సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను ప్రారంభించిన సీఎం జగన్‌

CM YS Jagan Inaugurated City Scan And MRI Machines Of RIMS Hospitals - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను ప్రారంభించారు. నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రుల్లో సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రులను మరింత  బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులను ఆందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..:

బోధన ఆస్పత్రులు–డయాగ్నస్టిక్‌ సేవలు
‘ఈరోజు రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులలో కేవలం ఏడింటిలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలు ఉన్నాయి. అవి కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయి. వాటిలో టెక్నాలజీ, క్వాలిటీ అప్‌గ్రెడేషన్‌ కూడా లేదు. ఈ పరిస్థితి మారాలని పలు చర్యలు తీసుకుంటున్నాము. కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే ఉన్న 11 టీచింగ్‌ ఆస్పత్రులను నాడు–నేడు కింద అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు, కొత్తగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా టీచింగ్‌ ఆస్పత్రితో పాటు, నర్సింగ్‌ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాటిలో టాప్‌ ఆఫ్‌ ది లైన్‌ డయాగ్నస్టిక్‌ సర్వీసులు అందించే దృక్పథంతో అడుగులు వేస్తున్నాము’.

ఆరోగ్యశ్రీ కింద సేవలు
‘టీచింగ్‌ ఆస్పత్రులలో ఆ సదుపాయాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, పథకం లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాము. ఆ విధంగా డయాగ్నస్టిక్‌ సేవలు అందిస్తాము. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు వాటి నిర్వహణ వ్యయం భరిస్తుంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో అప్‌గ్రేడ్‌తో ఆ పరికరాలు, నిరంతరం బాగా పని చేసేలా చర్యలు చేపడుతున్నాము’.

జాతీయస్థాయి ప్రమాణాలతో..
‘నాడు–నేడులో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాము. ఆస్పత్రులను జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాము. ఇప్పుడు రూ.67 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో సీటీ స్కాన్‌లు, కడప మినహా మూడు చోట్ల ఎంఆర్‌ఐ పరికరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి మూడేళ్ల వారంటీ ఉంది. మరో ఏడేళ్లు సర్వీసు బాధ్యతను ఆ కంపెనీలు నిర్వహిస్తాయి. ఏ పేదవాడికైనా ఉచితంగా సేవలందించేలా, ప్రభుత్వ టీచింగ్‌ ఆస్పత్రులలో అన్ని సదుపాయాల ఏర్పాటు చేస్తాం’.

మిగిలిన ఏడింటిలో కూడా
‘రాష్ట్రంలోని 11 టీచింగ్‌ ఆస్పత్రులలో నాలుగు చోట్ల సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలు లేవు కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో ఏర్పాటు చేస్తున్నాము. మిగిలిన ఏడు చోట్ల ఆ సదుపాయాలు పిపిపి విధానంలో ఉన్నాయి. కాబట్టివాటిని ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేస్తుంది. ఇంకా కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్‌ ఆస్పత్రులలో కూడా ఈ సదుపాయాలన్నీ కల్పిస్తాము’.

వారి సేవలకు వందనం
‘ఈ కోవిడ్‌ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బందితో పాటు, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు. వలంటీర్లు పగలు రాత్రి కష్టపడుతున్నారు. ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువే. కోవిడ్‌ సమయంలో ఎంతో మంచి సేవలందిస్తున్న మీ అందరికీ మా అభినందనలు’.

ఆగ్రహం వద్దు
‘ఈ సందర్భంగా కలెక్టర్లు, జేసీలు, డీహెచ్‌ఎంఓలకు కొన్ని సూచనలు. ఫీవర్‌ సర్వే కొన్ని చోట్ల అనుకున్న విధంగా జరగలేదని కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని నా దృష్టికి వచ్చింది. కరోనా మహమ్మారితో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నారని అందరూ గుర్తుంచుకోవాలి. అందుకే అధికారులంతా మంచితనంతో తమ సిబ్బందితో పని చేయించుకోవాలని కోరుతున్నాను’.

నా విజ్ఞప్తి
‘మీ అందరికీ నా తరపున ఒక విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిళ్లలో పని చేస్తున్నారు. కాబట్టి కింది వారికి నచ్చ చెప్పి పని చేయించుకోండి. ఆగ్రహిస్తే వచ్చేదేమీ లేదు. ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, వార్డుబాయ్స్, చివరకు శానిటేషన్‌ సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారు. నా దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుడి వరకు కోవిడ్‌ వల్ల ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను ఎదుర్కునే ఒత్తిడిలో ఉన్నారు’.

అందుకే సాధ్యమైంది
‘ప్రతి రోజూ 20 వేల కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. నిజానికి అందరూ చాలా బాగా పని చేస్తున్నారు. అందుకే మన దగ్గర టయర్‌–1 సిటీ, ఆ స్థాయిలో ఆస్పత్రులు లేకపోయినా, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. మీరంతా ఆస్పత్రుల్లో బా«ధ్యతను తీసుకోవడమే కాకుండా, ఎంత ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో పని చేస్తున్నారు కాబట్టే ఇది సా«ధ్యమైంది. అదే విధంగా కోవిడ్‌ను కూడా ఎదుర్కోగలుగుతున్నాము. కాబట్టి ఎవ్వరూ సహనం కోల్పోవద్దు. అధికారులు మంచితనంతో పని చేయించుకోవాలని కోరుతున్నాను’డ అని విజ్ఞప్తి చేసిన సీఎం జగన్ ఈ మంచి కార్యక్రమంతో ప్రజలకు ఇంకా మేలు జరగాలని మనసారా కోరుకుంటున్నానంటూ ప్రసంగం ముగించారు.

సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చదవండి: 100కు పైగా ఆక్వా హబ్‌లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top