పవర్‌ ‘ఫుల్‌’

CM YS Jagan People and farmers will get more quality electricity - Sakshi

ఇంధనరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం 

రాష్ట్రంలో ప్రజలు, రైతులకు నాణ్యమైన విద్యుత్‌

పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలో సీఎం జగన్‌

కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన

ఏపీ ట్రాన్స్‌కోలో 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన.. 12 సబ్‌స్టేషన్లు ప్రారంభం

సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.6,500 కోట్లు 

హెచ్‌పీసీఎల్‌తో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై ఒప్పందం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ సామర్థ్యం పెరగడం ద్వారా ప్రజలకు, రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్‌ అందనుందని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. మంగళవారం రాష్ట్ర విద్యుత్‌ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఆయన వర్చువల్‌ విధానంలో 16 సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి శంకు­స్థాపన, 12 సబ్‌స్టేషన్లకు ప్రారంభో­త్సవం చేశారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, సత్య­సాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, కాకి­నాడ, అనకాపల్లి, విశాఖ, విజయ­నగరం, శ్రీకా­కుళం, అల్లూరి సీతారామ­రాజు, పల్నాడు, ఎస్పీ­ఎస్‌­ఆర్‌ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధి­లోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/­220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్‌స్టేషన్లు­ఏర్పాటవు­తున్నాయి.

వీటితో పాటు కడపలో 750 మెగా­వాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో హెచ్‌పీసీఎల్‌తో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌పీసీఎల్‌) ఎండీ అండ్‌ సీఈఓ ఎం.కమలాకర్‌ బాబు, హెచ్‌పీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శువేందు గుప్తా ఒప్పంద పత్రాలను అందుకున్నారు. వీటన్నింటి వల్ల రానున్న రోజుల్లో వేగంగా అడుగులు ముందుకు పడి మరిన్ని ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ సామర్థ్యం మెరుగు పడుతుందని సీఎం అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..

సరికొత్త అడుగులు.. నాణ్యమైన వెలుగులు
► 19 జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుతూ రూ.620 కోట్లతో 12 సబ్‌స్టేషన్లను ప్రారంభిస్తున్నాం. రూ.2,479 కోట్లతో మరో 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నాం. మొత్తంగా సుమారు రూ.3,099 కోట్ల పెట్టుబడులతో మంచి కార్యక్రమం జరుగుతోంది. కొత్తగా వస్తున్న ఈ 28 సబ్‌ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. మరోవైపు రూ.3,400 కోట్లతో దాదాపు 850 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నాం. వీటి వల్ల 1,700 ఉద్యోగాలు వస్తున్నాయి. వీటిన్నింటి కోసం దాదాపు రూ.6,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం.

►ఇటీవల గోదావరి ముంపునకు గురైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక తదితర విలీన మండలాల్లో తిరిగినప్పుడు సబ్‌స్టేషన్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి ప్రజలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ వాటి నిర్మాణాలు ప్రారంభిస్తూ, నిర్మించిన వాటిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. 

► ట్రాన్స్‌మిషన్‌ కెపాసిటీని విస్తరించుకుంటూ ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చే పరిస్థితిని, వ్యవస్థను క్రియేట్‌ చేస్తున్నాం. రైతులకు 9 గంటల పాటు పగటిపూటే ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టాం. ఇది చేయాలంటే కెపాసిటీ సరిపోదని, ట్రాన్స్‌మిషన్‌ కెపాసిటీ అభివృద్ధి చేయాలని అధికారులు చెప్పారు. అందుకోసం రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూటే ఇస్తున్నాం. 

25 ఏళ్లపాటు ఢోకా ఉండదు
► రైతులకు ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి యూనిట్‌ రూ.2.49తో సోలార్‌ పవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప అడుగు పడింది. దాదాపు 17 వేల మిలియన్‌ యూనిట్లకు సెకీతో ఒప్పందం చేసుకున్నాం. వ్యవసాయ విద్యుత్‌కు కావాల్సిన 13 వేల మిలియన్‌ యూనిట్లు పగటిపూటే, మరో 25 ఏళ్లపాటు ఉండేలా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం యూనిట్‌ సగటు ధర రూ.5.30 పడే పరిస్థితులుంటే రూ.2.49కే యూనిట్‌ ధర వచ్చే పరిస్థితుల్లోకి అడుగులు వేస్తున్నాం. దీనివల్ల 2024 సెప్టెంబర్‌కు 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్‌ నాటికి మరో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్‌ నాటికి మరో 1000 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది. 

► అవేరా స్కూటర్స్‌ తయారీ సంస్థ ఇప్పటికే 25 వేల స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించి విజయవాడలో నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. దీనికి సంబంధించి రూ.100 కోట్లతో విస్తరణ ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఈ కంపెనీలో 100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయి. తాజా పెట్టుబడి వల్ల అదనంగా మరో 200 ఉద్యోగాలు వస్తాయి.

► 500 మెగావాట్లు సోలార్‌ ప్లాంట్, మరో 500 మెగావాట్ల పవన విద్యుత్, 250 మెగావాట్ల పీఎస్‌పీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ (100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌)తో కలిపి రూ.10 వేల కోట్లకు సంబంధించి హెచ్‌పీసీఎల్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. దీనివల్ల దాదాపు మరో 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుల వల్ల కాలుష్య రహిత క్లీన్‌ ఎనర్జీ అందుబాటులోకి వచ్చి, రాష్ట్ర ప్రగతిని మరింత పెంచే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను.  

► ఈ కార్యక్రమంలో సీఎస్‌ డాక్టర్‌ కెఎస్‌జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ జేఎండీ బి.మల్లారెడ్డి, హెచ్‌పీసీఎల్‌ డైరెక్టర్‌ అమిత్‌ గార్గ్, హెచ్‌పీసీఎల్, ఆయానా, స్ప్రింగ్‌ అగ్నిత్రా, సోలార్‌ ఎనర్జీ ఏపీ సిక్స్‌ ప్రై వేట్‌ లిమిటెడ్, అవేరా ఏఐ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు 
గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర విద్యుత్‌ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాం. అక్టోబర్‌ ఆఖరు వరకు 39.64 లక్షల మంది లబ్ధిదారులకు (అగ్రికల్చర్, ఆక్వా, పశు సంవర్థక, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతరులు) రూ.46,581 కోట్ల సబ్సిడీ అందించాం. జగనన్న హౌసింగ్‌ కాలనీలకు ఐదు లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు ఈ ఏడాది అదనంగా నిర్ణీత కాలపరిమితిలో మంజూరు చేశాం.

వ్యవసాయ విద్యుత్‌ కోసం ‘సెకీ’తో తక్కువ ధరకే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం.   స్మార్ట్‌ మీటర్స్‌ వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుంది. విశాఖ పెట్టుబడుల సదస్సులో జరిగిన ఒప్పందాల ప్రకారం రూ.52,015 కోట్లు గ్రౌండ్‌ అయ్యాయి. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. 12,586 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. సీఎం చిత్తశుద్ధితోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. 
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ మంత్రి   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top