Jagananna Pacha Thoranam: యజ్ఞంలా చెట్ల పెంపకం

CM YS Jagan Comments In Jagananna Paccha Thoranam Vana Mahotsavam - Sakshi

జగనన్న పచ్చతోరణం–వనమహోత్సవ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ 

అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచేందుకు కృషి చేద్దాం

చెట్లు బాగా ఉంటేనే మంచి వర్షాలు.. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ 

5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి

ఎయిమ్స్‌ ఆవరణలో వేప, రావి మొక్కలు నాటిన ముఖ్యమంత్రి

చెట్ల ఆవశ్యకత, పరిరక్షణ కోసం అందరితో ప్రతిజ్ఞ  

అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తే మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మొక్కలు నాటి.. అవి వృక్షాలుగా ఎదిగే వరకు తోడుగా నిలుద్దాం. తద్వారా మనకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయనే విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకుని, విరివిగా మొక్కలు నాటుదాం.. చెట్లను సంరక్షించుకుందాం.  – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా సాగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం 23 శాతం మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా అందరం కలిసి ప్రయత్నం చేయాలన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ ఆవరణలో ‘జగనన్న పచ్చతోరణం – వన మహోత్సవం’ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ వేప, రావి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో రాష్ట్రంలో అడవులు, అటవీ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. చెట్ల పెంపకానికి సంబంధించి రెండు, మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే అవి ఎంత అవసరమో నిరంతరం తెలుస్తుందన్నారు.

మనం పీల్చే గాలి ఆక్సిజన్‌ అని, ప్రపంచంలో ఏ జీవి అయినా ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్‌ డయాక్సైడ్‌ను వదిలేస్తుందని, ఒక్క చెట్టు మాత్రమే పగటి పూట కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసుకుని ఆక్సిజన్‌ను వదులుతుందని చెప్పారు. ఒక చెట్టు ఉంటే స్వచ్ఛమైన ఆక్సిజన్‌ లెవెల్స్‌ మెరుగ్గా ఉంటాయనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశమని తెలిపారు. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుందన్నారు. మనం పదో తరగతి చదువుల్లో, పరీక్షలు రాసేటప్పుడు ఆస్మోసిస్‌ అని, ట్రాన్‌స్పిరేషన్, గటేషన్‌ అని రకరకాల సిద్ధాంతాలు చదివి ఉంటామని గుర్తు చేశారు. చెట్ల వల్ల వర్షం ఎలా ప్రభావితం అవుతుంది, ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఎందుకుంటాయనే విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలన్నారు. వాటి వల్ల మనకు జరిగే మంచిని జ్ఞాపకం పెట్టుకుంటే, చెట్లను పెంచాల్సిన అవసరం ఎప్పుడూ కనిపిస్తుందని పేర్కొన్నారు. దాదాపు 5 కోట్ల మొక్కలను నాటడానికి అటవీ శాఖను పురమాయిస్తూ ఆ పనికి పూనుకోవాలని అందరినీ కోరుతున్నానని చెప్పారు. ఇందుకోసం అందరూ ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని, ఇక్కడున్న వారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత తమ మనసులో ప్రతిజ్ఞ చేయాలని కోరారు. 
అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి బాలినేని 

అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానమే లక్ష్యం 
ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అటవీ విస్తీర్ణంలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని, దాన్ని మొదటి స్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నాడు–నేడు కార్యక్రమంలో, జగనన్న కాలనీల్లో, ఇతరత్రా 5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కోట్లు అప్పులు చేసినా, ఎల్లో మీడియాకు కనిపించలేదని, కానీ సీఎం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక తప్పుడు రాతలు రాస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కే), అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్, అటవీ దళాల అధిపతి ఎన్‌ ప్రతీప్‌కుమార్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  

రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దుదాం.. 
‘ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగ పరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ.. వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా, వాడ వాడా, ఇంటా.. బయటా, అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అని అందరితో సీఎం ప్రతిజ్ఞ చేయించారు. మనసా, వాచా, కర్మణా అందరం దీనికి కట్టుబడి ఉంటూ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top