‘సాగర్‌ కవచ్‌’ కవాతు ప్రారంభం | Sakshi
Sakshi News home page

‘సాగర్‌ కవచ్‌’ కవాతు ప్రారంభం

Published Thu, Jul 13 2023 5:01 AM

Commencement of Sagar Kavach parade - Sakshi

సాక్షి,విశాఖపట్నం: దేశంలో రెండో అతి పెద్ద తీరాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వెంబడి ఉన్న సముద్ర జలాల పరిధిలో సమగ్ర తీర భద్రతపై 2 రోజుల పాటు నిర్వహించనున్న ‘సాగర్‌ కవచ్‌’ కవాతు బుధవారం ప్రారంభమైంది. సముద్ర సంబంధిత భద్రతా వ్యవస్థలతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది. 2008 నవంబర్‌ 26న ముంబై ఉగ్రదాడి తర్వాత తీర భద్రతపై దృష్టిసారించిన భారత్‌.. ప్రతి ఏటా తీరం వెంబడి ఉన్న రాష్ట్రాల్లో సాగర్‌ కవచ్‌ని నిర్వహిస్తోంది.

భారత నౌకాదళం, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్, స్టేట్‌ మెరైన్‌ పోలీస్, కస్టమ్స్, మత్స్యశాఖ, పోర్టు అథారిటీలు, డీజీఎల్‌ఎల్‌తో పాటు ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు, ఏజెన్సీలు, మారీటైమ్‌ డొమైన్‌లో భాగస్వాములైన ఏజెన్సీలు ఈ సాగర్‌ కవచ్‌లో పాల్గొంటున్నాయి. సముద్ర జలాల్లో ఆయా కేంద్ర, రాష్ట్ర రక్షణ విభాగాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం, విభాగాల వారీగా బలబలాల్ని నిరూపించుకునేలా ఈ కార్యక్రమం జరుగుతుంది.

వనరుల దోపిడీ జరగకుండా ఏవిధమైన భద్రతని పెంపొందించాలనే అంశాలపైనా ఆయా విభాగాలు చర్చించుకుంటాయి. ఏపీ తీరం వెంబడి పూర్తిస్థాయి భద్రత వలయాన్ని నిర్మించేందుకు మత్స్యకారుల నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? వారిని ఎలా సుశిక్షుతుల్ని చేయాలనేదానిపైనా విన్యాసాలు నిర్వహిస్తున్నారు.

ఈ విన్యాసాల్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుండగా.. విశాఖలోని కోస్ట్‌గార్డ్‌ తూర్పు ప్రధాన కార్యాలయం నుంచి సమన్వయ సహకారం జరుగుతోంది. సముద్ర జలాల్లో ఏ చిన్న శత్రు సంబంధిత సమాచారం దొరికినా..పోలీస్‌(100) లేదా కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌కు సంబంధించి 1093 లేదా ఇండియన్‌ కోస్ట్‌గార్డు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1554కి సమాచారం అందించాలని రక్షణ విభాగాలు విజ్ఞప్తి చేశాయి. గురువారం సాయంత్రంతో సాగర్‌ కవచ్‌ ముగియనుంది.

Advertisement
 
Advertisement