విశ్వరూప్‌ దంపతులపై పిటిషన్‌ కొట్టివేత

Dismissal of petition against Vishwaroop couple - Sakshi

సాక్షి, అమరావతి: భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లను మోసపూరితంగా మార్పు చేసుకున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఆయన సతీమణి పినిపే బేబీ తదితరులపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్చినంత మాత్రాన ఆ ఆస్తిపై యాజమాన్యపు హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గ్రామీణ మం డలం భట్నవిల్లి గ్రామంలోని 7.75 ఎకరాల భూమిని పినిపే బేబీ పేరిట సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం ఎంతమాత్రం తప్పుకాదని, సబ్‌ రిజిస్ట్రార్‌ తన చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించారని హైకోర్టు తెలిపింది. అలా రిజిస్టర్‌ చేయడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించలేమంది.

ఆ భూమికి సంబంధించిన వివాదం అమలాపురం కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యం లో..  సంబంధిత సివిల్‌ కోర్టు ముందు పిటిషనర్‌ మౌఖిక, లిఖితపూర్వక ఆధారాలను ఉంచి, ఆ భూమి యాజమాన్య హక్కులను తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సివిల్‌ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అమ్మకపు ఒప్పందం మేరకే పినిపే బేబీ పేరిట డాక్యుమెంట్‌ రిజిస్టర్‌ చేశారని, దీనిని ఎంతమాత్రం మోసపూరితమని చెప్పజాలమంది.   ఏపీ భూ హక్కులు, పాసు పుస్తకాల చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లు తప్పని నిరూపితమయ్యేంత వరకు ఆ పేర్లు సరైనవేనని భావించాల్సి ఉంటుందని తేల్చి చెబుతూ.. సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top