
16,347 పోస్టులకు గాను 15,941 పోస్టుల భర్తీ
అభ్యర్థులు లేక మిగిలిన 406 పోస్టులు వచ్చే డీఎస్సీకి బదిలీ
విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడి
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైనవారి తుది జాబితాను సోమవారం సచివాలయంలో పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజుతో కలిసి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విడుదల చేశారు. డీఎస్సీ–2025లో ప్రకటించిన 16,347 పోస్టుల్లో 15,941 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన 406 పోస్టులకు ఆయా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేనందున వాటిని వచ్చే డీఎస్సీకి బదిలీ చేసినట్టు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన వారిలో 7,955 మంది మహిళలు(49.9 శాతం), 7,986 మంది పురుషులు(50.1 శాతం) ఉన్నారని చెప్పారు.
టెట్ మార్కులకు 20 శాతం... డీఎస్సీ మార్కులకు 80శాతం వెయిటేజీ: డీఎస్సీకి 3,36,300 మంది నుంచి 5,77,675 దరఖాస్తులు అందాయని, సీబీటీ విధానంలో జూన్ 6 నుంచి జూలై 2 వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించినట్టు కోన శశిధర్ వెల్లడించారు. టెట్ స్కోర్‌కు 20శాతం, డీఎస్సీ మార్కులకు 80శాతం వెయిటేజీ ఇచ్చి మెరిట్ జాబితాలను తయారు చేశామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా డీఈవో కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లతోపాటు www.apdsc.apcfss.in లో అందుబాటులో ఉంచామని తెలిపారు.
అభ్యర్థులు 8125046997, 9398810958, 7995649286, 7995789286 ద్వారా సహాయం పొందొచ్చన్నారు. డీఎస్సీపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన, పెండింగ్‌లో ఉన్న 100కి పైగా కేసులపై న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులందరికీ ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామకపత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. అనంతరం 22 నుంచి 29 వరకు జిల్లాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి పోస్టింగ్స్ ఇస్తామని వివరించారు.
ఉన్నతమైన ఉద్యోగం పొందడం అభ్యర్థి హక్కు: హైకోర్టు
డీఎస్సీ–2025 నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వీటిలో రిజర్వేషన్ల అమలు, స్పోర్ట్స్ కోటాతోపాటు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యం తీసుకోవడం తదితర విషయాల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పోస్టుల ప్రాధాన్యంపై హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందడం అభ్యర్థి హక్కని స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారికి ఉన్నతమైన పోస్టును ఎంచుకునే హక్కు ఉందని, వారికి ఆ పోస్టులు కేటాయించాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్జీటీ పోస్టుకు మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఉన్నతమైనదని, పైగా ఎస్జీటీ నుంచి ప్రమోషన్‌తో కూడుకున్నదని పేర్కొంది.
ఈ తీర్పు కాపీ ఆదివారం అభ్యర్థులకు చేరడంతో వారు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, డైరెక్టర్లకు మెయిల్ చేశారు. గతంలో బిహార్ కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే విధమైన తీర్పును ఇచ్చినట్టు న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం హడావుడిగా విద్యాశాఖ డీఎస్సీ ఫైనల్ జాబితాను విడుదల చేయడం గమనార్హం. తప్పును సరిదిద్దకుండా హైకోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే ఫలితాలు వెల్లడించేశామని చెప్పేందుకు ఇలా చేసినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
విద్యాశాఖ వాదన ప్రకారం తొలి ప్రాధాన్యం ఎస్జీటీకి ఇచ్చిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైనా వారు ఎస్జీటీ పోస్టుకు మాత్రమే అర్హులవుతారు. దీని ప్రకారం.. ఎస్జీటీగా ఎంపికైనవారు 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసినా స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ వస్తుందో... రాదో... తెలియదు. ఈ క్రమంలో కొందరు ఎస్జీటీలుగానే ఉద్యోగ విరమణ చేసే అవకాశం ఉంది.’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారు 4 వేల మంది అభ్యర్థుల వరకు ఉంటారని చెబుతున్నారు.