
టీడీపీ నేత ఫిర్యాదుపై పోలీసుల అత్యుత్సాహం
మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి సహా 19 మందిపై కేసు నమోదు
జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి అరెస్ట్
రాయచోటి/లక్కిరెడ్డిపల్లె: అదిగో పులి అంటే.. ఇదుగో తోక అన్నట్లుంది కూటమి పాలనలో పోలీసుల వ్యవహార శైలి. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు బాణసంచా కాల్చడంతో అప్పట్లో తాను గాయపడ్డానంటూ ఓ టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేయడమే తరువాయి.. పోలీసులు కేసు కట్టడం విస్తుగొలుపుతోంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కుర్నూతుల అగ్రహారానికి చెందిన లోకేశ్ అనే యువకుడు 14 నెలల కిందట ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులకు స్వాగతం పలుకుతూ బాణసంచా కాల్చాడు. ఆ క్రమంలో కంటి వద్ద గాయమైంది.
అతడి చికిత్స కోసం అప్పట్లో వైఎస్సార్‌సీపీ నేతలు రూ.3 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందించారు. ఎన్నికల తర్వాత టీడీపీలో చేరిన లోకేశ్.. ఇప్పుడు టీడీపీ పెద్దల సూచనతో వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులకు ఉపక్రమించాడు. ‘వారు బాణసంచా తెచ్చి కాల్చమని చెప్పారు. అది కాల్చినందువల్లే అప్పట్లో నా కంటికి గాయమైంది’ అంటూ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం విచారించాలని మానవ హక్కుల కమిషన్ లక్కిరెడ్డిపల్లె పోలీసులకు సూచించింది.
ఇదే అవకాశంగా టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో పోలీసులు కక్ష పూరితంగా 326, 420 సెక్షన్స్, ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ కింద మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, ఎంపీపీల సంఘం జిల్లా అధ్యక్షుడు, లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి సహా 19 మందిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఎవరికీ నోటీసులు ఇవ్వకుండానే అరెస్టులకు ఉపక్రమించారు. గురువారం సాయంత్రం సుదర్శన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. మిగతా వారందరినీ అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.
వాస్తవానికి ఆ ప్రమాద సమయంలో శ్రీకాంత్ రెడ్డి వేరే మండలంలో ప్రచారంలో ఉన్నప్పటికీ కేసు నమోదు చేయడం రెడ్‌బుక్ దుర్మార్గానికి పరాకాష్ట. నిజానికి తనంతట తానే బాణసంచా కాల్చుతూ.. ఆ క్రమంలో అప్పుడు గాయపడి, ఇప్పుడు ఫిర్యాదు చేయడం దారుణమని.. దీనిపై పోలీసులు నిజానిజాలు విచారించకుండానే తప్పుడు కేసులు పెట్టడం సరికాదని ప్రజలు మండిపడుతున్నారు.