వైఎస్‌ జగన్‌: లబ్దిదారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌‌ | YS Jagan Video Conference with Beneficiaries of YSR Cheyutha Scheme - Sakshi
Sakshi News home page

లబ్దిదారులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌‌

Published Wed, Aug 12 2020 2:28 PM

CM YS Jagan Video Conference With YSR Cheyutha Scheme Beneficiaries - Sakshi

సాక్షి, అమరావతి: మహిళా సాధికారికతకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా  45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఇందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున జమచేశారు. ఈ సందర్భంగా  సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల లబ్ధిదారులతో మాట్లాడారు. ('వైఎస్సార్‌ చేయూత' పథకం ప్రారంభం)

ఎన్నో పథకాలు.. ధన్యవాదాలు అన్నా
సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా గతంలో లబ్ది పొందిన ఒంగోలుకు చెందిన పద్మావతి తాజాగా వైఎస్సార్‌ చేయూత ద్వారా మరోసారి ఆర్థిక సాయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. ‘‘ కరోనా కష్టకాలంలో ఏ ఇంట్లో ఆకలితో ఉండకూడదని ఉచిత రేషన్‌  ప్రతి ఒక్కరికీ రెండు సార్లు ఇచ్చారు. పుట్టింటి వాళ్లు కూడా చేయని సహాయాన్ని దేవుడిచ్చిన అన్నగా మీరు మాకు చేస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత పథకం మా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది రాష్ట్రమంతటా లబ్దిపొందుతున్నారు, వాళ్లలో నేను ఒక లబ్ధిదారునైనందుకు ఎంతో సంతోషపడుతున్నాను. 

కేవలం ఇవే కాదు.. స్వతంత్రంగా జీవనోపాధి ఏర్పాటు చేసుకుని పెద్ద, పెద్ద సంస్ధలతో సమన్వయం చేసుకుంటూ మార్కెటింగ్‌ ఎలా చేసుకోవాలో కూడా మీరు మాకు సహాయం చేస్తున్నారు.  మీతో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు, ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కరోనా కష్టకాలంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి గడపకూ వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా రూ.1000 పంపిణీ చేశారు. అవే మాకు పదివేలుగా ఆ రోజుల్లో ఉపయోగపడ్డాయి. ఇవే గాకుండా ఏ ఇంట్లో ఆకలితో ఉండకూడదని ఉచిత రేషన్‌  ప్రతి ఒక్కరికీ రెండు సార్లు ఇచ్చారు. వసతి దీవెన కింద మా బిడ్డలకు రూ.10 వేలు ఇచ్చారు. కరోనా కష్టకాలంలో మా వారు సెలూన్‌ షాపులో పనిచేసే అవకాశం లేదు, ఆ సమయంలో ‘జగనన్న చేదోడు పథకం’ కింద రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించారు. గ్రూపుల్లో సున్నావడ్డీ కింద లబ్ధిపొందాం. వైస్సార్‌ ఆసరా పథకం ద్వారా మా గ్రూపునకు వచ్చే నెల  1 లక్షా 77 వేలు 400 రూపాయలతో పొందబోతున్నాం. నాకు సొంతంగా రూ.17 వేలు రానున్నాయి.

అన్నా.. మాకు ఇళ్లు లేదు, చిన్న రేకుల షెడ్డు, వర్షమొస్తే తడిసిపోవడమే, ఎన్నోసార్లు ఇంటికి దరఖాస్తు పెట్టినా రాలేదు. ఇప్పుడు నా పేరు మీద ఇళ్లు వచ్చింది. చాలా ధన్యవాదాలు. గతంలో పింఛన్‌ కోసం లైన్లో నిలబడేవారు, ఇప్పుడు ఒకటో తేదీనే మా అత్తయ్య గారికి ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మా బాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద బీటెక్‌ చేశాడు, లేదంటే  చదివించగలిగే స్ధోమత నాకు లేదు. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా లబ్ధి పొందాం. ఇవన్నీ మన ప్రభుత్వంలో నేను లబ్ధి పొందినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. మరలా మరలా మీరే మాకు సీఎంగా రావాలని , మా జగనన్నే మా మహిళలందరికీ తోడూ, నీడగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నా’’అని హర్షం వ్యక్తం చేశారు.

ప్రతి నోటంటా ఒకటే మాట: విజయమ్మ
(అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా)
మీ లాంటి అన్నదమ్ములు ఉంటే మాకు ఏ లోటూ ఉండదు. అక్కాచెల్లెమ్మలు, రైతన్నలు, ముసలమ్మలు ప్రతి నోటంటా ఒకటే మాట జగనన్నా, జగనన్నా.. మీరు చేసే మంచి కార్యక్రమాలు వల్లే. మరలా మరలా మీరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరలా మిమ్మల్నే గెలిపించుకుంటాం. వైఎస్సార్‌ చేయూత పథకంలో నేను లబ్ధిదారును. చాలా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఎప్పటి నుంచో మేం వెనుకబడి ఉన్నాం. మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. రూ.18750 రూపాయలు మీరు మాకు ఇచ్చారు. నాలుగేళ్లకు రూ.75 వేలు ఇస్తున్నారు. నేను లోన్‌ తీసుకుని జెరాక్స్‌ మిషన్‌ తీసుకున్నాను. దాని మీద నెలకు రూ.3వేలు ఆదాయం వస్తుంది. 
పిండిమిల్లు పెట్టుకోవాలని చాలా కాలం నుంచి నా కోరిక, అయితే ఆర్ధిక స్ధోమత లేక అది అలాగే ఉండిపోయింది. 

