పాజిటివ్‌ అయితే వ్యాక్సిన్‌కు తొందర వద్దు

Do not bother with the vaccine if Corona positive - Sakshi

కోలుకున్నామంటే యాంటీబాడీస్‌ ఉన్నట్టే.. కోలుకోగానే టీకా అవసరం లేదంటున్న వైద్యులు

సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్‌ అయిన వారు వ్యాక్సిన్‌ కోసం తొందర పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. చాలామంది కరోనా పాజిటివ్‌ అయ్యాక కోలుకున్న వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోవాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. మరికొంతమంది తొలి డోసు వ్యాక్సిన్‌ తర్వాత పాజిటివ్‌ అయ్యారు. వీళ్లు కూడా రెండో డోసు వేయించుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. పాజిటివ్‌ నుంచి కోలుకున్నాక కనీసం 8 వారాల వరకూ వ్యాక్సిన్‌ అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకోగానే శరీరంలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయి ఉంటాయని, ఈ దశలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ అవసరం లేదని, మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.

సీడీసీఏ, డబ్ల్యూహెచ్‌వోలో 90 రోజులు
చాలా దేశాల్లో కరోనా పాజిటివ్‌ తర్వాత ఎప్పుడు వ్యాక్సిన్‌ వేయించుకోవాలా అన్నదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. కానీ అమెరికాలోని సెంట్రల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ సంస్థ (సీడీసీఏ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాత్రం కరోనా పాజిటివ్‌ నుంచి కోలుకున్న అనంతరం 90 రోజుల వరకూ వ్యాక్సిన్‌ అవసరం లేదని, ఆ తర్వాత వేయించుకోవాలని సూచించాయి.

యాంటీబాడీస్‌ ఉంటాయి
కరోనా పాజిటివ్‌ నుంచి కోలుకున్నామంటేనే మనలో యాంటీబాడీస్‌ ఉన్నట్టు లెక్క. మూడు మాసాలు మళ్లీ కరోనా వచ్చే అవకాశం తక్కువే. ఆ తర్వాత వ్యాక్సిన్‌ వేయించుకుంటే సరిపోతుంది. కరోనా నుంచి కోలుకోగానే వ్యాక్సిన్‌ అవసరం లేదు. కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలి.
–డా.చైతన్య, హృద్రోగ నిపుణులు, విజయవాడ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top