మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది.. మెరిట్‌తో సర్కారు ‘ఆటలు’! | DSC-2025 affected candidates grievances before YS Jagan on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది.. మెరిట్‌తో సర్కారు ‘ఆటలు’!

Jun 4 2026 5:08 AM | Updated on Jun 4 2026 5:08 AM

DSC-2025 affected candidates grievances before YS Jagan on Chandrababu Govt

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు

తమ వారికి టీచర్‌ ఉద్యోగాలిచ్చేందుకు ఇష్టానుసారంగా రూల్స్‌ మార్చారు

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు

ఎన్నిసార్లు లోకేశ్‌ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి రానివ్వట్లేదు 

ఏ పరీక్షా రాయని వారికి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం ఇచ్చి మెరిట్‌లో ఉన్న మాకు అన్యాయం చేశారు 

మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లో టాప్‌ ర్యాంకులు సాధించినా స్పోర్ట్స్‌ కోటా పేరుతో దగా

1 : 1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచినప్పుడు ఉద్యోగం రావాలి కదా? 

కోర్టు ఆర్డర్‌ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు 

మా గోడు ‘సాక్షి’తో చెప్పుకుంటే మమ్మల్ని ‘ఫేక్‌’ అని దుష్ప్రచారం చేస్తున్నారు 

ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు.. మీరు మాత్రమే న్యాయం చేయగలరు 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎదుట డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థుల ఆవేదన  

సాక్షి, అమరావతి: ‘‘మంత్రి నిర్వాకంతో మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇష్టానుసారంగా నియమాలు మార్చారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు..! ఎన్నిసార్లు లోకేశ్‌ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు..! 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు మాకు న్యాయం చేయండి...! మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్టులో నా పేరొచ్చింది. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా పూర్తయింది. తీరా సెలక్షన్‌ లిస్టులో నా పేరు లేదు. కారణం అడిగితే.. ఆ పోస్టు స్పోర్ట్స్‌ కేటగిరీలో ఇచ్చామని.. హారిజాంటల్‌ రిజర్వేషన్‌ వల్ల పోస్టు మిస్సయ్యిందని చాలా తేలిగ్గా సమాధానం చెబుతున్నారు. వెరిఫికేషన్‌కి వచ్చినంత మాత్రాన జాబ్‌ ఇస్తామన్నట్లు కాదని అంటున్నారు..! కోర్టు ఆర్డర్‌ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు..! నేషనల్‌ గేమ్స్‌లో బంగారు పతకం సాధించినా నాకు పోస్టు ఇవ్వలేదు.. రజతం, కాంస్య పతకం ఉన్నవారికి మాత్రం ఉద్యోగాలిచ్చారు.. 

సర్టిఫికెట్లు పరిశీలించకుండా పోస్టులు ఇచ్చేశారు...! అసలు ఏ పరీక్షా రాయని వారికి స్పోర్ట్స్‌ కోటా కింద ఉద్యోగం ఇచ్చి మెరిట్‌లో ఉన్న మాకు అన్యాయం చేశారు..! మెరిట్‌ లిస్టులో వచ్చిన వారికి రిజర్వేషన్‌ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వడంతో నాకు రావాల్సిన ఉద్యోగం రాకుండా పోయింది...! కటాఫ్‌ మార్కులు ప్రకటించకపోవడం వల్ల చాలా గందరగోళంగా ఉంది...! ఉన్నది 3 పోస్టులు... ముగ్గురమే ఉన్నాం... కానీ ఫైనల్‌ జాబితాలో నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్‌ కోటాలో ఆ జాబ్‌ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు..! నిబంధనలకు విరుద్ధంగా టీచర్‌ పోస్టులను భర్తీ చేశారని మా బాధ ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు..! ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు.. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు..!!’’ 

