భేటీ ఫలప్రదం

CM YS Jagan meeting with PM Modi Over Pending State Issues - Sakshi

సుహృద్భావ వాతావరణంలో ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం

రాజకీయ, న్యాయ, ఆర్థిక అంశాలపై చర్చ

45 నిమిషాల భేటీలో అన్ని విషయాలను కూలంకషంగా వివరించిన ముఖ్యమంత్రి

విభజన హామీలు, బకాయిలు, నిధులు, ఇతరత్రా విషయాల ప్రస్తావన

అన్ని అంశాలపై ప్రధాని సానుకూలత.. అన్ని విధాలా సహకరిస్తామని హామీ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ఫలప్రదమైంది. ఉదయం 10.40 నుంచి 11.25 గంటల వరకు రాజకీయ, న్యాయ, ఆర్థిక అంశాలపై వీరి మధ్య జరిగిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో ముగిశాయి. రాష్ట్రంలో పరిస్థితులు, విభజన హామీలు, బకాయిలు, నిధులు, తదితర అన్ని అంశాలపై వైఎస్‌ జగన్‌ ప్రస్తావనలకు ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. పూర్తి సానుకూల వాతావరణంలో ఈ సమావేశం జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. 

► మంగళవారం ఉదయం ప్రధాన మంత్రి మోదీతో ఆయన అధికారిక నివాసం 7, లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొంత కాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ప్రధానికి వివరించినట్లు సమాచారం. వివిధ చట్టాలను రూపొందించేందుకు అసెంబ్లీలో బిల్లుల ఆమోదం, అనంతర పరిణామాల గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. 

► రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ అమరావతిలో శాసన రాజధానిని కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడానికి ఎదురవుతున్న అడ్డంకుల గురించి వివరించినట్లు సమాచారం. 

► ప్రధానంగా అత్యధికంగా పేద ప్రజలకు లబ్ధి కలిగే అంశాలపై కూడా కొందరు కోర్టులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తూ అడ్డుకోజూడటం, ఏకంగా దర్యాప్తులు కూడా సాగకుండా కుట్రలకు తెరదీయడం గురించి కూడా వివరించినట్లు తెలిసింది. 

► వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పెండింగ్‌ అంశాలను మరోసారి ప్రధాన మంత్రికి వివరించారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు సహా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌ అంశాలపై చర్చించారు.

► విభజన హామీలు సంపూర్ణంగా నెరవేర్చాలని, పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించాలని సీఎం కోరారు. విభజన అనంతరం తొలి ఆర్థిక సంవత్సరపు రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు బకాయిలను విడుదల చేయాలన్నారు. అన్ని విషయాలను ఓపికగా విన్న ప్రధాని.. అన్ని విధాలా సహకరిస్తామని వైఎస్‌ జగన్‌కు హామీ ఇచ్చినట్లు తెలిసింది. 

► ప్రధానితో సమావేశం అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ తన అధికారిక నివాసమైన 1, జన్‌పథ్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. అంతకు ముందు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లికార్జున రావు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఖురానా మర్యాద పూర్వకంగా కలిశారు.  మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి విజయవాడకు బయలుదేరారు. సీఎం వెంట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఉన్నారు. (చదవండి: వాటా నీటినే వాడుకుంటాం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top