
ఎస్జీటీ, ఎస్‌ఏపీఈ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లలో గుర్తింపు
ప్రాథమిక కీలో కరెక్టుగా ఇచ్చి.. ఫైనల్ కీలో మార్చారంటున్న అభ్యర్థులు
ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని ఆవేదన
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 తుది ‘కీ’లో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎస్‌ఏ పీఈ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పేపర్లలో ఈ తప్పులు దొర్లినట్టు చెబుతున్నారు. అందుకు ఆధారాలను సైతం చూపుతున్నారు. వాస్తవానికి ఆయా పరీక్షలు పూర్తయిన తర్వాత డీఎస్సీ పరీక్షల విభాగం ప్రాథమిక ‘కీ’లను విడుదల చేసింది. వాటిపై ఏమైనా తప్పులుంటే సరైన ఆధారాలతో వెబ్‌సైట్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా అభ్యర్థనల్ని పంపించారు. అయితే, తాము తెలిపిన అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, తీరా తుది ‘కీ’లో తాము పేర్కొన్న అంశాలపై కాకుండా సరిగా ఉన్న వాటిని మార్పులు చేసినట్టు కనిపిస్తోందని వాపోతున్నారు. డీఎస్సీలో అర మార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రిన్సిపల్ పోస్టుల పేపర్‌లో రెండు తప్పులు
⇒ జూన్ 29న ప్రిన్సిపల్ పోస్టులకు నిర్వహించిన డీఎస్సీ పేపర్–2(మెయిన్)లోని ప్రశ్న (ఐడీ నం: 39226620890).. ‘10వ పంచవర్ష ప్రణాళికలో సమగ్ర శిక్షాభియాన్‌లో రాష్ట్రం– కేంద్రం వాటా ఎంత?’ అన్న దానికి నాలుగు ఆప్షన్లు (1. 15:85, 2. 25:75, 3. 50:50, 4. 40:60) ఇచ్చారు. దీనికి జవాబుగా ఫైనల్ ‘కీ’లో ఆన్సర్ (3)గా పేర్కొన్నారు.
కానీ ఈ ప్రశ్న స్థాయిని (ఎలిమెంటరీ/హైస్కూల్) పేర్కొనకపోవడంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. పదో పంచవర్ష ప్రణాళిక 2002 నుంచి 2007 వరకు అమలులో ఉంది. సమగ్ర శిక్షాభియాన్ 2018లో ప్రారంభమైంది. ఇందులో అడిగిన ప్రశ్నే తప్పుగా వచ్చినట్టు చెబుతున్నారు.
⇒ ఇదే ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించిన మరో ప్రశ్న (ఐడీ నం.39226620910) కూడా అసంపూర్ణంగాను, సందిగ్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ అడిగిన ప్రశ్న ‘ఏ’ గ్రేడ్‌కు మార్కుల శాతం ఎంత? అని అడిగారు.
ఈ ప్రశ్న ఏ స్థాయిలోదో (ప్రాథమిక/ఉన్నత/హైసూ్కల్ ప్లస్) చెప్పలేదు. ఇచ్చిన జవాబుల్లో ఆప్షన్–3 (71 నుంచి 90) అనేది సరైన సమాధానంగా ‘కీ’లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ గ్రేడింగ్ ఎస్సీఈఆరీ్ట, ఎన్సీఈఆర్టీ గ్రేడింగ్ ప్రకారం తప్పు. కాబట్టి, ఈ ప్రశ్నను రద్దు చేయాలని లేదా ప్రశ్నలోని సందిగ్ధత కారణంగా మలీ్టపుల్ ఆప్షన్స్‌ను ఆమోదించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎస్జీటీ పేపర్‌లోనూ తప్పులు
సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు నిర్వహించిన పరీక్ష పేపర్‌లో సైతం నాలుగు తప్పులు ఉన్నట్టు అభ్యర్థులు చెబుతున్నారు. జూన్ 17న జరిగిన పేపర్‌లో రెండు ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఇచ్చారని, కీలో సైతం మార్పులు చేయలేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఇందులో చంద్రకళలు (ఐడీ నం.39226611122), దండాయస్కాంతం (ఐడీ నం.39226611126) ప్రశ్నలకు ప్రాథమిక కీలో సరిగా ఇచ్చి, తుది కీలో తప్పుగా ఇచ్చారంటున్నారు. జూలై 2న జరిగిన పరీక్షలో ప్రశ్న (ఐడీ నం.39226624089), జూన్ 18న జరిగిన పరీక్షలో ఓ ప్రశ్న (ఐడీ నం.39226414035) సైతం తప్పుగా ఇచ్చారని చెబుతున్నారు.
ఫైనల్ కీలో తప్పులపై ఫిర్యాదులు
మెగా డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ శుక్రవారం రాత్రి విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని డీఎస్సీ కనీ్వనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఫైనల్ కీలో వచ్చిన తప్పులపై విద్యాభవన్ హెల్ప్‌లైన్ నంబర్లకు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ విషయాన్ని డీఎస్సీ కనీ్వనర్ కృష్ణారెడ్డి సైతం ధ్రువీకరించారు. ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవని ‘సాక్షి’కి తెలిపారు. వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
ఎస్‌ఏపీఈ పేపర్‌లో 12 తప్పులున్నా..
స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎస్‌ఏ పీఈ) పేపర్‌కు సంబంధించి ప్రాథమిక కీలో దొర్లిన తప్పులను సరిచేసినటప్పటికీ ఫైనల్ కీలో కొన్నింటికి తప్పు జవాబులకు మార్కులు ఇచ్చినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. అలాంటి వాటికి సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలిపినా మార్పులు చేయలేదంటున్నారు.
‘ఈ కింద్రి వాటిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేది’ (ఐడీ నం.3922663174) ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్‌లో 1. సేంద్రీయ ఎరువుల వాడకం, 2. మురుగు నీరు ఉపయోగించడం, 3. సౌండ్స్ సిస్టమ్స్–ఎకో స్టిక్స్ ఉపయోగించుట, 4. ప్రజారవాణా వ్యవస్థ ఉపయోగించుట అని ఇచ్చారు. వాస్తవానికి ఇందులో సరైన సమాధానం నాలుగోది. అయినప్పటికీ ఒకటో ఆప్షన్‌కు కూడా మార్కు కేటాయించడంపై అభ్యర్థులు అభ్యంతరం చెబుతున్నారు.
‘పూర్తి సంకోచంతో నిరోధకతను అధిగమించే సామర్థ్యం (ఐడీ నం.3922663234) ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో 2, 3 సరైన సమాధానాలు అయితే కేవలం మూడో ఆప్షన్‌కి మాత్రమే మార్కు ఇచ్చారు. మరో ప్రశ్నను పీఈటీ సిలబస్ నుంచి తెచ్చి పీఈ పేపర్‌లో (ఐడీ నం.3922663193) ఇచ్చారని, ఈ ప్రశ్నకు మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
‘సర్క్యూట్ ట్రైనింగ్‌నందు ప్రతి ఎక్సర్‌సైజుకు మధ్య గల రికవరీ సమయం’ (ఐడీ నం.3922663229) ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్స్‌లో 3, 4 సరైనవే అయినప్పటికీ కేవలం 3వ ఆప్షన్‌కు మాత్రమే సరైనదిగా పేర్కొన్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్‌లో మొత్తం 12 తప్పులపై ఆధారాలతో సహా పంపిస్తే కేవలం నాలుగు ప్రశ్నలకు మాత్రమే సరిచేశారంటున్నారు.