ఇవాళ ఈ చేయూత పథకం ద్వారా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు ఎల్లవేలలా రుణపడి ఉంటానన్నా. పేదవాడికి ఒకటో తారీఖు వచ్చేసరికి జీతాలిస్తున్నట్లు పింఛన్‌ ఇంటికే ఇస్తున్నారు. అమ్మఒడి పథకం కింద వేసిన డబ్బులతో పిల్లలను చదివించుకుంటున్నాం. పేదవాళ్లకి ఇంగ్లిషు మీడియం పెట్టినందుకు మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం. కరోనా కాలంలో పనికి వెళ్లడానికి అవకాశం లేని పరిస్ధితుల్లో మీరు ఇచ్చిన వేయి రూపాయలు, ఉచిత రేషన్‌తో మా పిల్లలకు సంతృప్తిగా భోజనం పెట్టుకోగలిగాం. రేషన్‌ కార్డు కోసం, మరే అవసరాల కోసం ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్లం, ఇప్పుడు సచివాలయంతో ఊర్లోనే అన్నీ అందుతున్నాయి. ఇళ్ల పట్టాల్లో నా పేరు కూడా ఉంది. ధన్యవాదాలు.

మీరు సీఎం అయిన తర్వాతే ఇవన్నీ: లక్ష్మీ దేవి
(సిద్దరాంపురం, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం)
అక్కాచెల్లెమ్మలకు నేను ఉన్నాను, నేను చేయూతనిస్తాను అని మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. అంత మంది మహిళలు మనసుల్లో  అన్నగా నిల్చిపోయినందుకు మేమంతా మీకు కృతజ్ఞతగా ఉంటాం. మా కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి మా కష్టాలు తెలుసుకుని మా కళ్లల్లో కాంతి నింపిన ఘనత మీకే దక్కుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నాకు వితంతు ఫించన్‌ రూ.2250 వస్తోంది. విజయలక్ష్మీ మహిళా సంఘంలో నేను సున్నా వడ్డీ కింద రూ.3700 తీసుకున్నాను. వచ్చే నెల 11న వైఎస్సార్‌ ఆసరా కింది నేను రూ.39900 తీసుకోబొతున్నాను. 

మా కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి మా కష్టాలు తెలుసుకుని మా కళ్లల్లో కాంతి నింపిన ఘనత మీకే దక్కుతుంది అన్నా. మీరిచ్చిన డబ్బులతో పాటు లోన్‌ తీసుకుని  ఒక షెడ్డు వేసుకుని జెరాక్స్‌ మిషన్‌ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంత మంచి పథకాలను తీసుకొచ్చిన మీకు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం. నువ్వు ముఖ్యమంత్రి అయినాక పంటలు పుష్కలంగా పండుతున్నాయి.  మీ కన్నా దేవుడు మాకు లేడు సార్‌, మీకు వేలకోట్ల వందనాలు. 

తమ్ముడూ బాగున్నారా: రత్నం
(యూ.కొత్తపల్లి, తూర్పుగోదావరి)
తమ్ముడూ బాగున్నారా. మీరు బాగోవాలి, మీరు బాగుంటునే రాష్ట్రం బాగుంటుంది. నేను చేయూతకు ఎంపికయ్యాను. నా తమ్ముడు ఉన్నాడు అనే ధైర్యంతో బతకాలనుకుంటున్నా. ఇవాళ మీ అక్కలందరం,  మేం చరిత్రలో రాసుకుంటున్న రోజు. మా కోసం,  ముందు తరాలకు కూడా మీరే సీఎంగా ఉండాలి. మీరిచ్చిన చేయూతతో  డిటిపి సెంటర్‌, కిరాణ షాపు పెట్టుకుని సాధికారిత సాధిస్తాను. కచ్చితంగా నేను నిలబడతాను, ఆదర్శంగా ఉంటాను. మీరు 3వేల పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అక్కచెల్లమ్మలు చెప్పిన కష్టాలన్నీ మీరు మనసుతో విన్నారు. 

మాకు ఏం చేయాలి అని ఆలోచించి, కుటుంబ భారాన్ని మోస్తున్న మా కోసం ఈ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని విధాలుగా అడ్డంకులు ఎదురవుతున్నా మా సంక్షేమం కోసం పాటుపడుతున్న మీరు చేస్తున్న సాయాన్ని దుర్వినియోగం కానియ్యము. మీకు ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
 

Advertisement
Advertisement