మానవత్వం ఉన్న ఎవరైనా మద్దతు పలుకుతారు

CM YS Jagan Said Rachabanda Program Will Be Organized - Sakshi

స్కూళ్లల్లో నాడు-నేడు పనులు ఆగస్టు 31 నాటికి పూర్తి

పంటల సాగులో తగిన సలహాలకోసం టోల్‌ ఫ్రీ నంబర్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు తగ్గగానే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టా అందాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవుతున్నాయా లేదా అన్నదాని పై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టాక రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రజల సమస్యలు, పథకాలు అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటిస్తాను' అంటూ ఓ ట్వీట్‌ కూడా చేశారు.

కరోనా నియంత్రణ చర్యలు, తదితర అంశాలపై మంగళవారం రోజున కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మహిళల పేరుపై 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. మానవత్వం ఉన్నవారు ఎవరైనా ఇలాంటి కార్యక్రమానికి మద్దతు పలుకుతారు. పట్టాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలి. హౌసింగ్‌ లేఔట్స్‌లో ప్లాంటేషన్‌ చేపడుతున్నాం. అన్ని లేఔట్స్‌లో కచ్చితంగా చెట్లు నాటే కార్యక్రమాలు చేపట్టాలి. ఆర్డర్‌ చేసిన 72 గంటల్లో ఇసుక అందాలి. అవకాశం ఉన్న చోట ఇంకా ఇసుక తవ్వి నిల్వ చేయాలి. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపును వెంటనే పూర్తి చేయాలి. సెప్టెంబర్‌ 5న స్కూళ్లు ప్రారంభం అవుతున్నాయి. స్కూళ్లల్లో నాడు-నేడు పనులు ఆగస్టు 31 నాటికి పూర్తికావాలి.

కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలి. కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన సాగు ఒప్పందం అమలు చేయాలి. జిల్లాస్థాయి, మండలస్థాయి అగ్రికల్చర్‌ అడ్వైజరీ కమిటీలు పెట్టాం. ఏ పంటలు వేయాలి? మార్కెటింగ్‌ అవకాశాలు ఏంటి? తదితర అంశాలపై చర్చించాలి. పంటలకు వచ్చే వ్యాధులపట్ల, తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పంటల సాగులో వచ్చే కష్టనష్టాలపై తగిన సలహాలు ఇవ్వడానికి టోల్‌ ఫ్రీ నంబర్‌ 155251 ఏర్పాటు చేసి, 20 మంది సైంటిస్టులను కాల్‌ సెంటర్లలో పెట్టాము. రైతు భరోసా కేంద్రాల్లో ఎలాంటి సమస్య వచ్చినా 1902కు నివేదించవచ్చు అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. (‘రోగి ఆరోగ్యాన్ని బట్టి అరగంటలో బెడ్‌ కేటాయించాలి’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top