ఇదీ మెగా డీఎస్సీ 2025 వేలాది మంది బాధిత అభ్యర్థుల ఆక్రందన!! మెరిట్‌లో ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులు బుధవారం పెద్ద ఎత్తున తరలివచ్చి తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్‌ పోస్టుల ఎంపికలో జరిగిన అనేక అక్రమాలను ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.
తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరిస్తున్న డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థులు    

నేషనల్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ను పక్కనబెట్టారు  
నేను నేషనల్‌ గేమ్స్‌లో బంగారు పతకం విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజతం, కాంస్య పతక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పతకం ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 
– అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ఏలూరు జిల్లా  

లోకేశ్‌ వద్దకు వెళితే.. 
మెగా డీఎస్సీలో ర్యాంక్‌ తెచ్చుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా హాజరయ్యా. ఎస్జీటీ ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది నలుగురం మాత్రమే. అందులో ముగ్గురిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఎస్టీ వర్గానికి చెందిన నా పేరు తుది జాబితాలో లేదు. రోస్టర్‌ 
నంబర్లు అటూ ఇటూ చేసి నన్ను కాదని ఒక మహిళకు ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్‌ పోస్టు కాబట్టి నాకు కచ్చితంగా రావాలి. నాకు జాబ్‌ ఎందుకు రాలేదో వివరాలు చెప్పమని అప్లికేషన్‌ రాసిస్తే పక్కన పడేశారు. దానిపై స్టాంప్‌ వేసి ఇస్తే కోర్టుకు వెళ్తారని, అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు. మంత్రి నారా లోకేశ్‌ను కలవడానికి ఛాంబర్‌కు వెళ్తే అనుమతి లేదంటూ ఓఎస్డీ నా అప్లికేషన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ శాఖకు పంపించారు. చివరకు ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.
– ఎం.జగదీష్‌ నాయక్, వైఎస్సార్‌ కడప జిల్లా

ఇష్టారీతిన నియమాలు మార్చారు 
నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నా. పదో తరగతి వరకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ ఉర్దూ కాగా సెకండ్‌ లాంగ్వేజ్‌ తెలుగు. ఇంటర్‌ నుంచి ఇంగ్లిష్‌ మీడియం. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సందర్భంగా ఫస్ట్‌ లాంగ్వేజ్‌ తెలుగు ఉండాలన్నారు. ఈ డీఎస్సీలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు.  
– ఎండీ షాబుద్దీన్, విశాఖ జిల్లా

చాలా అన్యాయం.. 
నేను ఎస్సీని. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చక్కగా జరిగింది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత డీఈవో ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేసి మళ్లీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌ అడిగితే పంపా. మాకు 3 పోస్టులు ఉన్నాయి. మేము ముగ్గురమే ఉన్నాం. కానీ ఫైనల్‌ జాబితాలో మాత్రం నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్‌ కోటాలో ఆ జాబ్‌ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా అన్యాయం జరిగింది.  
– ఇందిర, కృష్ణా జిల్లా

అన్నీ బాగున్నా జాబ్‌ రాలేదు.. 
నేను కరాటే బ్లాక్‌బెల్ట్‌ ఛాంపియన్‌ను. మా ఊరిలో 37 మంది డీఎస్సీ రాస్తే నేను ఒక్కదాన్నే పాస్‌ అయ్యా. నేను ఓపెన్‌ కేటగిరీలో ఉన్నా రిజర్వేషన్‌ కేటగిరీలో పిలిచారు. నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ బాగా జరిగింది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం అడిగితే అప్పటికే అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పారు. గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. నాది బీసీ–డీ అయితే నన్ను ‘బీసీ–సి’గా చూపారు. కోర్టుకు వెళ్లినా ఎలాంటి విచారణ జరిపించడం లేదు. మరి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఎందుకు చేశారంటే సమాధానం చెప్పలేదు.  
– నాగలక్ష్మి, గుంటూరు జిల్లా

ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? 
బీసీ–ఈ వర్గానికి చెందిన నేను సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నా. ఎస్‌ఏ పోస్టు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లా. అధికారులు కంగ్రాట్స్‌ కూడా చెప్పారు. కానీ సెలక్షన్‌ లిస్టులో నా పేరు లేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నిసార్లు లోకేశ్‌ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిల్చినప్పుడు ఉద్యోగం రావాలి కదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? వెరిఫికేషన్‌ చేసినంత మాత్రాన జాబ్‌ ఇవ్వాలా? అని మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. మీపై ఎంతో విశ్వాసం ఉంది.  
– షర్మిల, మదనపల్లె. అన్నమయ్య జిల్లా

జీవో 77 ప్రకారం ఓపెన్‌ కేటగిరీలో మెరిట్‌ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు రిజర్వేషన్‌ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి. హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ప్రకారం మహిళలు, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, స్పోర్ట్స్‌కోటా పోస్టులు భర్తీ చేయాలి. అయితే ప్రభుత్వం అలా చేయలేదు  

స్పోర్ట్స్‌ కోటాలో ఇచ్చారట.. 
నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అని అడిగితే.. మీ కులంలో స్పోర్ట్స్‌ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను ఎందుకు పిలిచారు? 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి.  
– బాలకృష్ణ, కాకినాడ, జిల్లా

అవకాశం ఉన్నా పోస్టు ఇవ్వలేదు 
డీఎస్సీ మెరిట్‌లో నాకంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె కానిస్టేబుల్‌. ఆ­మెది ఫేక్‌ సర్టిఫికెట్‌. మేం ఫిర్యాదు చేస్తే ఆమెను క్యాన్సిల్‌ చేశారు. ఆ తర్వాత నేను ఉన్నా నాకు అవకాశం ఇవ్వలేదు. విజయనగరానికి చెందిన అమ్మాయికి జాబ్‌ ఇచ్చారు. ఒక పోస్టు క్యాన్సిల్‌ అయితే తర్వాత అభ్యర్థికి ఇవ్వబోమని, దాన్ని క్యారీ ఫార్వర్డ్‌ చేస్తామని చెప్పారు.  
– దుర్గామల్లిక, అమలాపురం, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

మా గోడు చెబుతుంటే ‘ఫేక్‌’ అంటున్నారు.. 
మాది పేద మత్స్యకార కుటుంబం. కోచింగ్‌కు వెళ్లలేదు. కష్టపడి చదివా. ఫిజికల్‌ సైన్స్‌ బీసీ–సీలో నాది మూడో ర్యాంక్‌. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తయింది. ఓవరాల్‌ మెరిట్‌లో నాది 53వ ర్యాంక్‌. 10వ ర్యాంక్‌ వచ్చిన అభ్యర్థికి ఓపెన్‌లో కాకుండా బీసీ–సీ కేటగిరీలో పోస్టు ఇచ్చారు. అతడిని ఓపెన్‌లో పంపించి ఉంటే నాకు మా కేటగిరీలో జాబ్‌ వచ్చి ఉండేది. నాకు జాబ్‌ ఎందుకు రాలేదని అధికారులను అడిగితే ఒక అమ్మాయి స్పోర్ట్స్‌ సర్టిఫికెట్‌తో వచ్చిందని చెప్పారు. మా గోడు ‘సాక్షి’లో ప్రచురిస్తే మమ్మల్ని ఫేక్‌ అని ప్రచారం చేస్తున్నారు.  
– శ్రావణ్‌కుమార్, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా

తీరని అన్యాయం.. 
నాది బీసీ–ఏ. ఇందులో ఒకటే పోస్టు ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయినా చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్‌లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫిజికల్‌ సైన్స్‌లో మాకు అర్హత ఉంది. ఎమ్మెస్సీ చదివా. నాకు స్పోర్ట్‌ సర్టిఫికెట్‌ ఉన్నా జనరల్‌ కేటగిరీలో దరఖాస్తు చేశా. కానీ నాకు తీరని అన్యాయం చేశారు.  
– లక్ష్మీపార్వతి, వైఎస్సార్‌ కడప జిల్లా 

మెరిట్‌లో ఉన్నా అన్యాయం.. 
నాది జనరల్‌ కేటగిరిలో 76వ ర్యాంక్‌. ఓహెచ్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌. జిల్లాలో ఫస్ట్‌ వచ్చా. కానీ నాకు మొదటి విడతలో కాకుండా రెండో దశలో కాల్‌ లెటర్‌ పంపారు. మెడికల్‌ టెస్టు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా జరిగింది. కానీ జాబ్‌ రాలేదు. రోస్టర్‌లో మరొకరు ముందు ఉన్నారని చెప్పారు. 137వ ర్యాంక్‌ వచ్చిన ఆమెకు జాబ్‌ ఇచ్చారు. మెరిట్‌లో ఉన్నా నాకు ఇవ్వకుండా అన్యాయం చేశారు.  
– నరసింహారావు, ప్రకాశం జిల్లా

ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిటో­రియస్‌ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం హారిజాంటల్‌ రిజర్వేషన్‌ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్‌ 4 

ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు  
నేను ఎస్‌ఏ సోషల్‌లో డీఎస్సీ రాశా. మా బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు జనరల్‌లో మిగిలిన రెండు మా కేటగిరీలో ఉన్నాయి. నన్ను సర్టిఫికెట్‌ పరిశీలనకు పిలిచినా జాబ్‌ ఇవ్వలేదు. నా పోస్టు హారిజాంటల్‌ రిజర్వేషన్‌లో మరొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. డీఈవో ఆఫీస్‌లో అడిగితే తమకేమీ తెలియదని విజయవాడ వెళ్లమన్నారు. అక్కడకు వెళ్తే తమకు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు. 
– ఏకాంబరం, మాదిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా 

