ప్లాస్మా దాతలు ఏరీ!

Coronavirus: Only ten people in AP have donated plasma so far - Sakshi

అవగాహన లేకపోవడంతో ముందుకురాని వైనం

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ బారినపడి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి ప్లాస్మా థెరపీ ఓ సంజీవని. కరోనాతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న యువకులు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకూ పదిమంది మాత్రమే ప్లాస్మా దానం చేశారు. అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు. 

► కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి దాన్ని విషమ పరిస్థితిలో ఉన్నవారికి ఇవ్వడాన్ని ప్లాస్మా థెరపీ అంటారు. 
► కరోనా నుంచి కోలుకున్న 28 రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీస్‌ బాగా వృద్ధి చెంది ఉంటాయి. కోలుకున్న వారు కేవలం 400 మిల్లీలీటర్ల రక్తాన్ని దానం చేస్తే చాలు. దీనిలో ప్లాస్మాతో క్లిష్ట పరిస్థితిలో ఉన్న వారిని బతికించవచ్చు.
► ప్లాస్మా ఇచ్చిన వారికి గానీ, తీసుకున్న వారికి గానీ ఎలాంటి ఇబ్బందులు రావు. 
► జూలై 24 నాటికి రాష్ట్రంలో 39,935 వేల మంది కరోనా నుంచి కోలుకుంటే ఇందులో 70 శాతం మంది 40 ఏళ్లలోపు వారే. వీరిలో ఇప్పటివరకూ ప్లాస్మాను ఇచ్చింది కేవలం 10 మంది మాత్రమే. 

యువకులు ముందుకు రావాలి
కరోనాతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న యువకులు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాలి. దీనిపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దు. తిరుపతిలోని స్విమ్స్, కర్నూలు జీజీహెచ్‌లో ప్లాస్మా సేకరణ ఉంది. విజయవాడ, గుంటూరులకు కూడా అనుమతి కోరాం. 
– డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారమే
ప్లాస్మా ఇస్తే ఏదో జరుగుతుందని అనుమానపడుతున్నారు. ఇది పూర్తి నిరాధారం. ప్రపంచం మొత్తం ఈ పద్ధతిని అనుసరిస్తోంది. ప్లాస్మా సేకరణ ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకే జరుగుతుంది. కోలుకున్న యువకులు ముందుకు రావాలని కోరుతున్నాం.    
– డా.కె.ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక అధికారి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top