కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంపు భేష్‌  | CWC Praises Increase in height of Polavaram cofferdam | Sakshi
Sakshi News home page

కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంపు భేష్‌ 

Jul 20 2022 5:03 AM | Updated on Jul 20 2022 5:03 AM

CWC Praises Increase in height of Polavaram cofferdam - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను మరింత పటిష్టపర్చడం.. ఒక మీటర్‌ ఎత్తు పెంపును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభినందించింది. భవిష్యత్తులో గరిష్టంగా వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తతో చేపట్టిన ఈ రక్షణ చర్యలను మంగళవారం సీడబ్ల్యూసీ (డిజైన్స్‌ విభాగం) సీఈ డీసీ భట్‌ ప్రశంసించారు. నిజానికి.. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 28.5 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికే సీడబ్ల్యూసీ గతంలో డిజైన్‌ చేసింది.

ఆ మేరకే పనులను ప్రభుత్వం పూర్తిచేసింది. కానీ, గోదావరి బేసిన్‌లో ఈనెల 13 నుంచి కురిసిన భారీ వర్షాలవల్ల పోలవరం వద్దకు 28.50 నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. కానీ, 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాఫర్‌ డ్యామ్‌ను రక్షించుకోవడానికి చర్యలు చేపట్టాలని ఈనెల 14న జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. దీంతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు ఎగువన  40.5 మీటర్ల నుంచి 43 మీటర్ల వరకూ రివిట్‌మెంట్‌పైన కోర్‌ (నల్లరేగడి మట్టి) వేసి, దానిపై ఇసుక బస్తాలను వేశారు. రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటర్‌ ఎత్తుతో మట్టి, రాళ్లువేసి కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 43 నుంచి 44 మీటర్లకు పాక్షికంగా పెంచే పనులను 48గంటల రికార్డు సమయంలోనే అధికారులు పూర్తిచేశారు.

సీడబ్ల్యూసీ అనుమతి కోరిన అధికారులు
సాధారణంగా ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వస్తాయి. ఇలా గరిష్టంగా వరద వచ్చినా ఎదుర్కొనేలా కాఫర్‌ డ్యామ్‌ను పటిష్టంచేసే పనులను చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో మరింత పటిష్టపర్చడం.. పూర్తిస్థాయిలో 44 మీటర్ల ఎత్తుకు పెంచే పనులు చేపట్టడానికి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ అనుమతిని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కోరారు. దీనిపై సీడబ్ల్యూసీ సీఈ (డిజైన్స్‌) డీసీ భట్‌ అధ్యక్షతన మంగళవారం కేంద్రం వర్చువల్‌గా సమావేశం నిర్వహించింది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈ (డిజైన్స్‌) రాజేష్‌కుమార్, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాఫర్‌ డ్యామ్‌ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీడబ్ల్యూసీ, పీపీఏ 
అభినందించాయి.

ఎత్తు పెంపు పనులకు శ్రీకారం..
ప్రస్తుతం పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 43 మీటర్ల ఎత్తుతో 2,454 మీటర్ల పొడవున నిర్మించారు. 40.5 మీటర్ల వరకూ కాఫర్‌ డ్యామ్‌ మధ్యలో అడుగుభాగాన గరిష్టంగా 237 మీటర్లు (మధ్యలో 16.2 మీటర్లు వెడల్పుతో కోర్‌).. పైభాగానికి వచ్చేసరికి కనిష్టంగా 9 మీటర్ల (మూడు మీటర్ల వెడల్పుతో కోర్‌) వెడల్పుతో కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించారు. నీటి లీకేజీలను అడ్డుకునేందుకు కోర్‌ వేసిన మట్టం అంటే 40.5 మీటర్ల వరకూ డ్యామ్‌లో నీటి మట్టం చేరినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ పైభాగాన 2.5 మీటర్లు రాళ్లు, మట్టితో పనులు చేశారు. 40.5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నీటిమట్టం పెరిగితే.. లీకేజీలవల్ల కాఫర్‌ డ్యామ్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.

ఇటీవల గరిష్టంగా 26.9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరంలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 38.76 మీటర్లు నమోదైంది. కానీ, గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాఫర్‌ డ్యామ్‌కు నష్టం కలగకుండా ఉండాలంటే 43 మీటర్ల వరకూ 3 మీటర్ల వెడల్పుతో కోర్‌వేసి.. పాక్షికంగా రెండు మీటర్ల వెడల్పుతో ఒక మీటర్‌ ఎత్తు పెంచిన పనులకు తోడుగా మిగతా ఏడు మీటర్లు వెడల్పుతో ఒక మీటర్‌ ఎత్తు పెంచాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనపై సీడబ్ల్యూసీ సీఈ డీసీ భట్‌ ఆమోదముద్ర వేశారు. కోర్‌ను పొరలు పొరలుగా వేసి.. రోలింగ్‌ చేస్తూ.. పటిష్టతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పనులుచేయాలని సూచించారు. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement