అమ్మ ఒడి మూడో విడత: చదువు మీద పెట్టే ప్రతిపైసా గొప్ప పెట్టుబడి: సీఎం జగన్‌

CM YS Jagan Speech At Srikakulam Jagananna Amma Vodi - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: చదువుల మీద పెట్టే ప్రతిపైసా.. పవిత్రమైన పెట్టుబడి అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆర్థిక పరిస్థితులతో పిల్లలను చదివించలేని పరిస్థితి శాపం కాకూడదని కోరుకున్న ఆయన.. పిల్లలను బాగా చదివించినప్పుడే వాళ్ల జీవితాలు మారుతాయని చెప్పారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమ సభలో ప్రసంగించారు ఆయన. 

సభా ప్రాంగణం నుంచి సీఎం జగన్‌ మాట్లాడుతూ..  ‘‘చెరగని చిరునవ్వుతో అప్యాయత చూపిస్తు‍న్న అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల 43 లక్షల 96 వేల మందికి పైగా తల్లులకు, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. అక్షరాల 6, 595 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో నేరుగా జమ చేసే గొప్ప కార్యక్రమం ఇద’’ని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నయ్య వాళ్లకు తోడుగా ఉన్నానని తెలియజేసే ఈ కార్యక్రమం..  దేవుడి దయ వల్ల ముందుకు సాగుతోందని చెప్పారాయన. 

మనిషికి చదువే నిజమైన ఆస్తి అని పేర్కొన్న సీఎం జగన్‌.. చదువులు ఎక్కువగా ఉండే దేశాల్లో ఆదాయమూ ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతీ ఇంట్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీలో గత మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్‌.. మనిషి తలరాతను మార్చేసే శక్తి చదువుకు ఉందని తెలిపారు.

సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని చూశానని.. అందుకే అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని ఆయన చెప్పారు. పిల్లలను బడికి పంపిస్తే చాలూ.. ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం తమ ప్రభుత్వం అందిస్తుందని.. పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుందని, వాళ్ల భవిష్యత్తు బాగుండాలనే 75 శాతం హాజరు నిబంధన తీసుకొచ్చామని తెలిపారు. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే తన లక్ష్యమని మరోసారి ఉద్ఘాటించారు సీఎం జగన్‌. ఇంకా..

► ఒక్కో విద్యార్థికి రూ. 12వేలు విలువ చేసే ట్యాబ్‌ను.. సెప్టెంబర్‌లో అందజేస్తాం. ఇందుకోసం రూ.500 కోట్ల ఖర్చు చేయబోతున్నాం.

► ప్రతి క్లాస్‌ రూమ్‌లో డిజిటల్‌ బోర్డులు అందుబాటులోకి తెస్తున్నాం.

► కోడి రామ్మూర్తి స్టేడియం మరమ్మత్తుల కోసం పదికోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్‌.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top