గిరిజన సంక్షేమానికి పెద్దపీట

CM YS Jagan Speech On Distribution Of ROFR Rails - Sakshi

ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన  తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆన్‌లైన్‌ ద్వారా  సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామగ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.లక్షా 53వేల మంది గిరిజనులకు 3.12లక్షల ఎకరాల భూమి పంపిణీ , రైతు భరోసా సాయం అందిస్తున్నామని తెలిపారు. (చదవండి: గిరిజనుల దశాబ్దాల కల సాకారం..)

‘‘మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తా. భూ వివాదాలకు ఎక్కడా తావు లేకుండా డిజిటల్ సర్వే ద్వారా పంపిణీ చేశాం. గిరిజనులకు భూమితో పాటు రైతు భరోసా కింద సాయం అందిస్తాం. పట్టాలు పొందిన గిరిజనులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటాం.పంటలు పండించుకునేందుకు గిరిజనులకు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. గిరిజనులకు ఫారెస్ట్‌ అధికారులతో పాటు కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తారని’’ సీఎం పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన రాలేదని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా రాలేదన్నారు.

‘‘పాదయాత్రలో గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులను చూశా.గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలి.గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలి. నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాలకు, కురుపాంలో రూ.153 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టాం. సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, బుట్టాయిగూడెం, రంపచోడవరంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ పథకం కింద గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులను తీసుకొచ్చామని’ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

చప్పట్లతో అభినందించాలి..
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా  గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు.

సీఎం జగన్‌ ఏమన్నారంటే...
‘‘అక్టోబరు 2న గాంధీ జయంతి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నాను. మన గ్రామాల్లో మన ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయం కావాలన్నాకూడా వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా మనకు మంచి చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు స్థాపించి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గ్రామ స్వరాజ్యం మన అందరికీ కూడా కళ్ల ఎదుటే కనిపించే విధంగా వీళ్లందరూ కూడా మనకు సేవలు అందిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా మనకు సేవలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మనకు మంచి సేవలు అందిస్తున్న వీరందరినీ అభినందిస్తూ ఇళ్లనుంచి బయటకు వచ్చి చప్పట్టు కొట్టి అభినందించాలి.  గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, వాలంటీర్లను ప్రోత్సహించేలా, వారికి తోడుగా ఉండేలా నిలిచేందుకు వారిని చప్పట్లతో అభినందించాలని కోరుతున్నా. నేనుకూడా సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చి నా ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొడతాను. మన వంతు ఆదరణ వారికి చూపించాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top