టార్గెట్‌.. జాబ్స్‌

CM YS Jaganmohan Reddy referred Department of Education Job creations - Sakshi

ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చదువులు ఉండాలి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

జాబ్‌ ఓరియెంటెడ్‌గా కోర్సులను తీర్చిదిద్దాలి

విద్యార్థి వర్సిటీ నుంచి బయటకు రాగానే కచ్చితంగా ఉద్యోగం వస్తుందనే నమ్మకం కలగాలి

బాగా చదివినా ఇంటర్వ్యూల్లో విఫలమైన పరిస్థితులు చూస్తున్నాం

ప్రతి పార్లమెంట్‌ స్థానంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం

కరిక్యులమ్‌లో భాగంగా సర్టిఫైడ్‌ కోర్సులు

మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలతో నిరంతరం శిక్షణ 

వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకాలకు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌

ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీ లేదు

ఎన్ని సమస్యలున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో లోటు చేయట్లేదు

మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా ఫీజులు ఇస్తున్నాం

మూడేళ్లలో వర్సిటీలను అన్ని విధాలా మెరుగుపరిచేలా కార్యాచరణ

ఎయిడెడ్‌ సంస్థల అప్పగింతపై బలవంతం లేదు.. స్వచ్ఛందమే

సాక్షి, అమరావతి: ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చదువులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖకు సూచించారు. నాణ్యమైన బోధన, ఉపాధి కల్పనే లక్ష్యం కావాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి ఇంటర్న్‌షిప్, జాబ్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నామని, కోర్సుల్లో కూడా చాలా మార్పులు తెచ్చామని తెలిపారు. జాబ్‌ ఓరియెంటెడ్‌గా  కోర్సులను తీర్చిదిద్దాలని, విద్యార్థి యూనివర్సిటీ నుంచి బయటకు రాగానే కచ్చితంగా ఉద్యోగం సాధించేలా ఉండాలని స్పష్టం చేశారు.

మూడేళ్లలో యూనివర్శిటీలన్నీ అన్ని రకాలుగా మెరుగుపడేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఉన్నత విద్యామండలి ప్రతి వారం ఒక్కో వైస్‌ ఛాన్సలర్‌తో సమావేశం నిర్వహించి సమస్యలను నేరుగా తన దృష్టికి తెచ్చి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

టెక్ట్స్‌బుక్స్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి సురేష్, ఉన్నతాధికారులు 

క్వాలిటీ రిక్రూట్‌మెంట్స్‌ 
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపాం. టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులన్నీ పూర్తిగా భర్తీ చేయాలి. టీచింగ్‌ స్టాఫ్‌ లేనప్పుడు యూనివర్సిటీలున్నా ఏం లాభం? మంచి అర్హతా ప్రమాణాలు కలిగినవారిని నియమించాలి. క్వాలిటీ లేకపోతే రిక్రూట్‌ చేసినా అర్ధం ఉండదు. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి. పక్షపాతాలకు తావుండకూడదు. కరిక్యులమ్‌లో కూడా మార్పులు రావాలి. అప్పుడే నాణ్యమైన విద్య అందించగలుగుతాం. విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ మూడు అంశాల్లో మార్పు వచ్చినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. యూనివర్సిటీల్లో అత్యుత్తమ అధ్యాపకుల క్లాసులను రికార్డ్‌ చేసి సబ్జెక్టుల వారీగా ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. విద్యార్ధులు సులభంగా అర్ధం చేసుకోవడానికి ఈ వీడియోలు ఉపకరిస్తాయి. ప్రతి వీసీ కూడా తన హయాంలో మంచి మార్పులు తీసుకురావాలి. 

