మంచి పాలనకు మళ్లీ ‘సిద్ధం’ 

CM YS Jagan Comments On Chandrababu in Raptadu Siddham Sabha - Sakshi

రాప్తాడు సభలో సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపు 

సంక్షేమంతో కోట్లాది గుండెల తలుపు తట్టాం 

మన పథకాల గురించి ఒక్కొక్కరూ వంద మందికి చెప్పాలి.. ఇవి కీలక ఎన్నికలు.. అత్యంత అప్రమత్తంగా ఉండాలి 

పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే 

చంద్రముఖి సైకిల్‌పై ఇంటికొస్తుంది 

బాబుకు ఓటేయడమంటే సామాజిక న్యాయం, డీబీటీని వద్దనుకోవటమే 

ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మోసం చేయడానికి అప్పుడప్పుడు ఏపీకి వస్తుంటారు 

చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా?.. జగన్‌కు ప్రజాబలం లేకుంటే పొత్తుల కోసం వెంపర్లాట ఎందుకు బాబూ? 

ఈ ఎన్నికలు విశ్వసనీయత, వంచనకు మధ్య జరుగుతున్నాయి.. 57 నెలల పాలనలో 99 శాతం హామీలను అమలు చేశాం

ఒక్కసారి అధికారం ఇస్తే మీ జగనన్న ఇంత చేశాడు 

రెండోసారి మూడోసారి నాలుగోసారి ఇస్తే ఇంకెంత చేస్తాడో ఆలోచించాలి  

ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. 

సైకిల్‌ ఎప్పుడూ బయటే ఉండాలి. 

తాగేసిన టీ గ్లాసు ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి.  

జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకూ మీ జగన్‌ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పెత్తందార్లకు – పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్‌లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్లీ గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్‌పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: విశ్వసనీయతకు–వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్‌ కోసం వారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపు­ని­చ్చారు. ఈ యుద్ధం.. వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్‌ రెసిడెంట్స్‌ ఆంధ్రాస్‌కు, ఈ గడ్డమీదే పుట్టి ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతోందన్నారు. మనందరి ప్రభుత్వం 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని అడ్డుకుంటూ వాటిని రద్దు చేయడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు. 

బాబు మార్కు ఎక్కడైనా ఉందా?
ఈ వేదిక నుంచి చంద్రబాబుకు ఒక సవాల్‌ విసురుతున్నా. మీరు 14 ఏళ్లు పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. కానీ మీ పేరు చెబితే రైతులకు గుర్తు­కొచ్చే ఒక్కటైనా పథకం ఉందా?  మీ పేరు చెబితే అక్క­చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? మీ పేరు చెబితే విద్యార్థులకు గుర్తొచ్చే పథ­కం ఏదైనా ఉందా? మీ పేరు చెబితే కనీసం అవ్వాతాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు.. మా పెన్షన్‌ మా ఇంటికే పంపాడనే పరిస్థితి ఏనాడైనా ఉందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఫలా­నా మంచి చేశాడని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు.

చంద్రబాబు పేరు చెబితే  ఏ ఒక్క గ్రామంలోనైనా ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ ఒక్కటైనా కనిపిస్తుందా? బాగుపడిన స్కూళ్లు, ఆస్పత్రులు ఏ గ్రామంలోనైనా ఉన్నాయా? కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే మీ మార్క్‌ ఉందా చంద్రబాబూ? పథ­కాలను పక్కనపెడితే చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యా­యం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా?  మేనిఫెస్టోకు రంగులు పూసి ప్రతి సామాజికవర్గాన్ని మో­సం చే­యడం చంద్రబాబుకు ఆనవాయితీ. ఏనాడైనా కనీసం 10శాతం వా­గ్దానాలను అమలు చేశారా? బంగారు కడియం ఇస్తానంటూ ఊబిలోకి దింపి మను­షుల్ని తిన్న పులి మాదిరిగా మరోసారి ఎర వేస్తున్నాడు.

అబద్ధాలు చెప్పేటప్పుడు భావ దారిద్య్రం ఎందుకన్నది బాబు నైజం. నమ్మినవాడు మును­గు­తాడు.. నమ్మించినవాడు దోచుకోగలుగుతాడన్నది ఆయన సిద్ధాం­తం. చంద్ర­బాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. బాబు మోసాల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం అన్ని సామాజికవర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలంతా చొక్కా మడతేసి కుర్చీని లాగేసి చీపుర్లతో ఊడ్చి ఆయన పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు. అదే పని మరో­సారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. 

