భీమవరంలో నకిలీ మందుల కలకలం

Counterfeit Counterfeit Drugs in Bhimavaram - Sakshi

అజిత్రోమైసిన్‌ పేరిట సుద్ద మాత్రల అమ్మకం

విజయవాడ డ్రగ్‌ ల్యాబొరేటరీ పరిశీలనలో వెల్లడి

లోతుగా విచారణ చేపట్టిన ఔషధ నియంత్రణ శాఖ

సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నకిలీ మందుల గుట్టు రట్టయింది. మాత్రల్లో ఎలాంటి మందు లేకుండా అమ్ముతుండటం కలకలం రేపుతోంది. ఇలాంటి నకిలీ మందులు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని షాపుల్లో ఉన్నాయి, వాటిని తయారు చేసే కంపెనీలు ఎన్ని ఉన్నాయన్న దానిపై ఔషధ నియంత్రణ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే భీమవరానికి రెండు బృందాలను పంపి విచారణ జరిపిస్తోంది. 

వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం ఓ మెడికల్‌ షాపులో అక్కడి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కొన్ని అజిత్రోమైసిన్‌ ట్యాబ్లెట్లను సేకరించి పరీక్షల నిమిత్తం విజయవాడలోని డ్రగ్‌ ల్యాబొరేటరీకి పంపించారు. వీటిని ఇక్కడ పరిశీలించగా.. 500 ఎంజీ అజిత్రోమైసిన్‌లో కనీసం 10 శాతం కూడా మందు లేనట్టు వెల్లడైంది. సుమారు 8 బ్యాచ్‌ల మందులను పరిశీలించగా అన్ని మందులూ ఇలాగే ఉన్నట్టు తేలింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ కంపెనీ ఈ మందులను తయారు చేసినట్టు గుర్తించారు. బ్యాచ్‌ నంబర్లు, తయారీ తేదీ వంటివన్నీ మల్టీనేషనల్‌ కంపెనీ స్థాయిలో ముద్రించి ఉండటంతో సాధారణంగానే జనం కొనుగోలు చేస్తున్నారు. కానీ ఆ మందులను పరిశీలిస్తే మాత్రం సుద్ద బిళ్లలుగా తేలింది.

అసలు ఉత్తరాఖండ్‌లో అలాంటి కంపెనీ ఉందా, రాష్ట్రంలోనే ఎక్కడైనా తయారు చేస్తున్నారా, మందుల దుకాణదారు వాటిని ఎక్కడ కొన్నారు, అవి ఇంకా ఎక్కడైనా అమ్ముడవుతున్నాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు. దగ్గు తగ్గేందుకు అజిత్రోమైసిన్‌ మాత్రలు వాడతారు. వీటిని వేసుకోవడం వల్ల దగ్గు తగ్గకపోగా మరేదైనా సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఔషధ నియంత్రణ శాఖ సంచాలకులు ఎంబీఆర్‌ ప్రసాద్‌ చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరిన్ని నమూనాలను ల్యాబొరేటరీలో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ నరసరావుపేట నకిలీ మందులకు అడ్డాగా ఉండేది. ఇప్పుడు భీమవరంలోనూ ఈ మందులు బయటపడటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top