రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్‌

CM YS Jagan Comments YSR Rythu Bharosa 2nd Instalment Release - Sakshi

సాక్షి, అమరావతి: అక్టోబరులో జరిగిన పంట నష్టంపై అంచనాలు తయారవుతున్నాయని, ఇందుకు సంబంధించి నవంబర్‌లోపే రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేసేందుకు శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం.. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరులో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే.. రబీలోగా పరిహారం ఇవ్వగలిగితే.. రైతుకు మేలు కలుగుతుందనే ఆలోచనతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత చెల్లింపుల కార్యక్రమాన్ని సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, హోం మంత్రి మేకతోటి సుచరిత, వేణుగోపాల కృష్ణ, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(చదవండి: రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్‌ రైతు భరోసా సాయం) 

గతానికి ఇప్పటికీ తేడా చూడండి...
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘2014లో పంట నష్టం జరిగితే 2017 జనవరి వరకూ ఇవ్వలేదు. 2015లో ఖరీఫ్‌లో నష్టం జరిగితే 2016 నవంబరులో ఇచ్చారు. 2016 ఖరీఫ్‌ లో నష్టం జరిగితే 2017 జూన్‌లో ఇచ్చారు. 2017 రబీలో నష్టం జరిగితే.. 2018 ఆగస్టులో ఇచ్చారు. 2018 ఖరీఫ్‌లో నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పుడు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్‌లో పంట నష్టపరిహారం చెల్లించామని మీ బిడ్డగా, గర్వంగా చెప్తున్నా. రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు’’ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తీరుకు ఇప్పటికి తేడా గమనించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులకు తోడుగా నిలబడుతూ.. ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిసి, ఈ విషయంపై దృష్టి మరల్చే విధంగా, టీడీపీ నేతలు ట్రాక్టర్లు పట్టుకుని, తామేదో ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుంటే ప్రతిపక్షం ఓర్వలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

 • విత్తనం వేసే దగ్గర నుంచి పంట అమ్మే వరకూ రైతు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో 10,641 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది.
 • వైఎస్సార్‌ జలకళ కార్యక్రమం ద్వారా బోర్లు ఉచితంగా వేయించడమే కాకుండా మోటార్లు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం.
 • గత ప్రభుత్వం రైతన్నలకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్‌కు సంబంధించిన దాదాపు రూ.8,655 కోట్లు 14 నెలల బకాయిలు పెడితే.. రైతన్నల కోసం చిరునవ్వుతో చెల్లించాం.
 • ధాన్యం సేకరణ కింద రూ. 960 కోట్లు మహానుభావుడు చంద్రబాబుగారు బకాయిపెడితే.. వాటినికూడా చెల్లించాం.
 • విత్తనాల సబ్సిడీకింద దాదాపు రూ.384 కోట్లు బకాయి పెడితే వాటిని కూడా రైతుల కోసం కట్టాం
 •  రైతులకు వడ్డీలేని రుణాల కింద 2014 నుంచి గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన రూ. 1046 కోట్లు కూడా రైతుల మీద ప్రేమతో ఇచ్చాం.
 • 9 గంటలపాటు రైతులకు ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి రూ.1700 కోట్లు వెచ్చించి ఫీడర్ల కెపాసిటీ పనులు 90శాతం పూర్తిచేశాం.
 • మిగిలిన వాటిలో కూడా పనులు త్వరలో పూర్తి.
 • వైఎస్సార్‌ సున్నావడ్డీకింద రూ.1లక్ష వరకూ రుణం తీసుకున్నవారికి ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోంది.
 • అలాగే పంట బీమాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. కేవలం రైతు రూ.1 మాత్రమే చెల్లిస్తే చాలు. రూ. 1030 కోట్ల రూపాయలను ప్రభుత్వమే ప్రీమియం కింద చెల్లిస్తోంది.
 • 13 జిల్లాస్థాయి అగ్రి ల్యాబులతోపాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 147 ఇంటిగ్రేటెడ్‌ ల్యాబులు ఏర్పాటుచేసి ముందుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షిస్తున్నాం.
 • కోవిడ్‌ సమయంలో పంటలను కొనుగోలు చేశాం. దాదాపు రూ.3వేల కోట్ల రూపాయలను పంటలకొనుగోలు కోసం ఖర్చు చేశాం.
 • అధిక వర్షాలు కారణంగా ఈ ఏడాది పంట నష్టం జరగడం కాస్త బాధ కలిగినప్పటికీ, మంచి వర్షాలు పడ్డాయి. డ్యాంలు, చెరువులు బాగా నిండాయి. రబీలో గొప్పగా పంటలు పండాలని ఆశిస్తున్నాం.
   
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top