శిక్షణకొచ్చి చిక్కారు!

Cumbing in Odisha Encounter in Visakhapatnam - Sakshi

ఒడిశాలో కూంబింగ్‌.. విశాఖ మన్యంలో ఎన్‌కౌంటర్‌

ఆరుగురు మావోయిస్టులు హతం.. ముగ్గురు మహిళలే

మృతుల్లో డివిజన్‌ కమిటీ సభ్యులు సందె గంగయ్య, రణదేవ్‌

తప్పించుకున్న అగ్రనేత ఉదయ్‌? కొనసాగుతున్న గాలింపు 

సాక్షి, అమరావతి, కొయ్యూరు, పాడేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో క్యాడర్‌కు శిక్షణ తరగతులు నిర్వహించి పట్టు సాధించేందుకు మావోయిస్టులు రూపొందించిన వ్యూహం విఫలమైంది. ఒడిశాలో మూడు రోజుల నుంచి మొదలైన కూంబింగ్, ఎదురు కాల్పులు ఏపీలో ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు డివిజన్‌ కమిటీ సభ్యులు సందే గంగయ్య, రణదేవ్‌లతోపాటు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. నిస్తేజంగా ఉన్న క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు ఏవోబీ పరిధిలోని మల్కనగిరిలో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించినట్లు ఏపీ, ఒడిశా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో కూంబింగ్‌ చేపట్టారు.

ఒడిశాలో తప్పించుకుని...
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్‌తోపాటు కొందరు అగ్ర నేతలు శిక్షణా తరగతులకు హాజరు కానున్నట్టు సమాచారం అందడంతో మూడు రోజుల క్రితం మల్కనగిరి, కొరాపుట్‌ జిల్లాల్లో ఒడిశా కోబ్రా పోలీసులు, బీఎస్పీ దళాలు కూంబింగ్‌ చేపట్టాయి. సోమవారం నుంచి విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహించారు. ఏవోబీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసు బలగాలకు కులబెడ గ్రామంలో మావోయిస్టులు తారసపడ్డారు. కొద్దిసేపు ఎదురు కాల్పులు అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. సంఘటన స్థలంలో ఇన్సాస్‌ రైఫిల్, ఏకే–47 మ్యాగజైన్, ఇన్సాస్‌ మ్యాగజైన్, డిటోనేటర్లు, బ్యాటరీలు, ఐఈడీ బాంబుల తయారీ పదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో అటు ఒడిశా ఇటు ఏపీలోనూ పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. 

మన్యం అడవుల్లోకి సరుకులు తరలిస్తూ..
ఒడిశాలో ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల్లో కొందరు ఏపీలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో పెద్ద ఎత్తున సరుకులు కొనుగోలు చేసి అటవీ ప్రాంతంలోకి తరలిస్తుండటాన్ని గుర్తించారు. కూంబింగ్‌ చేపట్టిన గ్రేహౌండ్స్‌ బలగాలకు కొయ్యూరు మండలం తీగలమెట్ట ప్రాంతంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. యు.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్ట–పి.గంగవరం మధ్యనున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ డివిజన్‌ కమిటీ సభ్యుడు సందే గంగయ్య అలియాస్‌ డాక్టర్‌ అశోక్, రణదేవ్‌ అలియాస్‌ అర్జున్, ఏరియా కమిటీ సభ్యుడు సంతు నచిక, మావోయిస్టు పార్టీ సభ్యులు లలిత, పైకే చనిపోయిన వారిలో ఉన్నట్లు గుర్తించారు. మరో మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఏకే–47తోపాటు తపంచా, నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి, మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బలిమెల ప్రాంతంలో డీసీఎంగా పనిచేసిన రణదేవ్‌ కూడా మృతుల్లో ఉన్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం హెలికాఫ్టర్‌తో గాలింపు చేపట్టారు. గాయపడి తప్పించుకున్న మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని విశాఖ రూరల్‌ ఎస్సీ బి.కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

రెండు గ్రూపులుగా విడిపోయి..
ఒడిశాలో ఎదురు కాల్పుల ఘటనలో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్‌ ఉన్నట్లు భావిస్తున్నారు. ఒడిశాలో ఎదురు కాల్పులు జరిగిన 
ప్రాంతం నుంచి మావోయిస్టులు రెండు వర్గాలుగా విడిపోయి తప్పించుకున్నట్లు సమాచారం. వీరిలో ఏపీ వైపు వచ్చిన మావోయిస్టులు కొయ్యూరు మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. తప్పించుకుని ఒడిశాలో మరోవైపు వెళ్లినవారిలో ఉదయ్‌తోపాటు మరికొందరు అగ్రనేతలు ఉండవచ్చని భావిస్తున్నారు. వారి కోసం ఒడిశా పోలీసులు ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top