మార్కాపురంలో సీఎం జగన్‌.. సాయం కోరగానే సత్వర స్పందన

CM YS Jagan Expressed Humanity At Markapuram - Sakshi

సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆపదలో సాయం అడిగిన వారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించారు. సీఎం జగన్‌ బుధవారం మార్కాపురంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమం  అనంతరం, తమకు సాయం అందించాలని  కొందరు బాధితులు సీఎం జగన్‌ను కలిశారు. దీంతో, గొప్ప మనస్సుతో వారికి సాయం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

అధైర్యపడవద్దు.. అండగా ఉంటా..
తూర్పుగోదావరి జిల్లా మిరియంపల్లి శ్రీనివాసులు(49) వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కాలేజీలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు బిడ్డలు. కుమార్తె చంద్రగౌరి(24) అంగవైక్యలంతో జన్మించింది. చిన్నప్పటి నుంచి మాటలు కూడా రావు. కుమారుడు కూడా అంగవైకల్యంతో జన్మించాడు. తన కుటుంబ పరిస్థితి దృష్టిలో ఉంచుకుని తన బిడ్డలకు తగిన వైద్య సాయం అందించాలని సీఎం జగన్‌ను కోరారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించమని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌.. కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం సహకారం అందిస్తామని సీఎం హమీ ఇచ్చారు. 

ఆపరేషన్‌ చేపిస్తా.. ఉద్యోగం ఇప్పిస్తా..
నాగిరెడ్డిపల్లికి చెందిన వి. మార్తమ్మకు ఇద్దరు కుమారులు. భర్త చనిపోయాడు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. పెద్ద కుమారుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఒక కిడ్నీ పాడైపోయింది. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ముఖ్యమంత్రి.. బాధితులకు భరోసా ఇచ్చారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం జగన్‌. ప్రభుత్వం తరఫున పూర్తి వైద్య సాయం అందిస్తామని, అర్హతను బట్టి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 

 

న్యాయం చేస్తాం
సాంకేతిక సమస్యల వల్ల తనకు వస్తున్న సంక్షేమ పథకాలు, పెన్షన్‌ నిలిచిపోయాయని ఓ వృద్ధుడు ఇచ్చిన అర్జీపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించి.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

బొప్పరాజు నరసయ్య(60) అనే వ్యక్తి ప్రత్యేక అర్జీకి సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. తర్లుపాడు మండలం గోరుగుంతలపాడు గ్రామానికి చెందిన తనకు వికలాంగుల పెన్షన్‌ వస్తున్నట్లు చెప్పాడు. అయితే.. కిందటి ఏడాది ఆగష్టు నుంచి పెన్షన్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవీ అందడం లేదని మార్కాపురం పర్యటన ముగించుకుని వెళ్తున్న సీఎం జగన్‌ దృష్టికి తన సమస్యను తీసుకెళ్లారు. 

సచివాలయానికి వెళ్లి అధికారులను అడిగితే.. హౌజ్‌హోల్డింగ్‌ మ్యాపింగ్‌లో తన కోడలు సచివాలయ ఉద్యోగిగా పని చేస్తోందని, రూ.12 వేల కన్నా ఎక్కువ వేతనం ఆమెకు వస్తుండడమే అందుకు కారణమని అధికారులు చెప్పారని సీఎం జగన్‌కు నరసయ్య వివరించాడు. 

గతంలో తాను, తన భార్య, కొడుకు-కోడలు ఒకే మ్యాపింగ్‌లో ఉన్నప్పటికీ.. రెండు నెలల కిందటి నుంచి రెండు కుటుంబాలుగా ఏపీ సేవా పోర్టల్‌లో స్ప్లిట్‌ చేయించుకున్నామని, సచివాలయంలో ఇందుకు సంబంధించి సర్టిఫికెట్‌ తీసుకున్నామని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారాయన. కానీ, పైస్థాయి నుంచి అనుమతి రానందున.. ఆన్‌లైన్‌లో డేటా మార్చడం కుదరదని సిబ్బంది చెప్పినట్లు సీఎం జగన్‌కు వివరించారు. తమకు సహాయం చేయాలని నరసయ్య కోరగా.. న్యాయం చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 

బిడ్డను కోల్పోయా.. సహాయం చేయండి
కుటుంబానికి అండగా ఉంటున్న కుమారుడిని కోల్పోయిన తమకు ప్రభుత్వం అండగా ఉండి.. ఆర్థిక సహాయం చేయాలని అర్థవీడు మండలం యాచవరం గ్రామానికి చెందిన బి.సాల్మన్‌, సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ప్రత్యేక వినతిపత్రం ఇచ్చారు. చేతికి ఎదిగి వచ్చిన కొడుకు రమేష్‌(24) ప్రమాదంలో చనిపోవడంతో తన కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి సహాయం అందించాలని సాల్మన్‌, సీఎం జగన్‌ను కోరగా.. సంబంధిత వివరాలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top