10వేల గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి 

Drone survey completed in 10 thousand villages - Sakshi

పలు జిల్లాల్లో తుదిదశకు.. జూన్‌ నాటికి అన్ని జిల్లాల్లో పూర్తిచేసేందుకు ప్రయత్నాలు 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక ప్రణాళికతో డీజీపీఎస్‌ సర్వే 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో భూముల సమస్యలన్నింటికీ చరమగీతం పాడేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వేలో ముఖ్య ఘట్టమైన డ్రోన్‌ సర్వే 10,206 గ్రామాల్లో పూర్తయింది. మొత్తం 13,500 గ్రామాల్లో డ్రోన్లు ఎగరాల్సి వుండగా 75 శాతం గ్రామాల్లో ఎగురవేసి భూముల కొలతను పూర్తిచేశారు. నంద్యాల, శ్రీ సత్య­సాయి, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈ సర్వే చివరి దశకు వచ్చింది. నంద్యాల జిల్లాలో 441 గ్రామాలకు గాను 400 గ్రా­మా­ల్లో పూర్తయింది.

శ్రీ సత్యసాయి జిల్లాలో 461 గ్రా­మా­లకు 416, విజయనగరం జిల్లాలో 983కి 906, అనకాపల్లి జిల్లాలో 715కి 661, కాకినాడ 417కి 340, తూర్పుగోదావరిలో 272కి 236, కృష్ణాజిల్లాలో 502కి 460 గ్రామాల్లో సర్వే పూర్తిచేశారు. మిగిలిన జిల్లాల్లోనూ 50–60 శాతానికిపైగా సర్వే పూర్తయింది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏరియల్‌ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లతోపాటు దేశంలో ఎక్కడాలేని విధంగా విమానాలు కూడా వినియోగిస్తోంది.

సర్వే ఆఫ్‌ ఇండియాతోపాటు ప్రైవేటు డ్రోన్‌ ఏజెన్సీలతోనూ సర్వే చేయిస్తోంది. చివరికి ప్రభుత్వం సైతం సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసి సర్వేయర్లకు పైలట్లుగా శిక్షణ ఇచ్చి మరీ సర్వే చేస్తోంది. దీంతో ఈ సర్వే దాదాపు తుదిదశకు వచ్చింది. ఈ ఏడాది  జూన్‌ నాటికి అన్ని జిల్లాల్లో పూర్తిచేయడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ పనిచేస్తోంది. ఏ జిల్లాల్లో డ్రోన్‌ సర్వే ఇంకా ఎన్ని గ్రామాల్లో చేయాలో దృష్టిపెట్టి సర్వేను పూర్తిచేసేందుకు  ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నారు.  

అల్లూరి జిల్లాలో ఐదుగురికి ప్రత్యేక బాధ్యతలు  
మరోవైపు.. కొండలు, అటవీ ప్రాంతాలతో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో డ్రోన్‌ సర్వేకు అవకాశం లేకపోడంతో డీజీపీఎస్‌ సర్వేను ప్రత్యేక ప్రణాళికతో చేపట్టింది. కొండల్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అందకపోవడంతో భూమిపై నుంచే సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో 2,980 గ్రామాలు ఉండడం, అక్కడ డ్రోన్‌ సర్వేకు అవకాశం లేకపోవడం రెవెన్యూ యంత్రాంగానికి సవాలుగా మారింది.

రాష్ట్రమంతా రీ సర్వే ఒక ఎత్తయితే ఈ జిల్లాలో మాత్రం మరోలా ఉంది. ఈ జిల్లాలోని గ్రామాలను ఐదు గ్రూపులుగా విభజించి పాడేరు సబ్‌కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీఓ, రంపచోడవరం సబ్‌ కలెక్టర్, ఐటీడీఏ పీఓ, అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టర్లకు వాటిని అప్పగించారు. వీరితో ప్రత్యేకంగా అక్కడ రీ సర్వే చేయిస్తున్నారు. దీంతో అల్లూరి జిల్లాలో డీజీపీఎస్‌ సర్వే శరవేగంగా జరుగుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top