CM YS Jagan Polavaram Visit: తొలకరికి తొలిఫలం

CM YS Jagan Visits Polavaram Project To Review Development Works - Sakshi

వచ్చే జూన్‌కి జీవనాడి సాకారం.. పోలవరం పనులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే

స్వయంగా స్పిల్‌ వే పనుల పరిశీలన అనంతరం సమీక్షా సమావేశం

జలాశయంతోపాటు కుడి, ఎడమ కాలువ పనులు గడువులోగా లైనింగ్‌తో సహా పూర్తవ్వాలని దిశా నిర్దేశం

చాలా క్లిష్టమైన పనులు వేగంగా చేస్తున్నారంటూ అధికారులకు ప్రశంస

నిర్వాసితులకు పునరావాసాన్ని వేగవంతం చేయాలి

అత్యంత నాణ్యంగా ఇళ్లు, మౌలిక సదుపాయాల కల్పన పనులు 

ఇందులోఅలసత్వానికి తావివ్వొద్దు

ఆర్‌ అండ్‌ ఆర్‌ నాణ్యత పరిశీలనకు ప్రత్యేకంగా అధికారి ఫీడ్‌బ్యాక్‌ తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి

తప్పులు ఉన్నాయని చెబితే కచ్చితంగా సరిదిద్దుకోవాలి

రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం ఉన్న ఊరు, ఇళ్లను త్యాగం చేస్తున్న నిర్వాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా పునరావాసం కల్పించాలి. పునరావాస కాలనీల్లో నిర్వాసితులు జీవితాంతం నివాసం ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంత డబ్బు ఎక్కువ ఖర్చయినా సరే ఇళ్లను అత్యంత నాణ్యంగా నిర్మించండి. సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు పనులు పూర్తి చేయండి. వచ్చే నెలలో పునరావాస కాలనీలను పరిశీలిస్తా.
– పోలవరం వద్ద సమీక్షలో సీఎం జగన్‌

పోలవరం ప్రాజెక్టు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పోలవరం జలాశయంతోపాటు కుడి, ఎడమ కాలువ పనులను లైనింగ్‌తో సహా 2022 జూన్‌ నాటికి పూర్తి చేసి రైతులకు ప్రాజెక్టు ఫలాలను అందించాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో కేంద్రం నుంచి రూ.2,200 కోట్లు రావాల్సి ఉందన్నారు. అయినా సరే ప్రాజెక్టు పనులకు ఎక్కడా ఆటంకం కలగనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులను ఇస్తోందని చెప్పారు.

సహాయ, పునరావాస(ఆర్‌ అండ్‌ ఆర్‌) ప్యాకేజీ కింద నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు నిర్మిస్తున్న ఇళ్లు, మౌలిక సదుపాయాల పనులను అత్యంత నాణ్యంగా చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, అప్రోచ్‌ చానల్, ఎగువ కాఫర్‌ డ్యామ్, దిగువ కాఫర్‌ డ్యామ్, జలవిద్యుత్కేంద్రం పనులను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. ఏరియల్‌ సర్వే అనంతరం హెలిప్యాడ్‌ వద్ద సీఎం జగన్‌కు మంత్రులు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.

హెలిపాడ్‌ వద్దనున్న వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత ఇటీవలే పూర్తైన స్పిల్‌ వే వద్దకు చేరుకుని బ్రిడ్జిపైకి వెళ్లి స్వయంగా పనులను గమనించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పోలవరం పనుల పురోగతిని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు తదితరులు వివరించారు. రెండేళ్లలో పూర్తైనవి, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల గురించి వివరించారు. ఏరియల్‌ సర్వే, క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ 
 
యుద్ధప్రాతిపదికన పనులు..
పోలవరం స్పిల్‌ వే పనులను దాదాపుగా పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. స్పిల్‌వే 48 గేట్లలో 42 గేట్లను ఇప్పటికే అమర్చామన్నారు. జర్మనీ నుంచి ఇటీవలే 14 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లు వచ్చాయని, వరద తగ్గగానే మిగిలిన ఆరు గేట్లకు బిగిస్తామని చెప్పారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీలను పూర్తి చేసి  40 మీటర్ల ఎత్తుకు పూర్తి చేశామన్నారు.

