నీటమునిగిన పంటలు: రైతులు ఆందోళన

Cyclone Nivar: Heavy Rains In Cyclone Affected Districts - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: నివర్‌ తుపాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. వైఎస్సార్‌ కడప, చిత్తూరు, నెల్లూరు,తూర్పు, పశ్చిమ,ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వైఎస్సార్‌ జిల్లా సీకే దిన్నే మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. 3 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లాలోని ఒంటిమిట్ట చెరువు 10 ఏళ్లు తర్వాత జలకళ సంతరించుకుంది. (చదవండి: నివర్‌ తుపాను.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు)

రాయచోటి-రాయవరం మార్గంలోని సద్దిగోళ్ళవంక వద్ద వరద ఉధృతి పెరిగింది. దీంతో వాహనదారులను అర్బన్‌ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. రాయచోటిలో గుడిసెలు, మట్టి మిద్దెలలో నివసిస్తున్న ప్రజలను మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బంది ఖాళీ చేయించారు. తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సంబేపల్లిలో జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. మండలంలో 144 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దుద్యాల శెట్టిపల్లె, గున్నికుంట్ల, దేవళంపేటల్లో తుపాను దాటికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలవాలాయి. పూరి గుడిసె కూలిపోయింది. (చదవండి: తుపాను ప్రభావంపై సీఎం జగన్‌ సమీక్ష)

జమ్మలమడుగు నియోజకవర్గంలో తుపాను ప్రభావంతో వరి, శనగ, మిరప, ప్రత్తి పంటలు నీటమునిగాయి. జమ్మలమడుగు ఆర్టీసీ బస్టాండ్‌, డీఎస్పీ, ఆఫీస్‌,ఎక్చేంజ్‌ కార్యాలయం నీటమునిగాయి. లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవుల, దిన్నెపాడు, అప్పలరాజు పల్లె, నరసింహారాజు గారి పల్లెలో తుపాను ప్రభావంతో పూర్తిగా నీటమునిగింది. ఈదురు గాలులకు విద్యుత్‌ స్తంభాలపై చెట్లు పడిపోవడంతో విద్యుత్‌కు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పోరుమామిళ్ల మండలంలో తుపాన్‌ ప్రభావంతో వరిపంట పూర్తిగా నీట మునిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

తుపాను ప్రభావంతో రాజంపేట మండలం ఊటుకూరు వద్ద కడప - తిరుపతి జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఏర్పడింది. రెండు కిలోమీటర్లు మేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద ఉధృతిని ఎస్పీఅన్బురాజన్ పరిశీలించారు. తగిన భద్రతలు తీసుకోవాలని రాజంపేట డిఎస్పీ శివ భాస్కరరెడ్డికి సూచనలు చేశారు. సుండుపల్లి మండలం, సిద్దారెడ్డి గారి పల్లిలో తుపాను ధాటికి నలభై ఏళ్ల చింతచెట్టు రోడ్డుపై అడ్డంగా నేల కొరిగింది. జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

చిత్తూరు జిల్లా: తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమలలో  జలాశయాలు నీటితో నిండాయి. పాప వినాశనం, ఆకాశ గంగ, గొగర్బం, కేపీ డ్యామ్‌ గేట్లు అధికారులు ఎత్తివేశారు. 

పశ్చిమగోదావరి జిల్లా: తుపాన్‌ ప్రభావంతో ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారు. కోసిన వరిచేలు తడిసి ముద్దయ్యాయి. కనీస పెట్టబడులు కూడా రావని రైతులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా: తుపాను ప్రభావంతో జ‌య‌లలితా న‌గ‌ర్ లో భారీవృక్షాలు కూలి ఇళ్లు ధ్వంస‌మైన బాధితుల‌ను ఎస్పీ భాస్కర్‌  భూష‌న్ ప‌రామ‌ర్శించారు. స్థానిక 48 వార్డ్ ఇంఛార్జితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసుల‌రెడ్డి, సీఐలు మ‌ధుబాబు, అన్వర్‌ భాష‌, ఎస్ఐలు సుభాని, శ్రీహ‌రి తదితరులు ఉన్నారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి నది పొంగడంతో ఐదు
గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

తూర్పుగోదావరి: పిఠాపురం మండలం సూరాడపేట వద్ద సముద్రం అలల ఉధృతికి 100 మీటర్ల మేర సముద్రం చొచ్చుకొచ్చింది. ఒడ్డున ఉన్న రెండు పూరి గుడిసెలు, వెంకటేశ్వర స్వామి దేవాలయం ధ్వంసం అయ్యాయి.

ప్రకాశం జిల్లా: చీరాల మండలం వాడరేవులోని మత్స్యకారులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చీరాల ప్రాంతంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఓడరేవుల్లో మూడో నంబర్‌  ప్రమాద జెండాను అధికారులు ఎగురవేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top