అరచేతిలో ఈ- పాఠం   | Digital Library Inaugurated In Krishna University | Sakshi
Sakshi News home page

అరచేతిలో ఈ- పాఠం.. కృష్ణా యూనివర్సిటీలో డిజిటల్‌ లైబ్రరీ 

Aug 23 2022 8:43 AM | Updated on Aug 23 2022 12:12 PM

Digital Library Inaugurated In Krishna University - Sakshi

కృష్ణా వర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ పేరిట అత్యాధునిక సౌకర్యాలతో డిజిటల్‌ లైబ్రరీని గత విద్యా సంవత్సరంలో ప్రారంభించారు.

మచిలీపట్నం: రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతతో విద్య, అభ్యసన వ్యవస్థల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కోవిడ్‌ తర్వాత ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలకు వరకూ అంతా డిజిటల్‌ పాఠానికి అలవాటు పడ్డారు. అందుకు తగ్గట్లుగా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు అందరికీ ఉపయోగపడేలా కృష్ణా యూనివర్సిటీ అధికారులు ఈ–విజ్ఞాన భాండాగారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

వర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ పేరిట అత్యాధునిక సౌకర్యాలతో డిజిటల్‌ లైబ్రరీని గత విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. తద్వారా డిగ్రీ, పీజీ పట్టాలతో బయటకు వెళ్లే విద్యార్థులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా సాంకేతికతతో కూడిన విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అవకాశం కలి్పంచారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, వివిధ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులు అభ్యసించే సుమారు వెయ్యి మంది విద్యార్థులు సెంట్రల్‌ లైబ్రరీ సద్వినియోగం చేసుకుంటున్నారు.  

ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు.. 
మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వర్సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో సాంకేతికతను జోడించారు. చదువుతున్న కోర్సులకు రిఫరెన్స్‌గా సుమారు ఒక లక్షకు పైగా ఈ–బుక్స్‌ అందుబాటులో ఉంచారు. కంప్యూటర్ల ద్వారా విద్యార్థులు వీటిని వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేశారు. ఒకే సారి వందమంది విద్యార్థులు లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకునేలా సీటింగ్‌ సమకూర్చారు. అంతేకాక ఇక్కడ లభ్యమయ్యే ఈ–బుక్స్‌ విద్యార్థులు తమ మొబైల్‌ లేదా వ్యక్తిగత కంప్యూటర్‌ ద్వారా ఎక్కడి నుంచైనా ఓపెన్‌ చేసుకుని చదువుకునే వెసులుబాటును కల్పించారు. విద్యార్థి ఐడీ నంబర్‌తో పాటు లైబ్రేరియన్‌ ఇచ్చే పాస్‌వర్డ్‌తో ఈ–బుక్స్‌ ఓపెన్‌ అయ్యే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులో ఉంచారు. అలాగే లైబ్రరీలో ఉచిత వైఫై అందుబాటులో ఉండటం విద్యార్థులకు మేలు చేకూరుస్తోంది. 

పరిశోధనలకు వీలుగా.. 
జాతీయ, అంతర్జాతీయ సెమినార్‌లకు కృష్ణా యూనివర్సిటీ వేదికగా నిలుస్తుండటంతో పరిశోధన విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. వీరికి సౌకర్యవంతంగా ఉండేలా సెంట్రల్‌ లైబ్రరీలో 20 వేలుకు పైగా ఈ–జర్నల్స్‌ అందుబాటులో ఉంచారు. స్కాలర్స్‌తో పాటు బోధన చేసే అధ్యాపకులు కూడా వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు.  

చాలా ఉపయోగం.. 
ప్రతి రోజూ లైబ్రరీకి వస్తాను. సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. లైబ్రరీలో ఎన్నో సాహిత్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదువుతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నాలాంటోళ్లకు లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతుంది.  
– వి. రాశీ వేణి, ఎంఏ ఇంగ్లిష్‌ విద్యార్థి, క్యాంపస్‌ కాలేజీ  


మ్యాగజైన్‌లతో ఎంతో మేలు.. 
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలువడే మ్యాగజైన్స్‌ను తెప్పిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షల మెటీరియల్‌ కూడా లైబ్రరీలో ఉంది. వీటి వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, రిజిస్ట్రార్‌ లైబ్రరీ నిర్వహణపై ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు.
– డాక్టర్‌ జ్యోతిర్మయి, లైబ్రరీ కో–ఆర్డినేటర్‌ 

విద్యార్థులకు ప్రయోజనం.. 
క్యాంపస్‌ చదువులపై ఎంతో ఇష్టపడి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మేలు చేసేలా వర్సిటీ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాం. డాక్టర్‌ ఏపీజే అబ్డుల్‌ కలామ్‌ లైబ్రరీ విద్యార్థులకు ఎంతో ఉపయోపడుతుంది. ఇకపై ఎక్కువ పుస్తకాలు ఈ–బుక్స్‌గానే అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువ మంది విద్యార్థులు సది్వనియోగం చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. 
– డాక్టర్‌ ఎం రామిరెడ్డి, రిజిస్ట్రార్,  కృష్ణా యూనివర్సిటీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement