
కొబ్బరి రూ.18,500.. కురిడీ రూ.27 వేలకు చేరిక
పచ్చికాయకు అనూహ్య డిమాండ్
మూడు నెలలుగా ఆశాజనకంగా ధర
భారీగా ఎగుమతులు
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. కురిడీ కొబ్బరి ధర కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగి ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేయగా.. పచ్చి కొబ్బరి కాయ సైతం ఆల్‌టైమ్ హైరికార్డులు సృష్టిస్తోంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.17,500 నుంచి రూ.18.500 పలుకుతోంది. పచ్చి కొబ్బరికి ఈ స్థాయి ధర రావడం ఇదే మొదటిసారి. మరోవైపు కురిడీ కొబ్బరి సైతం కురిడీ రూ.27 వేలకు చేరింది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఒక్క అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగవుతోంది. గత ఏడాది నుంచి పచ్చికాయ, ముక్కుడు కాయ (నిల్వకాయ) వెయ్యి కాయల ధర రూ.10 వేలకు తగ్గలేదు. తరువాత ఈ ధర పెరుగుతూ వస్తోంది. గత నెలలో వీటి ధర రూ.16 వేలకు చేరింది. ఇదే గరిష్ట ధర అనుకున్నారు.
అయితే.. రైతులు, వ్యాపారుల అంచనా దాటి కొబ్బరి కాయ ధర రూ.17,500 నుంచి రూ.18,500 వరకూ పెరగడం గమనార్హం. పచ్చి కొబ్బరికి ఈ స్థాయి ధర రావడం మార్కెట్‌లో ఇదే మొదటిసారి. ఉత్తరాదిలోని గుజరాత్, హరియాణ,, మహారాష్ట్రతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్‌లకు పచ్చికాయ అధికంగా ఎగుమతి అవుతోంది.
కురిడీకి రికార్డు స్థాయి ధర
కురిడీ కొబ్బరి సైతం మార్కెట్‌లో రికార్డు స్థాయి ధర పలుకుతోంది. పాత కాయలలో (8 నెలలకు పైబడి నిల్వ ఉన్న) గండేరా రకం (పెద్ద రకం) వెయ్యి కురిడీ కొబ్బరి కాయల ధర రూ.27 వేలకు చేరడం రికార్డు. గతంలో దీని సగటు ధర రూ.14 వేలు మించేది కాదు. ఇక గటగట (చిన్నకాయ) ధర రూ.25 వేలుగా ఉంది. కొత్త కాయల్లో గండేరా రూ.26 వేలు, గటగట రూ.24 వేల వరకు పెరగడం విశేషం.
నిల్వలు లేకపోవడమే కారణం
» ఏడాది కాలంగా రైతుల వద్ద, వ్యాపారుల వద్ద కొబ్బరి నిల్వ ఉండటం లేదు. గతంలో దింపు తీసిన కొబ్బరి రెండు, మూడు నెలలపాటు రైతుల వద్దనే ఉండేది. ధరలు ఆశాజనకంగా ఉండడంతో వారం వ్యవధిలోనే ఎగుమతి అవుతోంది. ఫలితంగా నిల్వలు తగ్గిపోయి కొబ్బరి, కురిడీ కొబ్బరికి డిమాండ్ గణనీయంగా పెరిగింది.
» ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాదికి కొబ్బరి కాయ ఎగుమతులు పెరిగిన కారణంగా మార్చి నెల నుంచి గోదావరి జిల్లాల కొబ్బరికి డిమాండ్ ఏర్పడింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. తమిళనాడు నుంచి జాతీయ మార్కెట్‌కు ఎగుమతి అయ్యే కొబ్బరిలో మూడోవంతు కూడా అందుబాటులో లేకుండా పోయింది. స్థానిక కొబ్బరి డిమాండ్ పెరగడానికి ఇది కారణమైంది.
» మార్చి నుంచి మే నెలాఖరు వరకూ ఎకరాకు సగటున 1,200 కాయల వరకూ దిగుబడి వస్తోంది. తరువాత అది తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం సగటు దిగుబడి 700 కాయల వరకూ ఉంది. ఇది కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమైంది.
» ఇంత ధర ఉన్నా రైతులు వెంటనే అమ్మడం లేదు. ధర మరింత పెరిగే అవకాశముందనే అంచనాతో ఆచితూచి విక్రయిస్తున్నారు.