అంతర్వేది రథం సిద్ధం..

CM YS Jagan Will Visit Antarvedi Today - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అంతర్వేదిలో 2021 ఉత్సవాలు, రథోత్సవం కొత్త రథంతోనే నిర్వహిస్తామని భక్తులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చారు. అంతర్వేదిలో రథం దగ్థౖమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. కల్యాణోత్సవాలు, కొత్త రథాన్ని ప్రారంభించేందుకు సీఎం శుక్రవారం అంతర్వేదికి వస్తున్నారు. వైఎస్‌ జగన్‌ సుమారు గంట పాటు స్వామి సేవలో గడపనున్నారు..

భక్తుల మనోభావాలకే సర్కారు పెద్దపీట
రథం దగ్ధం అయిన నాటి నుంచి కొత్త రథం రూపు దాల్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలకే పెద్ద పీట వేసింది. గతేడాది సెప్టెంబర్‌ 5న అర్థరాత్రి దాటాక అంతర్వేదిలో రథం దగ్ధం అయ్యింది. దీన్ని సాకుగా తీసుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతి పక్షాలు, కొన్ని సంస్థలు ప్రయత్నించాయి. కుట్రలకు తెరలేపాయి. కొత్త రథం లేకుండా ఫిబ్రవరిలో ఉత్సవాలు నిర్వహించడం అరిష్టమనే ప్రచారాన్ని కూడా చేశాయి. ఉద్యమాలు, నిరసన పేరుతో రాద్ధాతం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నించాయి. అయితే సంఘటన జరిగిన మరుక్షణమే సీఎం స్పందించారు. కొత్త రథం తోనే ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరడంతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి. ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంలో సైతం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రథం దగ్థంపై సీబీఐ దర్యాప్తు విషయం ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం.

రూ.95 లక్షలతో కొత్త రథం
అంతర్వేదిలో ఫిబ్రవరిలోగా కొత్త రథం తయారు చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం ఈ కార్యక్రమం వెంటనే కార్యరూపం దాల్చేలా సెప్టెంబర్‌ 8న మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. రూ.95 లక్షల నిధులు మంజూరు చేశారు. స్వామి కల్యాణోత్సవాల సమయానికి కొత్త రథాన్ని సిద్ధం చేయాలనే సంకల్పంతో పనులు వేగవంతం చేశారు. రథం నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం అధికారులతో మరో కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ రథం నిర్మాణాన్ని, పనుల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించింది. మొత్తం 1,330 ఘనపటడుగుల బస్తర్‌ టేకును రథం కోసం వినియోగించారు. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీస్వామి కొత్త రథం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 

అంతర్వేదిలో సీఎం పర్యటన ఇలా..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఉదయం 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.35 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 మధ్య స్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను సీఎం నిర్వహిస్తారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 1.30కి తాడేపల్లికి చేరుకుంటారు. 

చదవండి: (యోధులారా వందనం : సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top