పిల్లలకిచ్చే ఆస్తి నాణ్యమైన విద్యే
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. అదీ నాణ్యతతో కూడిన విద్య మాత్రమే. మనం వచ్చిన తర్వాత విద్యారంగంలో తేడా ఏమిటన్నది కనిపించాలి. ఈ ప్రభుత్వం చదువుకు ఇచ్చినంత ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వలేదు. నాణ్యమైన విద్య అందించడానికి పలు చర్యలు తీసుకున్నాం. మంచి చదువులతో కుటుంబాల తలరాతలు మారతాయి. 

కాలేజీల్లో ప్రమాణాలు తప్పనిసరి..
యూనివర్సిటీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం పూర్తి స్థాయిలో ఉండేలా చూడాలి. మంచి బ్యాండ్‌ విడ్త్‌ క్వాలిటీ ఉండాలి. ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీ పడొద్దు. మన పార్టీ, ఆ పార్టీ అని చూడాల్సిన అవసరం లేదు. ప్రతి కాలేజీ కచ్చితంగా ప్రమాణాలు పాటించాల్సిందే. కాలేజీలు సరిగా లేకపోతే యూనివర్సిటీల ప్రతిష్ట దెబ్బతింటుంది. ఏ కాలేజీలోనైనా ప్రమాణాలు లేకపోతే గుర్తించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లి మెరుగుపరుచుకోవడానికి సమయం ఇవ్వండి. ప్రమాణాలు లేనివాటికి అనుమతులు ఇవ్వొద్దు.

వర్శిటీలు అధ్యయనం చేయాలి
గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ లాంటి వ్యవస్ధలు సమర్ధవంతంగా పనిచేయడానికి అవసరమైన విధానాలపై యూనివర్సిటీలు అధ్యయనం చేయాలి. సబ్‌ రిజిస్ట్రార్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో పారదర్శకత, పౌరులకు మెరుగైన సేవలు అందించడంపైనా అధ్యయనం చేయాలి.
 
ఇంటర్వూ ఇబ్బందులు తొలగిపోవాలి
ఉద్యోగాలు కల్పన దిశగా చదువులు ఉండాలి. మైక్రోసాప్ట్‌ లాంటి సంస్ధలతో శిక్షణ నిరంతరం కొనసాగాలి. కోర్సులలో శిక్షణను సమ్మిళతం చేసినప్పుడు ఉద్యోగావకాశాలు మరింతగా మెరుగుపడతాయి. బాగా చదువుకున్నా ఇంటర్వూల దగ్గరకు వచ్చేసరికి విఫలం అవుతున్న పరిస్థితులను చూస్తున్నాం. అప్రెంటిస్‌షిప్‌ కచ్చితంగా ఉండాలి. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తెస్తున్నాం. జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను, కాలేజీలను అనుసంధానం చేయాలి.

అత్యుత్తమ కరిక్యులమ్‌... 
సర్టిఫైడ్‌ కోర్సులనూ కరిక్యులమ్‌లో భాగం చేయాలి. ఉగ్యోగాల కల్పన, ఉపాధి లక్ష్యం కావాలి. ఆయా రంగాల్లో నిపుణులైన, అత్యుత్తమమైన వ్యక్తులతో కోర్సులను రూపొందించండి. బైలింగువల్‌ (ద్వి భాషా) పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టాలి. ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలి. చదువులు పూర్తయ్యాక కచ్చితంగా జాబ్‌ వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు తేవాలి. ప్రాక్టికాలిటీ (అనుభవపూర్వకంగా నేర్చుకోవడం)కి పెద్దపీట వేయాలి.

జాతీయ స్థాయి ప్రమాణాలు 
జీఈఆర్‌ రేషియోను 2025 నాటికల్లా 70 శాతం అందుకోవాలి. విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలతో కచ్చితంగా దీన్ని సాధిస్తాం. ఆస్పత్రుల మాదిరిగానే ప్రతి యూనివర్శిటీ పరిధిలో కూడా జాతీయ ప్రమాణాలు ఉండాలి. కాలేజీలన్నీ నిర్దిష్ట ప్రమాణాలను పాటించేలా లక్ష్యాలను నిర్దేశించి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

సమస్యలున్నా రీయింబర్స్‌మెంట్‌
ఎన్ని సమస్యలున్నా సరే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఎక్కడా లోటు చేయడం లేదు. ప్రతి మూడు నెలలకొకసారి కచ్చితంగా చెల్లింపులు చేస్తున్నాం. రీయింబర్స్‌మెంట్‌ రానందున సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామనే మాట యాజమాన్యాల నుంచి రాకుండా చూసుకుంటున్నాం. తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నాం. 

