ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్‌ బీమా

Corporate Insurance For Rtc Employees In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఆర్టీసీ ఉద్యోగుల బీమాకు సంబంధించి ‘కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజీ’ని ప్రకటించింది. ఉచిత ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యం, సహజ మరణం సంభవించినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు భారీ పరిహారంతో ప్యాకేజీని ప్రవేశపెడుతోంది. దీంతోపాటు మరణించిన ఉద్యోగుల పిల్లల విద్యారుణాలు, ఆడపిల్లల వివాహ రుణాల మాఫీ కూడా కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసుశాఖ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తున్న ‘కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజీ’ని ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కల్పించింది. ఈ మేరకు సేŠట్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రంలో 50,500 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగా.. తాజాగా కార్పొరేట్‌ బీమా ప్యాకేజీ ప్రకటించడంతో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించినట్లయింది. ఆర్టీసీ తమ ఉద్యోగులకు జీతాల ఖాతాలను ఎస్‌బీఐ ద్వారా నిర్వహిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న బీమా సౌకర్యానికి అదనపు ప్రయోజనాలు చేకూర్చి, ఇందుకోసం ప్రభుత్వం ఎస్‌బీఐతో సంప్రదింపులు జరిపింది. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులు కూడా కార్పొరేట్‌ ప్యాకేజీ అందించేందుకు ఆసక్తి చూపాయి. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు, ఉన్నతాధికారులు ఎస్‌బీఐకి వివరించారు. ప్రభుత్వరంగ బ్యాంకు అయినందున ఎస్‌బీఐకే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. 50,500 మంది జీతాల ఖాతాలు ఉన్నందున ఆర్టీసీ గట్టిగా డిమాండ్‌ చేయగలిగింది. దీంతో కార్పొరేట్‌ శాలరీ  ప్యాకేజీకి ఎస్‌బీఐ సమ్మతించింది. ఈ మేరకు ఆర్టీసీకి, ఎస్‌బీఐకి మధ్య ఒప్పందం కుదిరింది. 

బీమా ప్యాకేజీ ఇలా.. 
ఆర్టీసీ ఉద్యోగి విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం చెల్లిస్తారు. ఇప్పటివరకు ఈ పరిహారం రూ.30 లక్షలు ఉండేది. ఇప్పుడు రూ.10 లక్షలు పెంచారు. ప్రమాదంలో గాయపడి శాశ్వత వైకల్యానికి గురైతే రూ.30 లక్షల పరిహారం ఇస్తారు. వారి పిల్లల పేరిట రూ.5 లక్షల వరకు ఉన్న విద్యారుణాలు, ఆడపిల్లల వివాహాల కోసం చేసిన రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తారు. వీటికి ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ ఉద్యోగి సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇస్తారు. దీనికి ఒక్కో ఉద్యోగి నెలకు రూ.200 బీమా ప్రీమియం చెల్లించాలి. ఇంతతక్కువ ప్రీమియంతో రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం ఇదే తొలిసారి.  

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకోసమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇక ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజీ తీసుకొస్తోంది. దీంతో 50,500 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగులు అందరూ సమష్టిగా పనిచేసి సంస్థను అభివృద్ధిపథంలోకి తీసుకురావాలని కోరుతున్నాను.     
– సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top