కుమార్తెకు పెళ్లి కుదుర్చుకుని వస్తూ అనంత లోకాలకు | Couple killed in lorry collision at Durgada Junction | Sakshi
Sakshi News home page

కుమార్తెకు పెళ్లి కుదుర్చుకుని వస్తూ అనంత లోకాలకు

Jun 8 2026 3:44 AM | Updated on Jun 8 2026 3:44 AM

Couple killed in lorry collision at Durgada Junction

దుర్గాడ జంక్షన్‌లో లారీ ఢీకొని దంపతుల దుర్మరణం 

సామర్లకోట అప్పయ్య చెరువులో తీవ్ర విషాదం 

సామర్లకోట / పిఠాపురం : కుమార్తెకు పెళ్లి సంబంధం ఖాయమైందన్న ఆనందంతో ఇంటికి వస్తున్న ఆ దంపతులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ జంక్షన్‌ సత్తెమ్మ ఆలయం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. సామర్లకోట అప్పయ్య చెరువు ప్రాంతానికి చెందిన జూరెడ్డి సూర్యనారాయణ (45) స్థానిక ఎఫ్‌సీఐ గోదాములో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 

ఆదివారం భార్య అరుణ కుమారి (40)తో కలిసి స్కూటీపై తుని వద్దనున్న తాళ్లూరికి వెళ్లారు. కుమార్తె ధరణికి వివాహ సంబంధం మాట్లాడేందుకు వెళ్లిన వీరు.. సంబంధం ఖాయం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దుర్గాడ రోడ్డు జంక్షన్‌లోని సత్తెమ్మ ఆలయం సమీపంలోకి వచ్చేసరికి వారి స్కూటీని లారీ ఢీకొట్టింది. సూర్యనారాయణ హెల్మెట్‌ పెట్టుకున్నప్పటికీ లారీ చక్రం తలపై నుంచి వెళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. అరుణకుమారిని కాపాడేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లాలని స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఆమె కూడా చనిపోయింది. 

దంప­తు­లిద్దరూ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచారు. లారీ డ్రైవర్‌ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. తమ ఏకైక కుమార్తెను డాక్టర్‌ను చేయాలనే ఆశతో సూర్యనారాయణ, అరుణకుమారి చదివిస్తున్నారని బంధువులు తెలిపారు. అయితే నీట్‌లో సీటు రాకపోవడంతో మరో ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం రాజమహేంద్రవరంలో బీఎస్సీలో చేర్చి హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారని... ఇంతలో మంచి సంబంధం రావడంతో పెళ్లి ఖాయం చేసుకుని వస్తున్న సమయంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని బంధువులు విలపిస్తున్నారు. దంపతుల హఠాన్మరణంతో అయ్యప్పచెరువు ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement