గోమాతకు వందనం | CM YS Jagan Mohan Reddy Participated In Gopuja At Narasaraopeta | Sakshi
Sakshi News home page

గోమాతకు వందనం

Jan 16 2021 3:15 AM | Updated on Jan 16 2021 12:15 PM

CM YS Jagan Mohan Reddy Participated In Gopuja At Narasaraopeta - Sakshi

శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో గోమాతకు పసుపు కుంకుమలతో పూజ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి, నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా గత 40–50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా శుక్రవారం కామధేను పూజ (గోపూజ) కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, ఘనంగా కొనసాగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ),  దేవదాయ శాఖల ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తూ పలు ఆలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో ఉదయం 11.50 గంటలకు జరిగిన గోపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంప్రదాయ పంచెకట్టు, కండువాతో పాల్గొన్నారు. స్వయంగా గోవుకు పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించారు.  గోత్రనామంతో సంకల్పం చేసుకున్న అనంతరం టీటీడీ పండితుల మంత్రోచ్ఛారణ మధ్య గోమాతకు, దూడకు పట్టువ్రస్తాలు, పూలమాలలు సమర్పించారు. గోమాత, దూడకు ప్రదక్షిణ చేసి హారతి ఇచ్చి నమస్కరించుకున్నారు. పచ్చిమేత, అరటి పళ్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో 108 గోవులకు గోపూజ నిర్వహించారు. 20 నిమిషాల పాటు సాగిన పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట తదితర నియోజవర్గాల నుంచి వేలాది మంది వచ్చారు. 
గోమాతకు పూలదండ వేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

గోమాత గొప్పదనం  తెలిసేలా.. 
► తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉండే 50 ఆలయాలతో సహా మొత్తం 2,262 ఆలయాల్లో  శుక్రవారం గోపూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా  ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. గోమాత గొప్పదనం తెలిసేలా ఆయా ఆలయాల్లో పోస్టర్లను ప్రదర్శించారు.  
► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన గోపూజ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో ఉదయం, సాయంత్రం మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, చెల్లుబోయిన వేణు వేర్వేరుగా పూజల్లో పాల్గొన్నారు.  
► అరసవెల్లి ఆలయంలో విద్యార్థులకు గోమాత ప్రాముఖ్యతపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు.  

అందరికీ మంచి జరగాలి 
► గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పూజా కార్యక్రమం అనంతరం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి కాసేపు మాట్లాడారు. ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ.. ఈ సందర్భంగా రాష్ట్రంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.  
► సీఎం రాక సందర్భంగా నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంను సంక్రాంతి శోభ ఉట్టిపడేలా రంగవల్లులు, అలంకరణలతో తీర్చిదిద్దారు. బొమ్మల కొలువులు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, హరిదాసుల కీర్తనలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను, గోమాతలు, నందీశ్వరులు (ఎద్దు) అలంకరణలను సీఎం తిలకించారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన పిండి వంటలను రుచి చూశారు.
► టీటీడీ అర్చకులు, ఇస్కాన్‌ ప్రతినిధులు శేష వస్త్రంతో.. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గజమాలతో సీఎంను     సత్కరించారు.  
► ఈ కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, శాసనమండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు, తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement