మామిడి రైతుకు 'తీపి' ధర

Department of Horticulture promoting mango exports - Sakshi

బంగినపల్లి టన్ను రూ.60 వేలకు పైనే

తోతాపురి ధర రూ.25 నుంచి రూ.30 వేలు

గత ఏడాదికంటే రెట్టింపు రేటు

ఈ ఏడాది దిగుబడులు అధికమే

మ్యాంగో మీట్‌ ఒప్పందాలతో రైతులకు తగ్గిన వ్యయప్రయాసలు

ఎగుమతులను ప్రోత్సహిస్తున్న ఉద్యానశాఖ 

సాక్షి, అమరావతి బ్యూరో: మామిడి రైతుకు ఈ ఏడాది మంచి రోజులొచ్చాయి. గత సంవత్సరంకంటే అధిక దిగుబడులు రావడంతోపాటు ధర కూడా ఎక్కువగా లభిస్తోంది. ఇన్నాళ్లూ రైతులు మామిడిని స్థానిక మార్కెట్లోనే విక్రయించడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో మార్కెట్లో వ్యాపారులు నిర్ణయించిన తక్కువ ధరకే అమ్ముకోవలసిన పరిస్థితి ఉండేది. ఫలితంగా రైతుకు నష్టం వాటిల్లేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యానశాఖ ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా మామిడికి మంచి ధర లభించేలా చూస్తోంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూమిలో తేమ శాతం పెరిగి మామిడి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి రాగా ఈ సంవత్సరం ఐదు టన్నులకుపైగా (25 నుంచి 30 శాతం అధికంగా) వస్తోంది. ఈ ఏడాది 56 లక్షల టన్నుల మామిడి దిగుబడి రావచ్చని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. పైగా ఈ ఏడాది మామిడి నాణ్యత కూడా మెరుగ్గా ఉంది. ఇప్పటికి మామిడి కోత 20 శాతం వరకు జరగ్గా ఏప్రిల్‌ రెండోవారం నుంచి పూర్తిస్థాయిలో మామిడి మార్కెట్‌కు వస్తుందని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. 

తోటలోనే రైతులకు సొమ్ము.. 
బంగినపల్లి రకం టన్ను ఎ–గ్రేడు రూ.60 వేల నుంచి 65 వేలు, బి–గ్రేడు రూ.50 వేలు, సి–గ్రేడు రూ.40 వేలు పలుకుతోంది. తోతాపురి టన్ను ధర రూ.35 వేలు ఉంది. ఉద్యానశాఖ ఈనెల 16న విజయవాడలో నిర్వహించిన మ్యాంగో సెల్లర్స్, బయ్యర్స్‌ సమావేశం రైతులకు ఎంతో ఉపయోగపడింది. ఆ సమావేశంలో రైతులు.. కొనుగోలుదార్లు/ఎగుమతిదార్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇలా ఈ ఏడాది ఐదువేల టన్నుల మామిడి ఎగుమతులకు ఒప్పందాలు జరిగాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, ఇండోర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ తదితర నగరాల నుంచి ఒప్పందాలు చేసుకున్న కొనుగోలుదార్లు వస్తున్నారు. వీరు మామిడితోటల్లోకి నేరుగా వెళ్లి కాయలను కోయించుకుని స్పాట్‌లోనే రైతులకు సొమ్ము చెల్లించి కాయల్ని తీసుకెళుతున్నారు.

రైతులు స్థానిక మార్కెట్లో అమ్ముకుంటే సొమ్ము కోసం నాలుగైదుసార్లు తిరగాల్సి వచ్చేది. పైగా ఎగుమతిదార్లు ఇచ్చే ధరకంటే స్థానిక మార్కెట్లో టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు తక్కువే లభించేది. గత సంవత్సరం నాణ్యమైన బంగినపల్లి టన్ను గరిష్టంగా రూ.30 వేలకు, తోతాపురి రూ.10 వేలకు మించలేదు. గతంలో రైతులే మార్కెట్‌కు తరలించే సమయంలో కాయ కోత, లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా ఖర్చుల కింద టన్నుకి రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఖర్చయ్యేది. మార్కెట్లలో 10 శాతం కమీషన్‌ కింద ఇవ్వాల్సి వచ్చేది. కొనుగోలుదారులే నేరుగా తోటల్లోకి వచ్చి తీసుకెళుతుండటంతో రైతులకు ఈ ఖర్చులు, కమిషన్‌ సొమ్ము ఆదా అవుతున్నాయి. 

మంచి ధర దక్కుతోంది
స్థానిక మార్కెట్లో మామిడిని విక్రయిస్తే తక్కువ ధరతో పాటు కమీషన్, హమాలీల ఖర్చుల కింద 10 శాతం సొమ్ము తీసుకుంటున్నారు. ఇలా గత ఏడాది రైతుకు టన్నుకు రూ.30 వేలు రావడం కష్టమైంది. సెల్లర్స్, బయ్యర్స్‌ మీట్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఫలితంగా ఎ–గ్రేడు బంగినపల్లి రకం టన్ను రూ.52 వేల నుంచి రూ.70 వేల వరకు కొనుగోలు చేశారు. వెంటనే సొమ్ము చెల్లించారు. ఇలా నాకున్న 20 ఎకరాల్లో ఇప్పటివరకు నాలుగున్నర టన్నులు విక్రయించాను. మా గ్రామం నుంచి వంద టన్నులు ఎగుమతిదార్లకు విక్రయించాలని ఒప్పందం చేసుకున్నాం. 
– బాలరాఘవరావు, మామిడి రైతు, హనుమంతునిగూడెం, కృష్ణా జిల్లా 

ఒప్పందాలతో సత్ఫలితాలు 
గత ఏడాదికంటే మామిడి అధిక దిగుబడి రావడంతో పాటు మంచి ధర కూడా లభిస్తోంది. రైతులు నాణ్యమైన మామిడిని ఎగుమతిదార్లకు విక్రయించేలా ప్రోత్సహిస్తున్నాం. ఇటీవల విజయవాడలో నిర్వహించిన మ్యాంగో మీట్‌లో  ఒప్పందాల మేరకు ఎగుమతిదారులు నేరుగా కొనుగోళ్లు మొదలు పెట్టారు. 
– సీహెచ్‌. శ్రీనివాసులు, ఏడీ, ఉద్యానశాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top