‘సీమ’ ఎత్తిపోతల టెండర్‌కు జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఓకే

Department of Water Resources prepares tender notification for Rayalaseema Projects - Sakshi

టెండర్‌ నోటిఫికేషన్‌ జారీకి జలవనరుల శాఖ సిద్ధం

సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలను జ్యుడిషియల్‌ ప్రివ్యూ జడ్జి జస్టిస్‌ బి.శివశంకరరావు శనివారం ఆమోదించారు. ఇదే ప్రతిపాదనలతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు మూడు టీఎంసీలను తరలించి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ (పీహెచ్‌పీ)పై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ ఆయకట్టులో పంటలను రక్షించడానికి.. తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి రూ.3,825 కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టేందుకు మే 5న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది.

ఈ పనులకు రూ.3,278.18 కోట్లను అంతర్గత అంచనా విలువగా నిర్ణయించి.. ఈపీసీ విధానంలో 30 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో టెండర్‌ నిర్వహించడానికి ఈనెల 16న జ్యుడిషియల్‌ ప్రివ్యూకు జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. వాటిని వారం రోజులు వెబ్‌సైట్లో ఉంచిన జ్యుడిషియల్‌ ప్రివ్యూ వివిధ వర్గాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, ప్రతిపాదనల్లో మార్పులు చేసి ఆమోదించింది. ఇదే ప్రతిపాదనల ఆధారంగా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీకి అధికారులు సిద్ధమయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top