
విశాఖ డ్రగ్స్ కేసును నీరుగార్చేందుకు కూటమి నేతల కుట్ర
సాక్షి, విశాఖపట్నం: కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహా నగరంలోకి ప్రవేశించేసింది. ఎన్నికల ముందు కంటైనర్‌లో రూ.వేల కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్నే డ్రగ్స్‌కి అడ్డాగా మార్చేశారు. ఎలాగోలా వలపన్ని పట్టుకున్న పోలీసులు డ్రగ్ రాకెట్‌ను ఛేదించేందుకు ప్రయత్నిస్తుంటే.. నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనే తిష్టవేసి కేసు ముందుకెళ్లకుండా టీడీపీ పెద్దలు నిలువరిస్తున్నారు.
ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకురావడం వెనుక ఉన్న అసలైన సూత్రధారుల్ని వదిలేసి.. పాత్రధారులతోనే కేసు దర్యాప్తును ముగించేస్తున్నారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే ఓ బడా నేత కుమారుడు ఇందులో ఉండటంతో టీడీపీకి చెందిన ఓ ఎంపీ, ఎమ్మె ల్యే దగ్గరుండి కేసు వ్యవహారాల్ని నడిపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఢిల్లీ నుంచి విమానంలో దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకొస్తున్నారంటూ నగర పోలీసులకు సెంట్రల్ ఏజెన్సీల నుంచి సమాచారం వచ్చింది. ఆ వ్యక్తి కస్టమ్స్‌కి చిక్కకుండా 25 గ్రాముల కొకైన్‌ని పుస్తకాల మధ్యలో పెట్టి తీసుకొచ్చేశాడు. ఎయిర్‌పోర్టులో పట్టుకుంటే డ్రగ్స్ ఎవరి కోసం తీసుకొచ్చారన్నది తెలియదన్న ఉద్దేశంతో ఈగల్ బృందం సదరు విదేశీయుడిని ఫాలో అవుతూ వచ్చింది.
ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో అతడు అక్షయ్‌కుమార్ అలియాస్ మున్నాను కలిసి డ్రగ్స్ ఇస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఫోన్‌తో పాటు మున్నా ఫోన్‌ని స్వాదీనం చేసుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మున్నాను విచారించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు వైద్యుడు కాగా, మరొకరు కూటమి నాయకుడి కుమారుడు, ఇంకొకరు ఉత్తరాంధ్ర కూటమి నేతల ఆరి్థక లావాదేవీలు చూసే బడా నేత కుమారుడు.
ఈ ముగ్గుర్నీ పట్టుకోగానే.. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ నేరుగా పోలీసులకు ఫోన్‌చేసి వెంటనే వారిని విడిచి పెట్టాలని.. వారిపై ఎలాంటి కేసులు ఉండకూడదనీ.. తమకు కావల్సిన వ్యక్తులంటూ హుకుం జారీ చేశారు. పోలీసులపై తీవ్ర ఒత్తిడి రావడంతో కేవలం ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చేశామంటూ తొలిరోజు ప్రెస్‌మీట్‌లో సీపీ వెల్లడించారు. మొత్తం ఐదుగుర్ని అదుపులోకి తీసుకొని ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ ఎందుకు చూపిస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. మిగిలిన ముగ్గురు అనుమానితులు మాత్రమేననీ, నిందితులు కాదని సమాధానమిచ్చి తప్పించుకోవాలని చూశారు.
కూటమి నేతల హస్తం ఉన్నట్టు అన్ని ఆధారాలున్నా.. టీడీపీ నేతలు పోలీసుల చేతులు కట్టేసి దర్యాప్తును తుంగలో తొక్కేస్తున్నారు. సూత్రధారుల్ని విడిచిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి.
హోంమంత్రి స్పందించరేం?
ప్రతి విషయంలో హడావుడి చేసే హోంమంత్రి అనిత సోమవారం సాయంత్రం నగరంలో పోలీసుల కార్యక్రమానికి హాజరైనా డ్రగ్స్ కేసుపై పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. దీంతో కూటమి నేతల హస్తం ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.
సీపీ కార్యాలయంలోనే ఓ ఎమ్మెల్యే తిష్ట!
ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు సీపీ కార్యాలయానికి నేరుగా వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురూ తమకు బాగా కావాల్సినవారని, ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు నమోదు చెయ్యొద్దంటూ అక్కడే ఉండి వ్యవహారం నడిపించారు. అప్పటికే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో ఏం చేయాలో పాలుపోక కూటమి పార్టీలకు సంబంధం లేని.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వైద్యుడిని అరెస్ట్ చేసినట్టు చూపించారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు కూటమి పార్టీ నేత, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సీఈవో.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మున్నాతో అతడికి సత్సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అతడి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.