జీరో ర్యాంకు వారికి ఉద్యోగం ఇచ్చారు 
నా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ బాగా జరిగింది. నాది బీసీ–బీలో మూడో పోస్టు. కానీ జాబ్‌ రాలేదు. నాకు ఇవ్వకుండా స్పోర్ట్స్‌ కేటగిరీ­లో ఇచ్చామని చెప్పారు. నాపేరు రిజెక్ట్‌ లిస్ట్‌­లో కూడా లేదు. అదేమని అడిగితే  సమా­ధానం చెప్పడం లేదు. నాకు అన్యాయం చేసి జీరో ర్యాంక్‌ ఉన్న వ్యక్తికి స్పోర్ట్స్‌ కోటా కింద జాబ్‌ ఇచ్చారు.  
– రాణి, కృష్ణా జిల్లా

డిగ్రీ లేకున్నా పోస్టు ఇచ్చారు 
మాకు (మహిళలకు) ఓపెన్‌ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్‌ కోటా కింద అందులోకి ఒకరిని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు డిగ్రీ లేదు కాబట్టి అది పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల సమయం ఇచ్చారు. అంటే.. అర్హత లేకున్నా ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆమెది ఓసీ. ఆమెను తీసుకొచ్చి మా కేటగిరీలో వేశారు. దాంతో నా ఛాన్స్‌ పోయింది.  
– వీరవేణి, తూర్పు గోదావరి జిల్లా 

కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు 
నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకంటే ముందు ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అతడిది ఫేక్‌ సర్టిఫికెట్‌ అని తేలడంతో పోస్టింగ్‌ ఆపారు. జాబితాలో ఆ తర్వాత ఉన్న నాకు ఉద్యోగం ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్‌ చేశామని చెప్పారు. ఇక్కడ అన్ని అర్హతలున్న నేను ఉన్నా, నాకు జాబ్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు.  
– సతీష్‌, పశ్చిమ గోదావరి జిల్లా

అన్నీ సరిగా ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు 
ఎస్సీ వర్గానికి చెందిన నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్‌లో చూపారు. గ్రీవెన్స్‌ సెల్‌లో దరఖాస్తు చేస్తే నావన్నీ కరెక్టుగా ఉన్నాయని, జాబ్‌ ఎక్కడివ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మా కేటగిరీలో చూపారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్‌లో చూపారు. ఎవరిని కలిసినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. 
– కె.శరత్‌బాబు, కాకినాడ, తూ.గో జిల్లా 

స్పోర్ట్స్‌ కోటాలో ఆయా శాఖలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని సవరించిన జీవో 

వైకల్యం సర్టిఫికెట్‌ ‘రిజెక్ట్‌’.. 
గెరివి అంజనప్పకు ఒక కన్ను పూర్తిగా లేదు. మరో కంటికి రక్త సరఫరా లేదు. ఆయనకు కంటి చూపు లేదని ధ్రువీకరిస్తూ మెడికల్‌ బోర్డు (అనంతపురం జీజీహెచ్‌) 40 శాతం వైకల్యంతో సర్టిఫికెట్‌ ఇచ్చినా పట్టించుకోకుండా రిజెక్ట్‌ చేశారు. విజయవాడ వచ్చి కమిషనరేట్‌లో కలిసినా తామేమీ చేయలేమంటున్నారు.  
– హెచ్‌.వసంత్‌కుమార్, అనంతపురం జిల్లా (అభ్యర్థి గెరివి అంజనప్ప తరపున మాట్లాడారు)

ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది... 
నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి, అక్రమాలతో డీఎస్సీ –2025 ద్వారా టీచర్‌ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. 1 : 1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కి హాజరై ఉద్యోగం వస్తుందన్న భరోసాతో ఇంటికెళ్లిన వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్పోర్ట్స్‌ కేటగిరీ పేరుతో అర్హులైన అభ్యర్థుల పొట్టగొట్టారు. అర్హులకు అన్యాయం చేసి పోస్టులను అమ్ముకోవడంపై సీబీఐతో విచారించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.  
– ఎ.రవిచంద్ర, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  

Advertisement
 
Advertisement
Advertisement