breaking news
list released
-
డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైనవారి తుది జాబితాను సోమవారం సచివాలయంలో పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజుతో కలిసి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విడుదల చేశారు. డీఎస్సీ–2025లో ప్రకటించిన 16,347 పోస్టుల్లో 15,941 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన 406 పోస్టులకు ఆయా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేనందున వాటిని వచ్చే డీఎస్సీకి బదిలీ చేసినట్టు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన వారిలో 7,955 మంది మహిళలు(49.9 శాతం), 7,986 మంది పురుషులు(50.1 శాతం) ఉన్నారని చెప్పారు. టెట్ మార్కులకు 20 శాతం... డీఎస్సీ మార్కులకు 80శాతం వెయిటేజీ: డీఎస్సీకి 3,36,300 మంది నుంచి 5,77,675 దరఖాస్తులు అందాయని, సీబీటీ విధానంలో జూన్ 6 నుంచి జూలై 2 వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించినట్టు కోన శశిధర్ వెల్లడించారు. టెట్ స్కోర్‌కు 20శాతం, డీఎస్సీ మార్కులకు 80శాతం వెయిటేజీ ఇచ్చి మెరిట్ జాబితాలను తయారు చేశామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా డీఈవో కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లతోపాటు www.apdsc.apcfss.in లో అందుబాటులో ఉంచామని తెలిపారు.అభ్యర్థులు 8125046997, 9398810958, 7995649286, 7995789286 ద్వారా సహాయం పొందొచ్చన్నారు. డీఎస్సీపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన, పెండింగ్‌లో ఉన్న 100కి పైగా కేసులపై న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులందరికీ ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామకపత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. అనంతరం 22 నుంచి 29 వరకు జిల్లాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి పోస్టింగ్స్ ఇస్తామని వివరించారు.ఉన్నతమైన ఉద్యోగం పొందడం అభ్యర్థి హక్కు: హైకోర్టుడీఎస్సీ–2025 నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వీటిలో రిజర్వేషన్ల అమలు, స్పోర్ట్స్ కోటాతోపాటు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యం తీసుకోవడం తదితర విషయాల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పోస్టుల ప్రాధాన్యంపై హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందడం అభ్యర్థి హక్కని స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారికి ఉన్నతమైన పోస్టును ఎంచుకునే హక్కు ఉందని, వారికి ఆ పోస్టులు కేటాయించాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్జీటీ పోస్టుకు మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఉన్నతమైనదని, పైగా ఎస్జీటీ నుంచి ప్రమోషన్‌తో కూడుకున్నదని పేర్కొంది.ఈ తీర్పు కాపీ ఆదివారం అభ్యర్థులకు చేరడంతో వారు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, డైరెక్టర్లకు మెయిల్ చేశారు. గతంలో బిహార్ కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే విధమైన తీర్పును ఇచ్చినట్టు న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం హడావుడిగా విద్యాశాఖ డీఎస్సీ ఫైనల్ జాబితాను విడుదల చేయడం గమనార్హం. తప్పును సరిదిద్దకుండా హైకోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే ఫలితాలు వెల్లడించేశామని చెప్పేందుకు ఇలా చేసినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ వాదన ప్రకారం తొలి ప్రాధాన్యం ఎస్జీటీకి ఇచ్చిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైనా వారు ఎస్జీటీ పోస్టుకు మాత్రమే అర్హులవుతారు. దీని ప్రకారం.. ఎస్జీటీగా ఎంపికైనవారు 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసినా స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ వస్తుందో... రాదో... తెలియదు. ఈ క్రమంలో కొందరు ఎస్జీటీలుగానే ఉద్యోగ విరమణ చేసే అవకాశం ఉంది.’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారు 4 వేల మంది అభ్యర్థుల వరకు ఉంటారని చెబుతున్నారు. -
11 మంది అభ్యర్థులతో బీజేపీ మరో జాబితా