వాతావరణం అనుకూలిస్తే ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో 42.5 మీటర్ల ఎత్తుకు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను వేగంగా చేస్తున్నామన్నారు. ఎర్త్‌కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) పనులపై సీఎం జగన్‌ ఆరా తీశారు. గత సర్కార్‌ ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల వరద ఉద్ధృతికి ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌లో కొంత భాగం దెబ్బతిందని, దాన్ని ఎలా బాగుచేయాలన్న దానిపై సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం), డీడీఆర్పీ(డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌)తో చర్చిస్తున్నామని అధికారులు తెలిపారు.

సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు డయాఫ్రమ్‌ వాల్‌ను అత్యంత పటిష్టంగా మార్చి ఈసీఆర్‌ఎఫ్‌ పనులు చేపడతామన్నారు. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ పోలవరం జలాశయంతోపాటు అనుసంధానాలు, టన్నెళ్లు, కుడి, ఎడమ కాలువల పనులను లైనింగ్‌తో సహా 2022 జూన్‌ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎడమ కాలువలో మిగిలిన తవ్వకం పనులు డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయని, నిర్దేశించిన గడువులోగా అన్ని పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
పోలవరం పనులపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం  

ఏదో కట్టాం కదా అన్నట్లుగా కుదరదు..
పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద తొలిదశలో 90 గ్రామాలకుగానూ ఆగస్టు నాటికి 48 గ్రామాల నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ‘గతంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులపై దృష్టి పెట్టకుండా పూర్తిగా వదిలేశారు. మన ప్రభుత్వం వచ్చాక ఆర్‌ అండ్‌ ఆర్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాం. పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలి. ఏదో కట్టాం కదా అన్నట్లుగా పునరావాస కాలనీలు కట్టకూడదు’ అని అధికారులకు స్పష్టం చేశారు. పునరావాస కాలనీలను కచ్చితంగా నాణ్యతతో నిర్మించాలన్నారు.

‘ఇంత పెద్దఎత్తున పునరావాస కాలనీలు కడుతున్నప్పుడు ఎక్కడో ఒకచోట అలసత్వం కనిపించే అవకాశాలుంటాయి. కానీ అలాంటి అలసత్వానికి తావు ఉండకూడదు, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల్లో కచ్చితంగా నాణ్యత పాటించేలా ఒక అధికారిని నియమించండి. ఆ అధికారి ఇచ్చే ఫీడ్‌ బ్యాక్‌ను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. తప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు కచ్చితంగా సరిదిద్దుకోవాలి’ అని అధికారులను ఆదేశించారు. ఆర్‌ అండ్‌ కాలనీలను వేగంగా నిర్మించి లక్ష్యాలను త్వరగా చేరుకోవాలనే ప్రయత్నంలో అక్కడక్కడా తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయని, అయితే అలాంటి సందర్భాల్లో వాటిని సరిదిద్దే ప్రయత్నాలు తప్పకుండా చేయాలని అధికారులకు సూచించారు.
ఫొటో ఎగ్జిబిషన్‌లో పోలవరం పనుల పురోగతిని తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

నిర్వాసితులకు ఇబ్బందులు తలెత్తకూడదు..
‘ఆగస్టు నాటికి కొన్ని ఇళ్లను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గోదావరికి వరద వస్తే తగ్గేసరికి నవంబరు, డిసెంబర్‌ వరకూ పట్టే అవకాశాలు ఉంటాయి. ఈలోగా పునరావాస కాలనీలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి’ అని అధికారులను సీఎం జగన్‌ అప్రమత్తం చేశారు. అప్పటిదాకా నిర్వాసితులకు ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన ప్రమాణాలతో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి వాటిలోకి తరలించాలని సూచించారు. 

సమస్యలున్నా శరవేగంగా..
పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కేంద్రం సుమారు ఆర్నెళ్లుగా రీయింబర్స్‌ చేయలేదని ఈ సందర్భంగా అధికారులు తెలియచేయడంతో డబ్బులు సకాలంలో అందేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం నుంచి త్వరితగతిన బిల్లుల మంజూరుకు ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించినట్లు అధికారులు తెలిపారు. నిర్వాసితులకు జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధిపైనా దృష్టిపెట్టామన్నారు. నిర్వాసితుల్లో ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్నవారికి తిరిగి భూములు ఇచ్చేందుకు భూమిని గుర్తించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. చాలా క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పటికీ పనులు వేగంగా చేస్తున్నారని ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు..
ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్, రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, పోలవరం నిర్మాణ సంస్ధ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top