
వేగంగా వ్యాప్తి .. పెరుగుతున్న మరణాలు
పట్టించుకోని ప్రభుత్వం
మరణాలను దాచిపెడుతున్నట్లూ వార్తలు
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ప్రభుత్వం నియంత్రణ చర్యలను పూర్తిగా గాలికి వదిలేసింది. యోగా దినోత్సవం నిర్వహణే మీ ముందున్న లక్ష్యమని వైద్య శాఖకు సీఎం అల్టిమేటం జారీ చేయడంతో, ప్రాణాంతక వైరస్ కట్టడిని వైద్య శాఖ తేలికగా తీసుకుంటోంది. దీంతో చాప కింద నీరులా రాష్ట్రంలో వైరస్ వ్యాపించడమే కాకుండా, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. వైరస్ సోకిన వ్యక్తుల మరణాలను బయటకు పొక్కనివ్వకుండా వైద్య శాఖ కప్పెడుతోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. -సాక్షి, అమరావతి/నెల్లూరు(అర్బన్)/కర్నూలు(హాస్పిటల్)
కొన్ని ఘటనలు ఇవీ..
1 విజయవాడ జీజీహెచ్‌లో గురువారం కోవిడ్ సోకిన యువకుడు మరణించగా అధికారులు చడీచప్పుడు లేకుండా ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిసింది.
2 ఇదే ఆస్పత్రిలో గడిచిన ఐదారు రోజుల్లో వైరస్ బారిన పడిన ఇద్దరు మహిళలు మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు చర్చించుకుంటున్నాయి.
3 గత వారంలో విశాఖపట్నంలో వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందాడు. అతని చికిత్సకు సంబంధించిన కేస్ షీట్‌లో సైతం కోవిడ్ పాజిటివ్ అని వైద్యులు ధ్రువీకరించారు. అయితే సదరు వ్యక్తి ఇతర అనారోగ్య కారణాలతోనే మృతి చెందాడని వైద్య శాఖ అధికారులు కొట్టిపడేశారు.
4 రెండు రోజుల క్రితం వరకు కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి నెల్లూరు ప్రభుత్వ పెద్దాస్పత్రిలో ర్యాపిడ్ టెస్ట్ చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారికి మెడికల్ కళాశాలలోని మైక్రో బయాలజి విభాగం ఆధ్వర్యంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా అందరికీ గురువారం కరోనా నిర్థారణ అయింది. వీరిలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులున్నారు. వారు కేరళ నుంచి వచ్చి నెల్లూరులో వేర్వేరు నర్సింగ్ కళాశాలల్లో చదువుకుంటున్నారు. అలాగే నగరంలోని భక్తవత్సలనగర్‌కు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, వెంకటాచలం మండలం అనికేపల్లి, పెదకూరపాడు, గూడూరు ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు యువకులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతానికి వీరందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
5 కర్నూలు జిల్లాలో మరో నలుగురికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో జిల్లాలో పాజిటివ్ బాధితుల సంఖ్య 7కు చేరింది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులకు బుధ, గురు వారాల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కర్నూలు మండలం దిన్నెదేవరపాడుకు చెందిన 25 ఏళ్ల వ్యక్తికి, గోనెగండ్లకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, కర్నూలుకు చెందిన 20 ఏళ్ల మహిళకు, అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ నిర్థారణ అయింది. ఇందులో ఒక పీజీ వైద్య విద్యార్థిని ఉన్నారు.