లబ్ధిదారులే స్టార్‌ క్యాంపెయినర్లు
మన ప్రభుత్వ హయాంలో పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్‌ క్యాంపెయినర్‌గా  బయటకు రావాలి. వైఎస్సార్‌ సీపీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాల్సిన అవసరాన్ని చెప్పాలి. మనం చేసినవి తెలియజేస్తూ వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంటికీ వివరించాలి. ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా గ్రామాల్లో రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను తెచ్చి తోడుగా నిలిచాం. సాగుకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చాం.  

ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోగానే రైతన్నకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వటం మొదలు పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఉచిత పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా, బాబు మార్క్‌ దళారీ వ్యవస్థ మళ్లీ రాకూడదన్నా ప్రతి రైతన్న మన స్టార్‌ క్యాంపెయినర్‌గా ముందుకొచ్చి ఇంకో వంద మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. విందు భోజనం, బిర్యానీ పెడతానంటూ ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెను లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు.

గతంలో ఇదే పెద్దమనిషి రూ.87,612 కోట్ల రుణ మాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకూ గుర్తుచేయాలి. అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, మహిళా పోలీస్‌.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతి అక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని, మరో వంద మందితో ఓటు వేయించాల్సిన బాధ్యత ఉందని మీరంతా చెప్పాలి. 

ఏ గ్రామానికైనా వెళదాం..
ఇవాళ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లి నిల్చున్నా ఓ విలేజ్‌ సెక్రటేరియట్‌ కనిపిస్తుంది. పది మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్‌ క్లినిక్, కడుతున్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపి­స్తాయి. నాడు–నేడుతో రూపురేఖలు మారిన బడు­లు, హాస్పిటల్స్‌ కనిపిస్తాయి. ప్రతి 50–60 ఇళ్లకు చే­యి పట్టుకొని నడిపించే మంచి వలంటీర్‌ వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఈ 57 నెలల కాలంలోనే జరిగాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో ఆగి చూసినా, ఏ సామాజికవర్గాన్ని పలుకరించినా మీ జగన్‌ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రజలు మనను మొదటిసారి ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగాం. సెకండ్‌ టైమ్, థర్డ్‌ టైమ్, ఫోర్త్‌ టైమ్‌ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

‘నా’ వాళ్లకు గరిష్టంగా లబ్ధి
అణగారిన వర్గాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలంటూ చరిత్రలో చూడని విధంగా నామినేషన్‌ పనులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ ఇస్తున్నది ఎవరంటే మీ జగన్‌ అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మీ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన రూ.2.55 లక్షల కోట్లలో 75 శాతం ‘నా..’ అని ఆప్యాయంగా పిలుచుకునే వర్గాలకే ఇచ్చాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఈ 57 నెలల పాలనలోనే ఏకంగా 2.13 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం.

ఆ ఉద్యోగాల్లో 80 శాతం నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకే దక్కాయి. ఇంతటి సామాజిక న్యాయం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కనిపిస్తోంది. 35 లక్షల ఎకరాలపై అనుభవదారులు, గిరిజనులు, రైతన్నలు, నిరుపేదలకు సర్వహక్కులు ఇచ్చింది ఎవరంటే మీ జగనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో సింహభాగం వాటా దక్కింది మీ జగన్‌ వచ్చాకే. చంద్రబాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటేయడమే.

డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడమే. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. మీరంతా గతంలో చంద్రబాబు పాలన చూశారు. ఇంకా చాలామంది పరిపాలన చూశారు. కానీ మేనిఫెస్టోను 99శాతం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నది మీ జగన్‌ మాత్రమే. మొదటి చాన్స్‌ ఇస్తేనే మీ జగన్‌ ఇంత గొప్పగా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మరి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి.

మీ జగన్‌ పేరు చెబితే..
మీ జగన్‌ పేరు చెబితే.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, బాగుపడ్డ పాఠశాలలు, బైజూస్‌ కంటెంట్, బైలింగ్యువల్‌ బుక్స్, ట్యాబ్‌లు, డిజిటల్‌ బోధనతో ఐఎఫ్‌పీ ప్యానళ్లు, తొలిసారిగా సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్, టోఫెల్‌ శిక్షణ, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం గుర్తొస్తాయి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్‌ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌లో మార్పులు, ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ చదువులతో అనుసంధానం.. ఇవన్నీ తల్లిదండ్రులకు వివరించాలి. ఇవన్నీ కొనసాగాలంటే,  పిల్లలు అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడాలంటే, పెత్తందార్ల పిల్లలతో పోటీ పడే పరిస్థితి రావాలంటే మీ అన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని చెప్పండి.

