అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం!

Driving license suspension for road safety offenses - Sakshi

రహదారి భద్రత నేరాలకు పాల్పడితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌ 

మూడు నెలల కంటే తక్కువగా సస్పెన్షన్‌ అమలు

విజయవాడ, విశాఖలలో సేఫ్టీ డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్లు

శిక్షణకు హాజరైన వారికే ఎల్‌ఎల్‌ఆర్‌ మంజూరు

సాక్షి, అమరావతి: రహదారి భద్రతకు సంబంధించి ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌ నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేయనుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను మూడు నెలల కంటే తక్కువగా సస్పెండ్‌ చేయాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్‌ (డీసీ)లను రవాణా శాఖ కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు ఆదేశించారు. ప్రస్తుతం పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి వారి లైసెన్స్‌లు సస్పెండ్‌ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమైన 4 కేటగిరీల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేయాలని, ఈ నిబంధన కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

నాలుగు కేటగిరీలు ఇవే..
కేంద్ర మోటారు వాహన చట్టం సెక్షన్‌ 19 కింద డ్రైవింగ్‌ లైసెన్స్‌లు సస్పెండ్‌ చేస్తారు. అధిక వేగంతో వెళ్లినా..ఓవర్‌ లోడ్‌తో వాహనం నడుపుతున్నా, మద్యం సేవించి వాహనం నడిపినా, మొబైల్‌ మాట్లాడుతూ వాహనం నడిపినా డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారు. మోటార్‌ వాహన చట్టం 206(4) సెక్షన్‌ కింద ఉల్లంఘనలకు పాల్పడినా.. లైసెన్స్‌ సస్పెండ్‌ చేయాలని అధికారులను రవాణా శాఖ ఆదేశించింది. ఈ ఉల్లంఘనలకు పాల్పడితే 3 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోల్పోవాల్సి ఉంటుంది. రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రీ ఎల్‌ఎల్‌ఆర్‌ (లెర్నర్‌ లైసెన్స్‌ ఇచ్చే ముందు) దరఖాస్తుదారులకు ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం నిర్వహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకుగాను విజయవాడ, విశాఖలలో సేఫ్టీ డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. 2022 మార్చి కల్లా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. 

శిక్షణకు హాజరైతేనే ఎల్‌ఎల్‌ఆర్‌ 
రవాణా శాఖ కార్యాలయాల్లో లెర్నర్‌ లైసెన్స్‌లకు స్లాట్‌ బుక్‌ చేసుకున్న దరఖాస్తుదారులు ముందుగా 2 గంటల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద సహకారం అందించేందుకుగాను హోండా మోటార్‌ సైకిల్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలకు హాజరయ్యే దరఖాస్తుదారులకు ఈ శిక్షణ ఉపయోగకరంగా ఉంటుందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రహదారి భద్రతకు సంబంధించి వాహనదారుల్లో అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే ఈ శిక్షణ అవసరమని రవాణా శాఖ భావిస్తోంది. ఎల్‌ఎల్‌ఆర్‌ దరఖాస్తుదారులు కచ్చితంగా శిక్షణ కార్యక్రమానికి హాజరైతేనే ఎల్‌ఎల్‌ఆర్‌ మంజూరు చేస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top