Cyclone Gulab: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం

Cyclone Gulab: CM YS Jagan Video Conference With District Collectors - Sakshi

అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: గులాబ్‌ తుపాను, అనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. తుపాను అనంతర పరిస్థితులను  సీఎస్‌ ఆదిత్య నాథ్‌ దాస్‌ సీఎం జగన్‌కు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అరగంటకూ విద్యుత్‌ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకోవాలని సూచించారు. ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకుని, విద్యుత్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు.

ఇవాళ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎస్‌కు ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయొద్దని అన్నారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలను తెరవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

విశాఖ నగరంలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్‌ చేసి తొలగించే పనులు ముమ్మరంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. సహాయ శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించారు.

తాగునీటి వనరులు వర్షపు నీరు కారణంగా కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున వాటర్‌ ట్యాంకర్లు ద్వారా తాగునీటిని అందించాలని సూచించారు. జనరేటర్లతో వాటర్‌ స్కీంలు నిర్వహించాలని, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేయాలన్నారు. నష్టం అంచనాలు వెంటనే సిద్ధంచేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్యుమరేషన్‌ చేసేపటప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.

ఒడిశాలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నందున, అకస్మాత్తుగా వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. వంధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని ఆధికారులను ఆదేశించారు. అవసరమైన చోట వారిని సహాయ శిబిరాలకు తరలించాలని, రిజర్వాయర్లలో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. నీటిని విడుదల చేయాలన్నారు. ఈ సమీక్షలో విజయనగరం నుంచి సమీక్షలో  మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్, విపత్తు నిర్వహణ కమిషనర్‌ కన్నబాబు, శ్రీకాకుళం నుంచి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top