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ శనివారం 11 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన భర్తృహరి మహతాబ్, రవ్నీత్ సింగ్ బిట్టూ, సుశీల్ కుమార్ రింకూ, ప్రణీత్ కౌర్ తదితర సిట్టింగులున్నారు. వీరంతా అవే స్థానాల నుంచి మళ్లీ బరిలోకి దిగుతున్నారు. అమెరికాలో భారత మాజీ రాయబారి తరన్జీత్ సింగ్ సంధు అమృత్‌సర్‌లో పోటీ చేయనున్నారు. 2019లో బీజేపీ తరఫున నార్త్‌వెస్ట్ ఢిల్లీలో గెలుపొందిన హన్స్ రాజ్ హన్స్ ఈసారి ఫరీద్కోట్ బరిలో ఉంటారు. బీజేడీకి గుడ్ బై చెప్పిన భర్తృహరి కటక్ నుంచి పోటీ చేస్తున్నారు. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే 5.8 శాతం ఓట్లు పెరిగినట్లు పేర్కొంది. ►తెలంగాణలో 3,17,17,389 మంది ఓటర్లు ►పురుష ఓటర్ల సంఖ్య : 1,58,71,493 ►మహిళా ఓటర్ల సంఖ్య : 1,58,43,339 ►ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య : 2,557 ►సెప్టెంబర్ 28 నాటికి కొత్త ఓటర్ల సంఖ్య 17,01,087 18-19 సంవత్సరాల మధ్య వయసు వారు 8,11,640 మంది ఓటర్లు. అంటే 5.1.2023 కంటే 5,32,990 పెరుగుదల. బోగస్, బదిలీ చేయబడిన ఓటర్లు తొలగించబడ్డారు. 6,10,694 మంది మరణించిన కారణంగా వారి పేర్లు తొలగించారు. 5,80,208 ఓటర్లకు ఇంటి నంబర్లలో సవరణలు జరిగాయి. చదవండి: TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ -
వైఎస్ఆర్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల
-
జేమీసన్‌కు తొలిసారి చోటు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ తాజా సంచలనం కైల్ జేమీసన్‌కు న్యూజిలాండ్ క్రికెట్ 2020–21 సీజన్‌కుగానూ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్థానం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన సిరీస్ ద్వారా వన్డే, టెస్టుల్లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల జేమీసన్ అద్భుతంగా రాణించాడు. అరంగేట్ర వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడంతో పాటు... అనంతరం జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 9 వికెట్లతో పాటు బ్యాట్‌తోనూ రాణించి కివీస్ సిరీస్‌ను 2–0 తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇతడితో పాటు ఎడంచేతి వాటం స్పిన్నర్ ఎజాజ్ పటేల్, డేవన్ కాన్వేలు కూడా తొలిసారి ఈ జాబి తాలో చోటు దక్కించుకోగా... ఓపెనర్ మన్రో, జీత్ రావల్, ఇటీవల టెస్టుల నుంచి రిటైరైన టాడ్ ఆస్టల్లు తమ కాంట్రాక్టును కోల్పోయారు. మొత్తం 20 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టు లభించింది. న్యూజిలాండ్ కాంట్రాక్ట్ క్రికెటర్ల జాబితా: విలియమ్సన్, బౌల్ట్, గ్రాండ్‌హోమ్, ఫెర్గూసన్, గప్టిల్, హెన్రీ, జేమీసన్, టామ్ లాథమ్, నికోల్స్, సాన్ట్నెర్, నీషమ్, సౌతీ, రాస్ టేలర్, వాగ్నర్, వాట్లింగ్, ఎజాజ్ పటేల్, సోధి, బ్లన్‌డెల్, డేవన్ కాన్వే, విల్ యంగ్. -
82 మందితో బీజేపీ రెండో జాబితా
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 82 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి (బళ్లారి), మాజీ సీఎం బంగారప్ప కుమారుడు కుమార్ బంగారప్ప (సోరబ్)లకు చోటు దక్కింది. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రను పార్టీ వరుణ నియోజకవర్గం నుంచి బరిలో దించింది. ఈ స్థానంలో కాంగ్రెస్ తరపున సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర పోటీ చేస్తున్నారు. యడ్యూరప్ప సన్నిహితుడు కృష్ణయ్య శెట్టి బీజేపీ తరపున మాలూర్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అయితే, సీఎంపై చాముండేశ్వరి నుంచి పోటీచేసే అభ్యర్థి పేరును మాత్రం ఇంకా కమలదళం వెల్లడించలేదు. ఏప్రిల్ 8న 72 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన పేర్లతో ఇప్పటివరకు బీజేపీ మొత్తం 154 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించినట్లయింది. రెండ్రోజుల్లో మిగిలిన పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
72 మందితో బీజేపీ తొలి జాబితా
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం బీజేపీ 72 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. యడ్యూరప్పను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించిన బీజేపీ.. షికారిపుర నుంచి ఆయన్ను బరిలోకి దింపింది. పార్టీ కీలక నేతలైన జగదీశ్ షెట్టర్ (హుబ్లీ–ధార్వాడ్ సెంట్రల్), కేఎస్ ఈశ్వరప్ప (షిమోగా), బి. శ్రీరాములు (మొలకల్మురు) తదితరులకు ఈ జాబితాలో చోటు దక్కింది. మొత్తం 224 నియోజకవర్గాలకోసం రెండో విడత జాబితాను మరో రెండ్రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏప్రిల్ 15న ఒకే విడతలో మొత్తం అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. -
రాజ్యసభ బరిలో జీవీఎల్
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ 18 మందితో జాబితాను ఆదివారం విడుదల చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి బరిలో దిగుతారని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా జీవీఎల్‌కు మంచి పేరుంది. భారత ప్రధాని అయ్యే సత్తా మోదీకి ఉందని 2011లోనే జీవీఎల్ తెలిపారు. ప్రస్తుతం ఈయన బీజేపీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అటు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు అనిల్ జైన్, సరోజ్ పాండే, అధికార ప్రతినిధి అనిల్ బాలుని తదితరులకు అవకాశం కల్పించింది. మహారాష్ట్ర నుంచి రాణే.. జైన్, జీవీఎల్లు ఉత్తరప్రదేశ్ నుంచి, ఛత్తీస్‌గఢ్ నుంచి పాండే, ఉత్తరాఖండ్ నుంచి బాలుని బరిలో దిగుతారని పేర్కొంది. కిరోడి లాల్ మీనా, మదన్‌లాల్‌లను రాజస్తాన్ నుంచి, కేరళ మాజీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధరన్‌ను మహారాష్ట్ర నుంచి బరిలో దించనుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్న బలాల కారణంగా 18 మంది సభ్యుల విజయం ఖాయమే. మార్చి 23న ఎన్నికలు జరనుండగా.. నామినేషన్లకు సోమవారమే చివరితేది. మిషన్ 2019 లక్ష్యంతో.. రాణేకు పట్టం గట్టడం ద్వారా మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో బలం పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. రాజస్తాన్‌లో మీనా వర్గానికి ప్రతినిధిగా ఉన్న కిరోడీలాల్కు టికెట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతనుంచి గట్టెక్కాలని బీజేపీ భావిస్తోంది. -
సివిల్ సర్వీసెస్ శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2018 శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు http://studycircle.cgg.gov.in/tstw వెబ్సైట్లో జాబితాను చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 3న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హిమాయత్ సాగర్ రోడ్‌లోని మానస హిల్స్ వైటీసీలో నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పరిశీలనకు హాజరు కావాలని తెలిపారు. శిక్షణా తరగతులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇతర వివరాలకు 040–27540104, 7799886980, 8522914704 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. -
కార్యదర్శుల జాబితా విడుదల
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శి పోస్టుల మెరిట్ జాబితా ఖరారైంది. కలెక్టర్ బి.శ్రీధర్ ఆమోదం తెలపడంతో బుధవారం అర్హుల జాబితాను జిల్లా యంత్రాంగం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. గతేడాది నవంబర్‌లో జిల్లాలోని 122 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టినప్పటికీ.. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్యదర్శులకు 25శాతం వెయిటేజీ ఇచ్చారు. దీంతో భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ.. వెయిటేజీ నేపథ్యంలో కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులే ఎక్కువగా ఎన్నికయ్యారు. కేవలం డిగ్రీ మార్కుల ఆధారంగా 20మంది అర్హత సాధించగా, 100 మంది కాంట్రాక్టు కార్యదర్శులు ఎంపికయ్యారు. మరో రెండు పోస్టులు అభ్యర్థులు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి డిసెంబర్ ఆరో తేదీన ఈ జాబితా ప్రకటించాల్సిఉండగా.. పలువురు కాంట్రాక్టు కార్యదర్శులు కోర్టును ఆశ్రయించారు. దీంతో జాబితా విడుదలపై న్యాయ సలహా కోసం ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జాబితా విడుదలలో తాత్సారం జరిగినట్లు తెలిసింది. తాజాగా ఈ అంశంపై స్పష్టత రావడంతో బుధవారం జాబితాను విడుదల చేశారు. మెరిట్ జాబితాలో ఉన్న వారు ఈ నెల 7వ తేదీన ఉదయం 10.30గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి డీపీఓ వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. మెరిట్ జాబితా కోసం: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. రంగారెడ్డి.ఏపీ.జీఓవీ.ఇన్


