మోంథా తుపాన్ పీక నులిమేసిన మేధావితనం ఏమైంది?
ఇండిగో సంక్షోభంపై ఏకిపారేస్తున్న నెటిజన్లు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ పైనా విమర్శలు
అర్నబ్ చర్చాగోష్టిలో టీడీపీ అభాసుపాలు
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, అమరావతి: ‘మోంథా తుపాన్ పీక నులిమేసిన మేధావితనం ఏమైంది? సెల్‌ఫోన్‌ను, కంప్యూటర్‌ను కనిపెట్టిన జ్ఞానం ఎక్కడికి పోయింది? హైదరాబాద్‌నే నిర్మించిన, పెద్ద పెద్ద సంక్షోభాలను చిటికెలో పరిష్కరించిన నైపుణ్యం ఎక్కడికి పోయింది? ఇంతటి మేధావి ఇండిగో ఎయిర్స్‌లైన్స్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుకు ఎందుకు ఓ సలహా ఇవ్వలేదు?’ అంటూ నెటిజన్లు సీఎం చంద్రబాబును సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. ఇండిగో సృష్టించిన సంక్షోభానికి ఓ పక్క ప్రయాణికులు ఆగ్రహ జ్వాలలతో రగిలి పోతుంటే.. మరోపక్క ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ ప్రయత్నించి దేశ వ్యాప్తంగా అభాసుపాలైంది.
ఈ సంక్షోభంపై ‘రిపబ్లిక్’ టీవీలో జరిగిన చర్చలో టీడీపీకి చెందిన అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి వ్యాఖ్యలను జర్నలిస్టు అర్నబ్ గోస్వామి తీవ్రంగా పరిగణించారు. ‘ఈ సమస్యతో టీడీపీకి సంబంధం ఏమిటి? అసలు నారా లోకేశ్ ఎందుకు సమీక్ష చేస్తారు? ఏ హోదాతో చేస్తారు? అంటూ దీపక్ రెడ్డిని ప్రశ్నలతో నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దీపక్ రెడ్డి తెల్లమొహం వేసి, టాపిక్ మార్చే ప్రయత్నం చేయడంతో నవ్వులపాలయ్యారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏదో ఒక సంఘటన తరచూ జరుగుతూనే ఉంది.
విమాన ప్రమాదాలు, టిక్కెట్ ధరలు పెరగడం, స్టాఫ్ వ్యవహార శైలి, గంటల తరబడి వేచి ఉండటం, ఫ్లైట్ క్యాన్సిల్స్, ఫ్లైట్ డిలే వంటి ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 230 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాద సంఘటన స్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రి రీల్ తరహాలో ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రావడం, షర్ట్‌ను మోచేతి వరకు మడత పెట్టడం చూసిన నెటిజన్లు మండిపడ్డారు. రామ్మోహన్ కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ప్రత్యేకించి ఏమీ లేదని రాష్ట్ర ప్రజలు విమర్శిస్తున్నారు.