విద్యా బోధన, కాలేజీల్లో పరిస్థితులపై వారికి నేరుగా ప్రశ్నించే అవకాశాన్ని కల్పించాం. ఇతర ప్రైవేట్‌ కాలేజీల మాదిరిగానే యూనివర్శిటీకీ సంబంధించిన కాలేజీల్లో కూడా భవిష్యత్‌లో సమానంగా ఫీజులు చెల్లిస్తాం. దీనివల్ల యూనివర్సిటీలు ఆర్ధికంగా స్వయం సమృద్ధి సాధిస్తాయి. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించాం.

కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ కాలేజీలు స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. పరిశోధనలపై కూడా సమన్వయం చేసుకోవాలి. జిల్లాల్లో పరిశ్రమలతో అనుసంధానం కావాలి. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రంగానికి సంబంధించి పరిశోధనలు జరిగేలా పరిశ్రమలతో కొలాబరేట్‌ కావాలి. 

వర్సిటీలకు మూడేళ్ల కార్యాచరణ
ఉన్నత విద్యా మండలి ప్రతి వారం ఒక వీసీతో సమావేశమై యూనివర్సిటీల్లో సమస్యలు, ప్రభుత్వపరంగా అందించాల్సిన తోడ్పాటుపై చర్చించాలి. ప్రస్తుత స్ధాయి, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలను గుర్తించాలి. వర్సిటీల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మూడేళ్లలో ఈ విజన్‌ సాధించాలి.

నాక్‌ రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ కావాలి
అన్ని యూనివర్శిటీల్లో నాక్‌ రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ కావాలి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను యూనివర్సిటీలతో ఇంటిగ్రేట్‌ చేయాలి. అంతర్జాతీయంగా, జాతీయంగా పేరున్న కంపెనీలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటాయి. ఆన్‌లైన్‌లో కూడా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను ఉంచాలి. ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని మెరుగుపర్చడంపైనా దృష్టి పెట్టాలి. బేసిక్‌ ఇంగ్లీషు అన్నది తప్పనిసరి సబ్జెక్టు కావాలి. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. 

వర్క్‌బుక్, పాడ్‌కాస్ట్‌ ఆవిష్కరణ..
సమావేశంలో ఇంగ్లీషు కమ్యూనికేషన్‌ వర్క్‌బుక్, టెక్టŠస్‌బుక్స్‌తో పాటు ఏపీఎస్‌సీహెచ్‌ఈ పాడ్‌కాస్ట్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌చంద్ర, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్ధుల్లో 1,10,779 మంది ల్యాప్‌టాప్‌లను ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

ఎయిడెడ్‌పై బలవంతం లేదు
ఎయిడెడ్‌ విద్యాసంస్ధల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు. ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్ఛందం. చాలా విద్యాసంస్ధల్లో పరిస్థితులు దెబ్బతిన్నాయి. శిధిలావస్థలో, మౌలిక సదుపాయాలు కొరవడటంతో విద్యార్ధులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వపరంగా ఒక అవకాశం కల్పించాం. ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయా సంస్ధలను ప్రభుత్వమే నిర్వహించి మెరుగైన రీతిలో నడుపుతుంది. దాతల పేర్లు కూడా కొనసాగుతాయి. లేదూ.. తామే నడుపుకొంటామంటే భేషుగ్గా నడుపుకోవచ్చు. దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వానికి ఎయిడెడ్‌ విద్యాసంస్ధల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టం చేయాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top