90కే యూనిట్ సౌర విద్యుత్ వస్తుందని రాశారు. మరలాంటప్పుడు మొన్న యాక్సిస్‌తో రూ.4.60కి కొనుగోలు చేస్తూ ఎందుకు ఒప్పందం చేసుకున్నావని దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించు. లేదా తప్పుడు రాతలు రాసినందుకు ప్రజల్ని క్షమాపణలు కోరాలి’ అంటూ ఈనాడు రాసిన ఫేక్ న్యూస్ కథనాన్ని జత చేసి, శనివారం ఎక్స్ పోస్ట్‌లో వైఎస్సార్‌సీపీ నిలదీసింది.