ఇవాళ ఒకటో తరగతిలో ఉన్న పేదింటి పాప, పేదింటి బాబు మరో 10–15 ఏళ్లలో అంతర్జాతీయ చదువులతో గొప్ప ఉద్యోగాలు సాధించాలంటే మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని ప్రతి ఇంటికీ చెప్పండి. సైకిల్‌కు ఓటేయడం అంటే గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం రద్దుకు ఓటేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి­ వద్దే రూ.3 వేల పెన్షన్లు కొనసాగాలన్నా, భవిష్యత్‌లో పెరగా­లన్నా, కొందరికే పింఛన్లు ఇచ్చిన రోజులు మళ్లీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు కాటేయకూడదన్నా ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలని ఇంటింటికీ వెళ్లి చెప్పాలి.

ఇవాళ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరినీ సేవలతో విస్తరించిన ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు, ఆరోగ్య ఆసరా, విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ఆదుకుంటున్నాయి. వీటి పేరు వింటే కోవిడ్‌ కష్టకాలంలో అందించిన సేవలు గుర్తుకొస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్నా, గడపగడపకూ వైద్యం అందించే పరిస్థితి కొనసాగా­లన్నా లబ్ధిదారులే స్టార్‌ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరాలి. 

57 నెలల్లో మీకోసం 125 సార్లు బటన్లు
ఈ 57 నెలల్లో నేను ప్రజల కోసం 125 సార్లు బటన్లు నొక్కా. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లాయి. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా, ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్‌ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్‌ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్‌ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా పోతుంది. పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్‌ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి. 

మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి
మన పాలనలో మీకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని, మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబ­డాలని మనం నిబద్ధతతో సిద్ధం అంటుంటే ఏ ఒక్కరికైనా ఏం చేశారో  చెప్పుకొనేందుకు ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. మేమూ సిద్ధం.. సంసిద్ధం అంటూ చంద్రబాబు పోస్టర్లు వేయిస్తున్నారు. ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం? పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావ్‌? 

కృష్ణుడిలా కోట్ల గుండెలు తోడున్నాయి..
దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడుగా కృష్ణుడి రూపంలో ప్రతి పేదవాడి ఇంట్లో కోట్ల గుండెలున్నాయి. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తులతో ఎన్నికల పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. ఇది మీ అందరి పార్టీ.  జగన్‌ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్సార్‌సీపీ. ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్‌ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని తెలియజేస్తున్నా.  

ప్రతి కార్యకర్త, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది. మా నాయకుడు మాటిచ్చాడంటే చేస్తాడంతే అని ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగరేసి చెప్పుకునేలా ఉండాలి. 99 శాతం వాగ్దానాలు అమలుచేసి ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో చూపించి మరీ ప్రజల ఆశీస్సులు కోరుతున్న పార్టీ మనదే. అందుకే ఎన్నికల్లో 175కు 175 మన టార్గెట్‌. మన టార్గెట్‌ 25కు 25 ఎంపీ సీట్లు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలేలేదు.

మరో 55 రోజుల్లో
మరో రెండు నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో. చంద్రబాబు అబద్ధాలు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎదుర్కొంటూ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలి. మీరంతా సెల్‌ఫోన్‌ టార్చిలైట్లు వెలిగించి సిద్ధమే అని చెప్పండి. ప్రతి కార్యకర్త, బూత్‌ కమిటీ సభ్యులు, వలంటీర్లు, గృహ సారథుల పాత్ర అత్యంత కీలకం. సమరభేరి మోగిద్దాం.. సమరనాదం వినిపిద్దాం. చంద్రబాబుకు ఇప్పటికే 75 ఏళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది.

ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు. ఈ ఎన్నికలు చాలా కీలకం కావడంతో పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. వీరంతా సరిపోరని జాతీయ పార్టీలతో పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా మరొకరితో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఒకే ఒక్కడిపై యుద్ధం చేయడానికి ఇన్ని తోడేళ్లు ఏకం అవుతున్నాయి. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్‌ ఒక్కడికే సాధ్యం కాదు. మీ జగన్‌కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, తల్లీతండ్రీ, ప్రతి రైతన్న మీ జగన్‌కు తోడుగా స్టార్‌ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మీరు వేసే ఓటు పేదవాడి భవిష్యత్‌ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది.  పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి. 

మీకెందుకు ఓటేయాలి బాబూ?
జగన్‌ మార్కు ప్రతి గ్రామంలో కనిపి­స్తున్నప్పుడు, ప్రతి పేద ఇంట్లో, ప్రతి సా­మాజికవర్గంలో, ప్రతి ప్రాంతంలో మంచి మార్పు కనిపిస్తున్నప్పుడు బాబుకు ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నా. జగన్‌ పాల­నలో ప్రజలకు మంచి చేయలేదని, జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ? అని అడుగుతున్నా. ఊతం కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా? సైకిల్‌ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్‌ ఎందుకయ్యా? జగన్‌ ప్రతి ఇంటికీ మంచి చేశాడని తెలుసు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top