25లోగా కాలేజీల అఫిలియేషన్‌ పూర్తి చేయాలి

College affiliation must be completed by 25th September - Sakshi

జేఎన్టీయూ అధికారులకు ఈఏపీ సెట్‌ కమిటీ ఆదేశం

‘అఫిలియేషన్‌’ ఇంకా పూర్తి కాకపోవడంతో ఖరారు కాని అడ్మిషన్ల షెడ్యూల్‌

వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కమిటీ స్పష్టీకరణ  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల అఫిలియేషన్‌(గుర్తింపు) ప్రక్రియను ఈనెల 25కల్లా పూర్తి చేయాలని కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ అధికారులను ఏపీ ఈఏపీ సెట్‌ కమిటీ ఆదేశించింది. ఈఏపీ సెట్‌ అడ్మిషన్ల ప్రక్రియపై చర్చించేందుకు కమిటీ బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో సమావేశమైంది. ఏపీ ఈఏపీ సెట్‌ కమిటీ చైర్మన్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ పోలా భాస్కర్, సెట్స్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ ఎమ్‌.సుధీర్‌రెడ్డి, వర్సిటీల అధికారులు, కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ సమావేశంలో షెడ్యూల్‌ ఖరారు చేయాల్సి ఉంది. కానీ కాలేజీల అఫిలియేషన్‌ ప్రక్రియను యూనివర్సిటీలు ఇంకా పూర్తి చేయకపోవడంతో షెడ్యూల్‌ ఖరారు చేయలేకపోయారు.

రాష్ట్రంలో ఉన్న 272 ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల్లోని 1,39,862 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతులు మంజూరు చేసి చాలా రోజులయ్యింది. ఈ కాలేజీల్లో ఏఐసీటీఈ నిబంధనల మేరకు నిర్ణీత సదుపాయాలు, సిబ్బంది ఉన్నారో, లేదో తనిఖీ చేసిన తర్వాత వర్సిటీలు వాటికి గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ అధికారులు రోజులు గడుస్తున్నా ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఏఐసీటీఈ క్యాలెండర్‌ ప్రకారం ఇంజినీరింగ్‌ ప్రవేశాలను సెప్టెంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేసి అక్టోబర్‌ 1 నుంచి తరగతులను ఆరంభించాలి. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఈఏపీ సెట్‌ నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేసింది. అయినా కాలేజీల అఫిలియేషన్‌ను జేఎన్టీయూలు పూర్తి చేయకపోవడంతో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుపెట్టలేకపోతున్నారు. 

వేగంగా పూర్తి చేయండి.. తాత్సారం వద్దు
ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదల చేసి చాలా రోజులైందని, అక్టోబర్‌ 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉన్నందున కాలేజీల అఫిలియేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని.. తాత్సారం చేయొద్దని సెట్‌ కమిటీ సమావేశంలో కన్వీనర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రానికల్లా జేఎన్టీయూ అధికారులు తమ పరిధిలోని కాలేజీల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం కాలేజీలకు ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటుందని కన్వీనర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియకు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top