
కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన దళిత సంఘాలు
ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్‌కు వినతి
గుంటూరు వెస్ట్: కూటమి ప్రభుత్వంపై దళిత, సామాజిక సంఘ నాయకులు కదం తొక్కారు. ప్రభుత్వ వైఫల్యాలతోపాటు, దళితులపై జరుగుతున్న వరుస దాడులను ఖండించారు. సోమవారం గుంటూరుకు వచి్చన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామ్‌చందర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు వచ్చారు. దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్ మాట్లాడుతూ తెనాలిలో పోలీసులు ఏప్రిల్ 25న చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ కరీముల్లా అలియాస్ బాబూలాల్, దోమ రాకేష్ ను బహిరంగంగా కొట్టడం చట్ట విరుద్ధమన్నారు.
ఈ కేసులో సీఎం చంద్రబాబుపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తెనాలి ఘటన సభ్య సమాజానికి మాయని మచ్చని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్ అన్నారు. అనంతరం దళిత సంఘ నాయకులు ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
హత్యాయత్నం కేసులో ఏ–1గా ఎమ్మెల్యే నరేంద్రను చేర్చాలి
ఇటీవల టీడీపీ గుండాల దాడిలో దారుణంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బొనిగల నాగమల్లేశ్వరరావుపై హత్యకు ప్రేరేపించింది పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అని, ఆయన్ని ఏ–1గా చేర్చాలని పొన్నూరు మండలం మన్నవ గ్రామ ఎంపీటీసీ బొనిగల అమరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం గుంటూరులోని కలెక్టరేట్‌లో బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్‌చందర్‌కు ఈమేరకు వినతిపత్రం అందజేశారు.
దళితుల అభ్యున్నతికి కమిషన్ కృషి చేస్తోంది
దళితుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని కమిషన్ పర్యవేక్షిస్తుందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్‌చందర్ తెలిపారు. సోమవారం గుంటూరులోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల అభ్యున్నతిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామ్‌చందర్ విలేకరులతో మాట్లాడుతూ తెనాలిలో ముగ్గురు దళిత యువకులను లాఠీలతో కొట్టిన కేసులో ఇప్పటికే డీజీపీ, చీఫ్ సెక్రటరీతోపాటు, జిల్లా అధికారులను పిలిపించి మాట్లాడామన్నారు. దీనిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు.