పకడ్బందీగా కోవిడ్‌ కర్ఫ్యూ .. గడప దాటని జనం

Covid: Partial Lockdown In Andhra Pradesh Successfully Going - Sakshi

చెక్‌ పోస్టులతో సరిహద్దులు కట్టడి

స్వచ్ఛందంగా వ్యాపార సంస్థల మూత

నిలిచిన వాహనాల రాకపోకలు

మధ్యాహ్నం నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

సాక్షి, రాజమహేంద్రవరం: కరోనా భయం ప్రజలను గుమ్మం దాటనివ్వలేదు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తూ.చ. పాటిస్తున్నారు. కోవిడ్‌ విజృంభణ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. జిల్లా వ్యాప్తంగా నిర్మానుష్య వాతావరణం కనిపించింది. రోడ్లన్నీ బోసిపోయాయి. ప్రజలు ముందస్తుగా ఉదయాన్నే నిత్యావసర దుకాణాల వద్ద బారులు తీరడం కనిపించింది. గతేడాది కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ పరిస్థితులే తాజా కర్ఫ్యూలో స్పష్టంగా పునరావృతమయ్యాయి. కరోనా రెండో వేవ్‌ విçస్తృతి వేగంగా, ప్రమాదకరంగా ఉండటంతో ప్రజలు కూడా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు.

కలో,గెంజో ఉన్నదే తాగుదామనే ధోరణితో ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు క్షేత్ర స్థాయిలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాయి. విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిఘా నీడన ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం, రామచంద్రపురం, మండపేట, తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట తదితర పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ మండలాల్లోని పల్లెల్లో సైతం నిశ్శబ్ధ వాతావరణం కనిపించింది. ఏజెన్సీకి చెందిన 11 మండలాల్లోను గిరిజనులు సైతం స్వీయ నిర్బంధం పాటించారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద పోలీసులు బారికేడ్‌లు ఏర్పాటు చేసి మూసేశారు. రవాణా కూడా మధ్యాహ్నం 12 తరువాత నిలిచిపోయింది.  

అత్యవసరాలకే అనుమతి 
జిల్లాలో ఎనిమిది డిపోల పరిధిలో నడిచే  865 ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 12 గంటల తరువాత డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం పరిమితంగా వంద బస్సు సర్వీసులను నడిపారు. రావులపాలెం, అమలాపురం వంటి ప్రాంతాల్లో పోలీసులు పహారా కాసి బయటకు వచ్చిన వారిని తిప్పి పంపారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌ రోడ్డు, రింగ్‌ రోడ్డు, అమలాపురం రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. రాజమహేంద్రవరం  తాడితోట, మెయిన్‌రోడ్డు, జిల్లా కేంద్రం కాకినాడలోని సినిమా రోడ్డు, మెయిన్‌ రోడ్డు వంటి ప్రాంతాల్లో జన సంచారం లేదు. అన్ని పట్టణాల్లోను చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశాయి. ఆలయాలు, చర్చిలు, మసీదులు కూడా మూసివేశారు. మందుల దుకాణాలు, వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులు, అత్యవసర వస్తువులైన వైద్య పరికరాల రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు  మురళీధర్‌రెడ్డి, అద్నాన్‌ నయీం అస్మీ కాకినాడలోని భానుగుడి సహా పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి కర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు.  

సరిహద్దులు మూసివేత 
చింతూరు మండలం చిడుమూరు వద్ద ఆంధ్రా ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు, కల్లేరు వద్ద ఆంధ్రా–ఒడిశా సరిహద్దు మూతపడ్డాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి సరకు రవాణా వాహనాలు, అత్యవసర వాహనాలు తప్ప మిగిలినవి రాకుండా కట్టడి చేశారు. ఎటపాక మండలం పురుషోత్తపట్నం–భద్రాచలం చెక్‌పోస్టు వద్ద రాకపోకలు నిలిపివేశారు.  ఉభయ గోదావరి  జిల్లాల సరిహద్దులను కూడా బారికేడ్‌లతో మూసివేశారు. రెండు జిల్లాలను కలిపే రావులపాలెం మండలం సిద్దాంతం–గోపాలపురం, మల్కిపురం మండలం దిండి–చించినాడ, అఖండ గోదావరిపై కొవ్వూరు–రాజమహేంద్రవరం, ఇటు విశాఖపట్నం వైపు తుని–పాయకరావుపేట తాండవ బ్రిడ్జిపై సరిహద్దులను మూసివేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తుని నుంచి రాజమహేంద్రవరం వైపు కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి, కత్తిపూడి నుంచి కాకినాడ, యానాం మీదుగా ఉన్న పామర్రు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే సామర్లకోట  రైల్వే జంక్షన్‌ నిర్మానుష్యమైంది. 

చదవండి: కరోనా: ఒక్కడే.. ఆ నలుగురై! 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top