YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం

Construction of Kadapa-Renigunta Road ar Cost of Rs 4 Thousand Crore - Sakshi

రెండు ప్యాకేజీలకు టెండర్లు పిలిచిన కేంద్రం 

భూసేకరణ ప్రక్రియ ముమ్మరం 

తిరుపతి, చెన్నైకి ప్రయాణం ఇక సులభం 

సాక్షి, రాజంపేట : శేషాచలం అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన 716 కడప–రేణిగుంట జాతీయరహదారిని 2024 నాటికి పూర్తిగా అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. 

తక్కువ వ్యవధిలోనే తిరుపతి.. 
కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌ ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలో తిరుపతికి చేరుకోవచ్చు. ఫలితంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చేవారు తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లే వారికి కడప–రేణిగుంట రహదారి ఎన్‌హెచ్‌ చేయడం వల్ల త్వరితగతిన గమ్యానికి చేరుకునే వీలు కలుగుతుంది. 

రెండు ప్యాకేజీలుగా..హైవే నిర్మాణం 
కడప నుంచి చిన్నఓరంపాడు(64.2కేఎం), చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు రెండుప్యాకేజీలుగా హైవే నిర్మాణపనులు జరుగుతాయి. నాలుగులేన్లుగా రోడ్డు నిర్మితం కానుంది. ఇందు కోసం టెండర్లను కూడా కేంద్రం పిలిచింది. రెండు ప్యాకేజీలకు కలిపి రూ.4వేల కోట్లు వ్యయం చేయనుంది. సెప్టెంబరు 16 తర్వాత టెండర్ల ఖరారును నిర్ణయిస్తారు.  

రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్‌ రహదారి 
కడప–రేణిగుంట రహదారిలో రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్‌ రహదారి నిర్మించాలని యోచిస్తున్నారు. ముంబై–చెన్నై రైలుమార్గం వెంబడి (పడమర వైపు )భాకరాపేట నుంచి చిన్నఓరంపాడు వరకు మార్గం నిర్మితం కానున్నది.ఇది పూర్తిగా అటవీమార్గంలోనే కొనసాగుతుంది. మార్గమధ్యలో ఆర్వోబీలు, చెయ్యేరునదిపై వంతెనలు, చిన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణాలు ఉన్నాయి.  

త్వరతగితిన హైవే నిర్మాణానికి ఎంపీ మిథున్‌రెడ్డి కృషి 
కడప–రేణిగుంట నేషనల్‌ హైవే త్వరితగతిన నిర్మితమయ్యేలా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తన వంతు కృషిచే శారు. కేంద్రం తీసుకున్న ప్రయార్టీలో కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌ను చేర్చేలా ఎంపీ విశ్వప్రయత్నాలు చేశారు. ఫలితంగా భూసేకరణ, మరోవైపు టెండర్ల ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. రెండేళ్లలో ఎన్‌హెచ్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నదే అభిమతంగా ఎంపీ ప్రయత్నిస్తున్నారు. 

ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాలకు స్పెషల్‌ కనెక్టిటివిటీ అవసరం 
జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలకు ఎన్‌హెచ్‌ నుంచి కనెక్టిటివిటీ రోడ్‌ (సర్వీసురోడ్డు) అవసరమని పలువురు భక్తులు కేంద్రాన్ని కోరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే యాత్రీకులు ఒంటిమిట్ట రామయ్య, సౌమ్యనాథుని దర్శించుకుంటారు. అంతేగాకుండా రాయలసీమలో తొలిసారిగా బయల్పడిన బౌద్ధారామాలున్నాయి.  

ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది. 
ప్రస్తుతం కడప–రేణిగుంట హైవేలో ట్రాఫిక్‌ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చెన్నై, ముంబై, హైదరాబాదులకు రాకపోకలు జరుగుతున్నాయి. నిత్యం 17వేలకు పైగా వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు హైవే కెపాసిటీ సరిపోవడంలేదు. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేగాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం మూడు నుంచి నాలుగు గంటలకుపైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్ధితి. నాలుగులైన్లరోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్‌ తగ్గుతుంది. ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. 

భూసేకరణ ప్రక్రియ ప్రారంభం 
కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌కు 1,066 ఎకరాల భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ పూర్తి అయింది. డ్రాఫ్ట్‌ డిక్లరేషన్‌ చేయాల్సి ఉంది. పరిహారం చెల్లింపు ప్రక్రియను రెవెన్యూ అధికారులు చేపట్టారు. అన్నమయ్య జిల్లా జేసీ తమీమ్‌ అన్సారియాలు పరిహారం అందజేసే అంశంపై కసరత్తు చేస్తున్నారు.  వైఎస్సార్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కూడా భూసేకరణపై దృష్టి సారించారు.

త్వరగా అందుబాటులోకి తీసుకొస్తాం 
రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్‌రోడ్డు నిర్మితం కానుంది. రూ.4వేల కోట్లతో రెండు ప్యాకేజీలుగా నిర్మాణ పనులు జరుగుతాయి. గ్రీన్‌హైవే ఎక్స్‌ప్రెస్‌లో పచ్చటి ప్రకృతిలో.. ఆహ్లాదకరమైన వాతవరణంలో త్వరితగతిన గమ్యాలకు చేరుకోవచ్చు.  2024 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.      
–పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట  

ప్రమాదాలు తగ్గుతాయి 
కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌ నిర్మాణంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. కడప–తిరుపతి మధ్య ప్రయాణ వ్యవధి తగ్గిపోతుంది. ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఒంటిమిట్ట, నందలూరులో ఉన్నందున ప్రత్యేకంగా స్పెషల్‌ సర్వీసు రోడ్డు నిర్మిచాల్సిన అవసరం ఉంది. త్వరగా అందుబాటులోకి వస్తే ఉభయ వైఎస్సార్‌ జిల్లా వాసులే కాకుండా, ఉత్తరభారతదేశం వారికి సకాలంలో తిరుపతి,గా చెన్నైలకు వెళ్లే వీలు ఉంటుంది.     –మేడారఘునాథరెడ్డి, అధినేత, ఎంఆర్‌కెఆర్‌ సంస్థ, నందలూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top