కేంద్రం నుంచి తగ్గుతున్న పన్ను ఆదాయం

Decreasing tax revenue from central govt for Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: గత చంద్రబాబు పాలనలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయడమే కాకుండా పలు విభాగాలకు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోవడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి తొలి ఏడాది నుంచి ఆర్థిక కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి తోడు 2019–20లో ఆర్థిక మందగమనంతో రాష్ట్రానికి రావాల్సిన సొంత పన్ను ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఆ తరువాత రెండేళ్ల నుంచి కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఇటు రాష్ట్ర పన్ను ఆదాయం.. అటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది.

ఇటీవల రాజ్యసభలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సమాధానం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నది.  గత మూడేళ్లగా కేంద్ర పన్నుల వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్నులు ఎలా తగ్గిపోయాయో పంకజ్‌ చౌదరి వివరించారు. 2018–19తో పోల్చి చూస్తే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రూ.4,545 కోట్లు తగ్గిపోయింది.  

2019–20 ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2020–21 ఆర్థిక ఏడాదిలో రూ.3,781 కోట్లు తగ్గిపోయింది. ఇక ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో జనవరి వరకు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రాష్ట్రానికి కేవలం రూ.22,072 కోట్లే వచ్చాయి. అలాగే విదేశీ సహాయ ప్రాజెక్టుల కింద కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం కూడా గత రెండు ఆర్థిక ఏడాదుల నుంచి తగ్గిపోయినట్లు పంకజ్‌ చౌదరి ఇచ్చిన సమాధానంలో స్పష్టమైంది. అలాగే గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి రాష్ట్రం నుంచి ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి వసూలైన రాబడి కూడా తగ్గిపోయినట్లు మంత్రి పంకజ్‌ చౌదరి వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top