breaking news
JNTU officials
-
25లోగా కాలేజీల అఫిలియేషన్ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల అఫిలియేషన్(గుర్తింపు) ప్రక్రియను ఈనెల 25కల్లా పూర్తి చేయాలని కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ అధికారులను ఏపీ ఈఏపీ సెట్ కమిటీ ఆదేశించింది. ఈఏపీ సెట్ అడ్మిషన్ల ప్రక్రియపై చర్చించేందుకు కమిటీ బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో సమావేశమైంది. ఏపీ ఈఏపీ సెట్ కమిటీ చైర్మన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్, సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎమ్.సుధీర్‌రెడ్డి, వర్సిటీల అధికారులు, కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంది. కానీ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియను యూనివర్సిటీలు ఇంకా పూర్తి చేయకపోవడంతో షెడ్యూల్ ఖరారు చేయలేకపోయారు. రాష్ట్రంలో ఉన్న 272 ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల్లోని 1,39,862 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతులు మంజూరు చేసి చాలా రోజులయ్యింది. ఈ కాలేజీల్లో ఏఐసీటీఈ నిబంధనల మేరకు నిర్ణీత సదుపాయాలు, సిబ్బంది ఉన్నారో, లేదో తనిఖీ చేసిన తర్వాత వర్సిటీలు వాటికి గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ అధికారులు రోజులు గడుస్తున్నా ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఏఐసీటీఈ క్యాలెండర్ ప్రకారం ఇంజినీరింగ్ ప్రవేశాలను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి అక్టోబర్ 1 నుంచి తరగతులను ఆరంభించాలి. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఈఏపీ సెట్ నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేసింది. అయినా కాలేజీల అఫిలియేషన్‌ను జేఎన్టీయూలు పూర్తి చేయకపోవడంతో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుపెట్టలేకపోతున్నారు. వేగంగా పూర్తి చేయండి.. తాత్సారం వద్దు ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసి చాలా రోజులైందని, అక్టోబర్ 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉన్నందున కాలేజీల అఫిలియేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని.. తాత్సారం చేయొద్దని సెట్ కమిటీ సమావేశంలో కన్వీనర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రానికల్లా జేఎన్టీయూ అధికారులు తమ పరిధిలోని కాలేజీల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం కాలేజీలకు ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటుందని కన్వీనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. -
లీకేజీ నిజమే..!
-
లీకేజీ నిజమే..!
♦ ఎంసెట్-2 వ్యవహారంలో సీఐడీ ప్రాథమిక నిర్ధారణ ♦ ఐపీసీ 406, 408, 420, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు ♦ ప్రభుత్వ అనుమతితో పూర్తిస్థాయి విచారణకు సిద్ధమైన సీఐడీ ♦ రంగంలోకి ఆరు బృందాలు.. ఇప్పటికే పలు ఆధారాలు లభ్యం ♦ పలువురు జేఎన్టీయూ అధికారులు, ఫ్యాకల్టీ తీరుపై సందేహాలు ♦ అనుమానితులకు సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ కింద నోటీసులు! ♦ విద్యార్థుల తల్లిదండ్రులనూ ప్రశ్నించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకైనట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అంశంలో ఐదు రోజులుగా రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. ఆయా అంశాలన్నింటితో ఎంసెట్-2 లీకేజీకి సంబంధించి లభించిన ప్రాథమిక ఆధారాలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వ అనుమతి తీసుకుని.. సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 406 (నమ్మకద్రోహం), 408 (ప్రభుత్వ ఉద్యోగి నమ్మకద్రోహం), 420 (చీటింగ్, మోసం) రెడ్‌విత్ 120బి, ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1987 (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్) సెక్షన్ 8 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో నిందితులెవరనేది చేర్చలేదు. దర్యాప్తులో కుట్రదారుల పాత్రను నిర్ధారించి వారి పేర్లను చేర్చాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. కేసు సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీ ఆరు బృందాలను రంగంలోకి దింపింది. కేసు ప్రాముఖ్యత దృష్ట్యా సీఐడీ ఐజీ సౌమ్య మిశ్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎంసెట్-2 కౌన్సెలింగ్ వాయిదా పడిన నేపథ్యంలో కేసును త్వరగా ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అనుమానితులకు నోటీసులు: ఎంసెట్-2 లీకేజీ ఆరోపణలపై ప్రాథమిక విచారణలో సహకరించని వారందరికీ నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా జేఎన్టీయూ అధికారులు సరిగా స్పందించలేదని ఆరోపణలున్నాయి. కొందరు జేఎన్టీయూ అధికారులు, ప్రశ్నపత్రం తయారు చేసిన ఫ్యాకల్టీ సభ్యులు దళారులతో మాట్లాడినట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. దీనిపై ఆరా తీసేందుకు ఎవరిని ప్రశ్నించినా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. పైగా కొందరు ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు జేఎన్టీయూ అధికారులను, ప్రశ్నపత్రం తయారు చేసిన ఫ్యాకల్టీలోని ఇద్దరు స భ్యులను పిలిచి మాట్లాడాలని సీఐడీ భావి స్తోంది. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. ఇక ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను, ఆరోపణలు చేస్తున్న వారినీ పిలిచి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద స్టేట్మెంట్లు నమోదు చేయనున్నారు. ఇక ఓ ఈశాన్య రాష్ట్రంలోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఎంసెట్ -2 ప్ర శ్నపత్రాన్ని ముద్రించారు. అక్కడి నుంచి ప్రశ్నపత్రం లీకై ఉంటుందనే సందేహం మేరకు.. వారినీ విచారించాలని భావిస్తున్నారు. టెలికం కంపెనీలకు నోటీసులు బ్రోకర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య సంభాషణల కాల్ రికార్డుల కోసం సీఐడీ అధికారులు టెలికం కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. అధికారులు గుర్తించిన కాల్ లిస్టుల ప్రకారం దళారులు, జేఎన్టీయూ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఫోన్ సంభాషణలు చోటు చేసుకున్నాయి. పరీక్షకు వారం ముందు ఈ కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో దళారులుగా చెలామణీ అవుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి జేఎన్టీయూ అధికారులకు పదే పదే ఫోన్లు ఎందుకు వెళ్లాయి, వారేం మాట్లాడుకున్నారనేది తేల్చాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. అలాగే కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు ముట్టజెప్పినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వారి బ్యాంకు స్టేట్మెంట్లు తీసుకోవాలని సంబంధిత బ్యాంకు అధికారులను కోరనున్నారు. ఆరోపణలకు చేకూరుతున్న బలం ఎంసెట్-1లో తక్కువ ర్యాంకు వచ్చిన వారు ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకు సాధించడంతోపాటు, కొన్ని సందేహాస్పద ఘటనలు లీకేజీ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు పరీక్షకు వారం ముందే కోచింగ్ సెంటర్ల నుంచి బయటకు వచ్చి బెంగళూరు వెళ్లినట్లు గుర్తించారు. దీనిపై పలు ఆధారాలు కూడా సేకరించారు. ఎంసెట్-2లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయి. వాస్తవానికి ఎంసెట్-1 కంటే ఎంసెట్-2లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, అయినా ఎక్కువ మార్కులు వచ్చాయని సీఐడీ గుర్తించింది. -
జేఎన్టీయూకే విద్యార్థి అనుమానాస్పద మృతి
కాకినాడ సిటీ : జేఎన్టీయూ-కాకినాడలో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్న కోటా రాహుల్ (23) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం గంపలగూడేనికి చెందిన రాహుల్ కాకినాడలోని ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువు సాగిస్తున్నాడు. ఉదయం బాత్రూముకు వెళ్లిన రాహుల్ అక్కడే పడిపోయి ఉండడాన్ని రూమ్మేట్స్ గుర్తించారు. అతడిని వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)కి తీసుకువెళ్లారు. అప్పటికే రాహుల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాహుల్ లో బీపీతో పడిపోయి ఉండవచ్చని వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని జీజీహెచ్ అవుట్‌పోస్ట్ పోలీసులు మార్చురీకీ తరలించారు. సహచర విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జేఎన్టీయూకే అధికారులు రాహుల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.