ఎగుమతుల వృద్ధే లక్ష్యంగా ‘వాణిజ్య ఉత్సవ్‌’  | CM YS Jagan To Launch Huge trade conference Vijayawada 21 and 22 | Sakshi
Sakshi News home page

ఎగుమతుల వృద్ధే లక్ష్యంగా ‘వాణిజ్య ఉత్సవ్‌’ 

Published Fri, Sep 17 2021 2:18 AM | Last Updated on Sun, Oct 17 2021 1:48 PM

CM YS Jagan To Launch Huge trade conference Vijayawada 21 and 22 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర వాణిజ్యశాఖతో కలిసి రాష్ట్రంలో ‘వాణిజ్య ఉత్సవ్‌–2021’ పేరిట ఈనెల 21, 22 తేదీల్లో విజయవాడలో భారీ వాణిజ్య సదస్సు నిర్వహించనున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వాణిజ్య ఉత్సవ్‌–2021 కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించే ఈ సదస్సులో విదేశీ రాయబారులతోపాటు 100 మందికిపైగా ఎగుమతిదారులు పాల్గొంటారని చెప్పారు.

ప్రస్తుతం మన రాష్ట్రం దేశ ఎగుమతుల్లో 5.8 శాతం వాటాను కలిగి ఉందని, దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆరు అంచెల విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పోర్టులు, లాజిస్టిక్, ఫుడ్‌ ప్రాసెసింగ్, నైపుణ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించడం ద్వారా రాష్ట్ర ఎగుమతుల విలువను రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాకు ఒక ఉత్పత్తిని గుర్తించి వాటి ఎగుమతులు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్లాస్టిక్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సు తొలుత రాష్ట్రస్థాయిలో విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతుందని, 24 నుంచి 26  వరకు జిల్లాల వారీగా కలెక్టర్‌ నేతృత్వంలో సదస్సులు జరుగుతాయని చెప్పారు. 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి 
వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండటంతో వీరికి అధికాదాయం అందించే విధంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్తు తెలిపారు. వాణిజ్య ఉత్సవ్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎగుమతుల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో మొత్తం రూ.2,900 కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం మంత్రి మేకపాటి వాణిజ్య ఉత్సవ్‌ లోగోను ఆవిష్కరించగా మంత్రి కన్నబాబు ఈవెంట్‌కి సంబంధించిన ఫ్లయర్‌ను విడుదల చేశారు. వాణిజ్య ఉత్సవంలో పాల్గొనేవారు నమోదు చేసుకోవడానికి సంబంధించిన ప్రత్యేక వెబ్‌ పేజీని మంత్రులు ప్రారంభించారు. వాణిజ్య ఉత్సవ్‌లో పాల్గొనేవారు https:// apindustries. gov.in/ vanijyautsavam/ అనే వెబ్‌లింక్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ సమావేశంలో ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, ఎంఎస్‌ఎంఈ చైర్మన్‌ వంకా రవీంద్రనాథ్, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం జవ్వాది తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement